ఎఫ్‌పీఓకు అదానీ గుడ్‌బై
ABN , First Publish Date - 2023-02-02T03:24:03+05:30 IST
అదానీ గ్రూప్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ (ఏఈఎల్) రూ.20,000 కోట్ల ఎఫ్‌పీ ఓను రద్దు చేయాలని తీర్మానించింది...
ఇన్వెస్టర్లకు డబ్బులు వాపస్.. మదుపరుల ఒత్తిడే కారణం !
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ (ఏఈఎల్) రూ.20,000 కోట్ల ఎఫ్‌పీ ఓను రద్దు చేయాలని తీర్మానించింది. ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్ని ఇన్వెస్టర్లకు తిరిగి వాపస్ చేయాలని నిర్ణయించింది. ఏఈఎల్ డైరెక్టర్ల బోర్డు బుధవారం రాత్రి దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ముగిసిన ఈ ఇష్యూ 112 శాతం సబ్‌స్ర్కిప్షన్‌తో గట్టెక్కింది. అయినా బుధవారం ఏఈఎల్ షేర్లు మార్కెట్‌లో 29 శాతం వరకు నష్టపోయి ఎఫ్‌పీఓ ధర కంటే భారీ డిస్కౌంట్‌తో ట్రేడయ్యాయి. దీంతో ఎఫ్‌పీఓను ఆదుకున్న సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి, ఇష్యూ రద్దు చేయాలని అదానీలపై పెద్దఎత్తున ఒత్తిడి వచ్చినట్టు సమాచారం. ఈ ఒత్తిడికి తలొగ్గే అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ విషయం నేరుగా చెప్పలేక ప్రస్తుత అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ‘నైతిక’ విలువలకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మొక్కుబడిగా ప్రకటన విడుదల చేసింది.
అందరికీ కృతజ్ఞతలు: తమపై నమ్మకంతో ఎఫ్‌పీఓ ద్వారా ఏఈఎల్ షేర్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన మదుపరులు అందరికీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అసాధారణ పరిస్థితులకు హిండెన్‌బర్గ్ నివేదిక కారణమనే విషయాన్ని కూడా ఏఈఎల్ బోర్డు ఎక్కడా పేర్కొనలేదు. మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసమే వారి డబ్బులు వాపస్ చేయాలని నిర్ణయించింది.
ఆది నుంచీ కష్టాలే: జనవరి 27న ప్రారంభమైన ఏఈఎల్ ఎఫ్‌పీఓ మంగళవారమే ముగిసింది. హిండెన్‌బర్గ్ నివేదిక దెబ్బతో రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు ఈ ఇష్యూకి దూరంగా ఉన్నారు. కొన్ని సంస్థాగత మదుపరుల ద్వారా ఈ ఇష్యూ 112 శాతం సబ్‌స్ర్కైబ్ అయింది. అదానీలకు సన్నిహితులైన కొన్ని పారిశ్రామిక కుటుంబాల నిర్వహణలోని సంస్థలూ ఇందుకు తలా ఒక చెయ్యి వేశాయి. అయినా ఏకంగా ఎఫ్‌పీఓను రద్దు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్య పరిచింది.