LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్ చెప్పినట్టే చెప్పి బాంబు పేల్చిన కంపెనీలు.. గ్యాస్ సిలిండర్ రేట్లు ఆగస్టు నెల నుంచి ఎంతంటే..!
ABN , First Publish Date - 2023-08-01T10:24:42+05:30 IST
ఆగష్టు 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు వెలువడ్డాయి. సిలిండర్ ధర ఏకంగా 100రూపాయలు తగ్గిందనే వార్త ప్రజలకు పండుగలానే అనిపించింది. కానీ..
ప్రతి నెలా ఒకటో తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరలను సవరించే చమురు కంపెనీలు మంగళవారం (ఆగస్టు 1) కీలక ప్రకటన చేశాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ వంట గ్యాస్ ధరను గణనీయంగా తగ్గించాయి. సిలిండర్‌పై రూ.99.75 మేర తగ్గిస్తున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. సవరించిన ధరల ప్రకారం.. ప్రస్తుతం 19కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,028, కోల్‌కతాలో రూ.2,132, చెన్నైలో రూ. 2,192, విశాఖపట్టణంలో రూ 1,750.50, హైదరాబాద్ లో రూ. 1918 గా ఉన్నాయి. ఇక ఇంట్లో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు హైదరాబాద్ లో రూ 1,155, విశాఖపట్టణంలో రూ. 1,112, ఢిల్లీలో 1,103, కోల్కతా లో రూ 1,129, ముంబైలో రూ 1,102.50, చెన్నైలో రూ 1,118 ఉన్నాయి.
కాగా కమర్షియల్ గ్యాస్ ధర తగ్గింపు ద్వారా కొంత ఉపశమనం కల్పించినప్పటికీ.. గృహవినియోగ వంట గ్యాస్‌పై ఎలాంటి తగ్గింపు లేకపోవడం సామాన్యులను ఉసూరుమనిపించింది. ధరలు కాస్తయినా తగ్గొచ్చేమోననే ఆశలు అడియాసలయ్యాయి. తగ్గింపు సంగతి పక్కనపెడితే.. ఎలాంటి పెంపు లేకపోవడం కూడా కొంచెం ఉపశమనం కలిగించేదిగా చెప్పాలి. ఇదిలావుండగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర ప్రతి నెలా ఒకటో తేదీన సవరణకు గురవుతుంటాయి. కంపెనీల నిర్ణయాన్ని బట్టి పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. గత నెల్లో గృహ వినియోగ గ్యాస్ ధరను రూ. 50 మేర పెంచిన విషయం తెలిసిందే. ఇక కమర్షియల్ సిలిండర్ ధర గతనెలలో 350రూపాయలు పెరిగినమాట తెలిసిందే. ఈ నెలలో కేవలం రూ 99.75 తగ్గించడం పట్ల కమర్షియల్ గ్యాస్ వినియోగదారులు కూడా పెద్దగా సంతోషపడట్లేదు. కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా మార్పులకు లోనవ్వడం సహజమే అయినా భారీ మార్పులు మాత్రం వ్యాపారస్తులకు ఇబ్బందికరంగానే మారుతున్నాయని చెబుతున్నారు.