SBI : ఎస్‌బీఐ రికార్డు లాభం

ABN , First Publish Date - 2023-08-05T04:16:53+05:30 IST

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను అదరహో అన్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జూన్‌తో ముగిసిన మొదటి

SBI : ఎస్‌బీఐ రికార్డు లాభం

క్యూ1లో 178% వృద్ధితో రూ.16,884 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను అదరహో అన్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) ఎస్‌బీఐ స్టాండ్‌ఎలోన్‌ నికర లాభం సరికొత్త రికార్డు స్థాయి రూ.16,884 కోట్లకు ఎగబాకింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.6,068 కోట్ల లాభంతో పోలిస్తే రెండింతలకు పైగా (178 శాతం) వృద్ధి కనబర్చింది. మొండి బకాయిలు మరింత తగ్గడంతో పాటు వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడిందని బ్యాంక్‌ పేర్కొంది. ఎస్‌బీఐ త్రైమాసిక లాభం సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి పెరగడం వరుసగా ఇది నాలుగోసారి. కాగా, జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం రూ.18,537 కోట్లు, ఆదాయం రూ.1,32,333 కోట్లుగా నమోదైంది. మరిన్ని ముఖ్యాంశాలు..

  • ఈ ఏప్రిల్‌-జూన్‌ కాలానికి బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.1,08,039 కోట్లకు పెరిగింది. క్రితం సంవత్సరంలో ఇదే సమయానికి గడించిన రాబడి రూ.74,989 కోట్లుగా నమోదైంది.

  • సమీక్షా కాలానికి బ్యాంక్‌ స్థూల వడ్డీ ఆదాయం రూ.95,975 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలానికి రూ.72,676 కోట్లుగా ఉంది. కాగా, నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 24.7 శాతం వృద్ధితో రూ.38,905 కోట్లుగా.. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 0.24 శాతం పెరుగుదలతో 3.47 శాతానికి ఎగబాకింది.

  • ఈ జూన్‌ చివరినాటికి బ్యాంక్‌ మొత్తం రుణాల్లో మొండి బకాయిలు లేదా స్థూల నిరర్ధక ఆస్తుల (గ్రాస్‌ ఎన్‌పీఏ) వాటా 2.76 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పీఏలు కూడా 0.71 శాతానికి దిగివచ్చాయి.

  • మొండిబాకీల నష్టాన్ని పూడ్చుకునేందుకు బ్యాంక్‌ రూ.2,652 కోట్ల కేటాయింపులు జరిపింది. గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో కేటాయింపులు రూ.4,268 కోట్లుగా ఉన్నాయి.

  • ఈ జూన్‌ త్రైమాసికంలో ఎస్‌బీఐ దేశీయ రుణాలు వార్షిక ప్రాతిపదికన 15.08 శాతం పెరిగి రూ.33,03,731 కోట్లకు చేరుకున్నాయి. రుణ వృద్ధి 13.90 శాతంగా నమోదైంది. మొత్తం డిపాజిట్లు 12 శాతం పెరిగి రూ.45,31,237 కోట్లుగా నమోదయ్యాయి.

  • జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ తన సాధారణ బీమా విభాగమైన ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు రూ.489.67 కోట్లు, 8 గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ)లకు రూ.82.16 కోట్లు సమకూర్చింది.

  • బీఎ్‌సఈలో ఎస్‌బీఐ షేరు ధర శుక్రవారం 2.94 శాతం తగ్గి రూ.573.25 వద్ద ముగిసింది. దాంతో బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.15,484 కోట్లు తగ్గి రూ.5.11 లక్షల కోట్లకు తగ్గింది.

గృహ రుణాల మార్కెట్లో ఎస్‌బీఐ గత, వర్తమానంతోపాటు భవిష్యత్‌లోనూ అగ్రగామిగా కొనసాగనుంది. ఈ జూన్‌ త్రైమాసికం చివరి నాటికి బ్యాంక్‌ గృహ రుణ బుక్‌ విలువ రూ.6.52 లక్షల కోట్లకు పైబడి ఉంది. క్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే, విలువ 14 శాతం పెరిగింది.

- దినేశ్‌ ఖారా, చైర్మన్‌,ఎస్‌బీఐ

Updated Date - 2023-08-05T04:17:15+05:30 IST