జయహో భారత్‌!

ABN , First Publish Date - 2023-06-01T00:36:27+05:30 IST

భారత ప్రగతి రథం వేగం అం దుకోవడంతో ఆర్థిక వృద్ధి గణాంకాలు అంచనాలను మించిపోయాయి. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ..

జయహో భారత్‌!

గత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.2శాతం

నాలుగో త్రైమాసికంలో 6.1 శాతం

ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి నమోదు

న్యూఢిల్లీ: భారత ప్రగతి రథం వేగం అం దుకోవడంతో ఆర్థిక వృద్ధి గణాంకాలు అంచనాలను మించిపోయాయి. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) నాలుగో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతానికి ఎగబాకింది. ఆర్‌బీఐ అంచనా 5.1 శాతం, మార్కెట్‌ వర్గాల అంచనా 5.5 శాతంతో పాటు ఈ కాలానికి చైనా వృద్ధి రేటు 4.5 శాతంతో పోలిస్తే ఇది చాలా అధికం. అంతేకాదు, నాలుగో త్రైమాసిక గణాంకాల దన్నుతో 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీ వృద్ధిరేటు 7.2 శాతానికి చేరుకుంది. ప్రభుత్వ ముందస్తు అంచనా 7 శాతంతో పోలిస్తే 0.2 శాతం అధికంగా నమోదైంది. వ్యవసాయం, తయారీ, మైనింగ్‌, నిర్మాణ రంగాలు మెరుగైన పనితీరు కనబర్చడం ఇందుకు దోహదపడింది. బలమైన వృద్ధితో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3.3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. మరికొన్నేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చాలన్న లక్ష్య సాకారాన్ని సుసాధ్యం చేసింది.

వార్షిక జీడీపీ రూ.160.06 లక్షల కోట్లు

జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను స్థిర (2011-12) ధరల ఆధారిత జీడీపీ లేదా వాస్తవిక జీడీపీ విలువ రూ.160.06 లక్షల కోట్లకు చేరుకుంది. 2021- 22కి నమోదైన రూ.149.26 లక్షల కోట్లతో పోలిస్తే 7.2 శాతం వృద్ధి కనబర్చింది. నాలుగో త్రైమాసికానికి రియల్‌ జీడీపీ రూ.43.62 కోట్లుగా ఉంది. 2021-22లో ఇదే కాలానికి నమోదైన రూ.41.12 లక్షల కోట్ల జీడీపీతో పోలిస్తే 6.1 శాతం పెరిగింది. కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ఆధారిత జీడీపీ లేదా నామమాత్ర జీడీపీ రూ.272.41 లక్షల కోట్లకు (3.3 లక్షల కోట్ల డాలర్లు) ఎగబాకింది. 2021-22లో నమోదైన రూ.234.71 లక్షల కోట్ల (2.8 లక్షల కోట్ల డాలర్లు) జీడీపీతో పోలిస్తే 16.1 శాతం వృద్ధి కనబర్చింది. నాలుగో త్రైమాసికంలో నామినల్‌ జీడీపీ రూ.71.82 లక్షల కోట్లకు పెరిగింది. 2021-22లో ఇదే కాలానికి నమోదైన రూ.65.05 లక్షల కోట్లతో పోలిస్తే 10.4 శాతం పుంజుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి స్థూల విలువ జోడింపు(జీవీఏ) 7 శాతంగా ఉంది. 2021-22లో జీవీఏ 8.8 శాతంగా, రియల్‌ జీడీపీ 9.1 శాతంగా నమోదైంది.

ద్రవ్యలోటు 6.4 శాతం

ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసినట్లుగానే, గడిచిన ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 6.4 శాతానికి పరిమితమైంది. 2021-22లో లోటు 6.71 శాతం ఉంది. 2023-24లో ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి కట్టడి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2022-23లో కేంద్ర ప్రభుత్వానికి మొత్తం రూ.24.56 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా.. మొత్తం వ్యయం రూ.41.89 లక్షల కోట్లుగా ఉంది. దాంతో ద్రవ్యలోటు రూ.17.33 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెల ముగిసేసరికి ద్రవ్యలోటు రూ.1.33 లక్షల కోట్లుంది (వార్షిక అంచనాలో 7.5 శాతం).

తలసరి ఆదాయం రూ.98,374

నికర జాతీయ ఆదాయం ప్రకారంగా, గత ఆర్థిక సంవత్సరానికి భారత ప్రజల తలసరి ఆదాయం రూ.98,374కు పెరిగింది. 2021-22లో రూ.92,583గా ఉంది. నికర జాతీయ ఆ దాయం రూ.126.71 లక్షల కోట్ల నుంచి రూ.136.04 లక్షల కోట్లకు ఎగబాకింది.

6 నెలల కనిష్ఠానికి కీలక రంగాల పనితీరు

దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన 8 రంగాల (స్టీల్‌, సిమెంట్‌, బొగ్గు, విద్యుత్‌, ఎరువులు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ) పనితీరు మళ్లీ మందగించింది. ఏప్రిల్‌లో ఈ రంగాల మొత్తం ఉత్పత్తి వృద్ధి ఆరు నెలల కనిష్ఠ స్థాయి 3.5 శాతానికి తగ్గింది. ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ, విద్యుత్‌ రంగాల్లో ఉత్పత్తి తగ్గడం ఇందుకు కారణం. పారిశ్రామికోత్పత్తి సూచీలో (ఐఐపీ)ఈ 8 రంగాల వెయిటేజీ 40.27 శాతంగా ఉంది. కాబట్టి, కీలక రంగాల పనితీరులో తగ్గుదల మొత్తం పారిశ్రామికోత్పత్తిపై ప్రభావం చూపుతుంది.

అంతర్జాతీయ సవాళ్లలోనూ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతకు తాజా జీడీపీ గణాంకాలే నిదర్శనం.

ప్రధాని నరేంద్ర మోదీ

భారత్‌ మరో ఏడాది బలమైన ఆర్థిక పనితీరును కనబర్చబోతున్నది. 2023-24లోనూ వృద్ధి రేటు 6.5 శాతం అంచనాను మించి నమోదు కావచ్చు.

ముఖ్య ఆర్థిక సలహాదారు

వీ అనంత నాగేశ్వరన్‌

Updated Date - 2023-06-01T00:36:27+05:30 IST