బాణసంచా గోదాములో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2023-01-01T08:55:34+05:30 IST

ఏడాది చివరి రోజు ఘోర ప్రమాదం సంభవించింది. నామక్కల్‌ జిల్లా మోగనూరులోని బాణాసంచా గోదాములో శనివారం తెల్లవారుజామున

బాణసంచా గోదాములో అగ్ని ప్రమాదం

- ముగ్గురు మహిళలు సహా నలుగురి మృతి

- అగ్నికి ఆహుతైన 20 ఇళ్లు

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 31: ఏడాది చివరి రోజు ఘోర ప్రమాదం సంభవించింది. నామక్కల్‌ జిల్లా మోగనూరులోని బాణాసంచా గోదాములో శనివారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మహిళల సహా నలుగురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో చుట్టుపక్కల ఉన్న 20 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాలిలా... మోగనూరు మేట్టువీధికి చెందిన తిల్లైకుమార్‌ (40) బాణసంచా విక్రయిస్తుంటాడు. నూతన సంవత్సరం సందర్భంగా విక్రయాల కోసం టన్ను బాణసంచా తీసుకొచ్చి ఇంట్లో నిల్వచేశాడు. శనివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో హఠాత్తుగా ఇంట్లో మంటలు చెలరేగి బాణసంచా భారీ శబ్దాలతో పేలింది. ఇల్లంతా తగలబడి, కుప్పకూలిపోయింది. అంతేగాక ఆ ఇంటి చుట్టుపక్కలున్న 20 ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. దగ్ధమైన గృహంలో తిల్లైకుమార్‌, ఆయన తల్లి సెల్వి (60), భార్య ప్రియ (30), పక్కింట్లో నివసిస్తున్న పెరియక్కాల్‌ (75) సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న నామక్కల్‌ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు అదుపుచేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు నామక్కల్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నరు. ఇదిలా ఉండగా ప్రమాద వార్త తెలిసిన సీఎం స్టాలిన్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిసిన ఆయన రూ.తలా 2లక్షలు, క్షతగాత్రులకు తలా రూ.50వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

Updated Date - 2023-01-01T08:55:49+05:30 IST