AI supercomputers : భారత్‌లో ఏఐ సూపర్‌ కంప్యూటర్ల తయారీ

ABN , First Publish Date - 2023-09-09T04:37:09+05:30 IST

అత్యాధునిక, అత్యంత వేగవంతమైన చిప్‌ల తయారీకి పేరుగాంచిన అమెరికన్‌ టెక్‌ దిగ్గజం ఎన్‌విడియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) శుక్రవారం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం

AI supercomputers : భారత్‌లో ఏఐ సూపర్‌ కంప్యూటర్ల తయారీ

అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌విడియాతో రిలయన్స్‌, టాటా గ్రూప్‌ భాగస్వామ్యం

జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు విచ్చేసిన రోజునే ఆ దేశానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎన్‌విడియా భారత్‌కు చెందిన రెండు దిగ్గజ వ్యాపార సామ్రాజ్యాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు కంపెనీలతో కలిసి కృత్రిమ మేధ (ఏఐ) సూపర్‌ కంప్యూటర్ల తయారీతోపాటు ఏఐ, జనరేటివ్‌ ఏఐ ఆధారిత అప్లికేషన్లు ఇతర పరిష్కారాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను అందించనుంది. ఏఐ సూపర్‌ పవర్‌గా ఎదగాలన్న ఆశయాలకు తమ వంతు కృషి చేసేందుకు ఎన్‌విడియాతో భాగస్వామ్యం దోహదపడనుందని రిలయన్స్‌, టాటా అభిప్రాయపడ్డాయి.

న్యూఢిల్లీ: అత్యాధునిక, అత్యంత వేగవంతమైన చిప్‌ల తయారీకి పేరుగాంచిన అమెరికన్‌ టెక్‌ దిగ్గజం ఎన్‌విడియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) శుక్రవారం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సూపర్‌ కంప్యూటర్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. ఎన్‌విడియా వ్యవస్థాపకులు, సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ సోమవారం నాడు భారత ప్రధాని మోదీని కలిశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దేశంలోని అత్యంత విలువైన కంపెనీ ఆర్‌ఐఎల్‌తో ఎన్‌విడియా జట్టు కట్టడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌కు మించిన ఏఐ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధికి ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. భారత్‌ కోసం స్థానిక భాషల్లో శిక్షణ పొందిన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) అభివృద్ధి తోపాటు జనరేటివ్‌ ఏఐ అప్లికేషన్లను రూపొందించనున్నట్లు తెలిపింది. రిలయన్స్‌కు ఎన్‌విడియా తన అత్యాధునిక, అసాధారణ పనితీరు, అత్యంత భారీ మెమొరీ బ్యాండ్‌విడ్త్‌తో కూడిన జీహెచ్‌200 గ్రేస్‌ హోప్పర్‌ సూపర్‌ చిప్‌తో పాటు క్లౌడ్‌లో ఏఐ సూపర్‌ కంప్యూటింగ్‌ సేవలందించే డీజీఎక్స్‌ క్లౌడ్‌కు యాక్సెస్‌ కల్పించనుంది. ఎన్‌విడియాకు చెందిన ఈ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సాయంతో ఆర్‌ఐఎల్‌కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన కస్టమర్ల కోసం ఏఐ అప్లికేషన్లు, సేవలను అభివృద్ధి చేయనుంది. అలాగే, దేశంలోని శాస్త్రవేత్తలు, డెవలపర్లు, స్టార్ట్‌పలకు ఏఐ మౌలిక వసతులను కల్పించనుంది. ఏఐ రెడీ కంప్యూటింగ్‌ డేటా సెంటర్లలో ఈ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు.. ఎగ్జిక్యూషన్‌, ఇంప్లిమెంటేషన్‌ను జియో చేపట్టనున్నట్లు ప్రకటన పేర్కొంది.

టాటాతోనూ టైఅప్‌

దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌తోనూ ఎన్‌విడియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. టాటా గ్రూప్‌ ఏఐ ఆధారిత సొల్యూషన్లను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఏఐ కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్లాట్‌ఫామ్స్‌ను ఎన్‌విడియా సమకూర్చనుంది. ఈ భాగస్వామ్యం లో భాగంగా టాటా కమ్యూనికేషన్స్‌, ఎన్‌విడియా కలిసి దేశంలో ఏఐ క్లౌడ్‌ను అభివృద్ధి చేయనున్నాయి. భవిష్యత్‌ తరం కంప్యూటింగ్‌కు మౌలిక వసతిగా ఈ క్లౌడ్‌ పనిచేయనుంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఐటీ కంపెనీ టీసీఎస్‌ ఈ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సామర్థ్యాలను జనరేటివ్‌ ఏఐ అప్లికేషన్ల అభివృద్ధి, ప్రాసెసింగ్‌కు వినియోగించుకోనుంది. అంతేకాదు, ఈ భాగస్వామ్య సాయంతో టీసీఎస్‌ తన 6 లక్షలకు పైగా ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణనివ్వనుంది. అంతేకాదు, జీహెచ్‌200 గ్రేస్‌ హోపర్‌ సూపర్‌ చిప్‌ ద్వారా దేశంలో ఇరు సంస్థలు కలిసి ఏఐ సూపర్‌ కంప్యూటర్‌ను అభివృద్ధి చేయనున్నాయి. టాటా గ్రూప్‌లోని మాన్యుఫాక్చరింగ్‌ నుంచి వినియోగదారుల వ్యాపారాలన్నింటిలోనూ ఏఐ ఆధారిత పరివర్తనానికి ఈ భాగస్వామ్యం ఉత్ర్పేరకంగా పనిచేయనుందని ఎన్‌విడియా పేర్కొంది.

2004 నుంచే భారత్‌లో ఎన్‌విడియా కార్యకలాపాలు

ఎన్‌విడియా 2004 నుంచే భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ కంపెనీ హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, గురుగ్రామ్‌లో ఇంజనీరింగ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ నాలుగు కార్యాలయాల్లో 3,800 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

భారత్‌ డేటా విస్తరణ దేశం స్థాయి నుంచి విస్తృత, వేగవంతమైన వృద్ధి, కంప్యూటింగ్‌కు అవసరమైన సాంకేతిక మౌలిక వసతులను ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. దేశంలో డిజిటల్‌ సేవల వినియోగ వృద్ధికి జియో దోహదపడినట్లుగా.. ఎన్‌విడియాతో కలిసి మేము ఏర్పాటు చేయనున్న టెక్నాలజీ సూపర్‌ సెంటర్‌ వృద్ధికి ఉత్ర్పేరకంగా పనిచేయనుంది.

- ముకేశ్‌ అంబానీ, చైర్మన్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

ప్రపంచంలో జనరేటివ్‌ ఏఐ పరిష్కారాల అభివృద్ధి జోరందుకుంది. జనరేటివ్‌ ఏఐకి విశేషంగా పెరిగిన గిరాకీకి మద్దతిచ్చేందుకు వీలుగా ఇంధనం ఆదా చేయగలిగే మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు జీపీయూ కంప్యూటింగ్‌కు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్‌, టాటా గ్రూప్‌తోనూ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. మా ఏఐ సూపర్‌ కంప్యూటింగ్‌తో కలిసి టాటా తన క్లౌడ్‌ ఇన్‌ఫ్రాను విస్తరించనుంది. తద్వారా జనరేటివ్‌ ఏఐ స్టార్టప్‌లకు అసాధారణ స్థాయిలో పెరిగిన డిమాండ్‌తోపాటు ఎల్‌ఎల్‌ఎంల ప్రాసెసింగ్‌కు మద్దతివ్వనుంది. అత్యాధునిక ఏఐ కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సాయంతో భారత్‌లో, భారతీయుల కోసం తయారు చేసే అప్లికేషన్లకు అవసరమైన సొంత లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ను రిలయన్స్‌ అభివృద్ధి చేయగలదు.

- జెన్సన్‌ హువాంగ్‌, సీఈఓ, వ్యవస్థాపకులు, ఎన్‌విడియా

పరిశ్రమలతో పాటు ప్రజల జీవనంపై ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ గాఢమైన ప్రభావం చూపనున్నాయి. ఏఐ మౌలిక వసతులు, ఏఐ ఆధారిత పరిష్కారాలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్‌విడియాతో మా భాగస్వామ్యం దోహదపడనుంది. అంతేకాదు, ఏఐ నైపుణ్య అభివృద్ధి స్థాయిని పెంచనుంది. అన్ని రంగాల్లో టాటా గ్రూప్‌ మనుగడతో పాటు ఎన్‌ విడియా బలమైన సాంకేతిక సామర్థ్యాలు భారత ఏఐ ఆశయాలను సంయుక్తంగా ముందుకు నడిపించేందుకు పలు ఆవకాశాలను పంచనున్నాయి.

- ఎన్‌ చంద్రశేఖరన్‌,చైర్మన్‌, టాటా గ్రూప్‌

‘చిప్‌’ల తయారీలోకి రిలయన్స్‌!?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సెమీకండక్టర్ల (చిప్‌) తయారీలోకి సైతం ప్రవేశించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు విదేశీ చిప్‌ తయారీ కంపెనీలతో సాంకేతిక భాగస్వామ్యం కోసం ప్రాథమిక చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చిప్‌ల తయారీలోకి అడుగు పెట్టాలని రిలయన్స్‌ భావిస్తోందని, ఇందుకు నిర్దిష్ఠ సమయమేమీ పెట్టుకోలేదని వారు పేర్కొన్నారు. ఈ రంగంలో పెట్టుబడులపై అంబానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా, చిప్‌ల తయారీలోకి ప్రవేశించనున్నట్లు టాటా గ్రూప్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం ఐదేళ్లలో 9,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నారు.

Updated Date - 2023-09-09T04:37:21+05:30 IST