Share News

కలాన్ని, గళాన్ని మేళవించిన సృజనకారుడు

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:38 AM

సామ్రాజ్యవాద వ్యతిరేక గళం ఒకటి డిసెంబర్ 7న మూగబోయింది. జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన ఒక కలం ఆగిపోయింది. పీడిత జాతులు...

కలాన్ని, గళాన్ని మేళవించిన సృజనకారుడు

సామ్రాజ్యవాద వ్యతిరేక గళం ఒకటి డిసెంబర్ 7న మూగబోయింది. జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన ఒక కలం ఆగిపోయింది. పీడిత జాతులు ఒక స్నేహితుడిని కోల్పోయాయి. బెంజమిన్‌ జెఫనాయా 65 ఏళ్ళ వయస్సులో మెదడులో కణితి కారణంగా చనిపోయాడు. తల్లిదండ్రులు కరీబియన్‌ ద్వీపాలనుండి బర్మింగ్‌ హామ్‌ (బ్రిటన్‌)లోని హాండ్స్‌వర్త్‌కు వలస వచ్చారు. తండ్రి పోస్ట్‌మన్‌, తల్లి నర్సు. హాండ్స్‌వర్త్‌ను జెఫనాయా ‘కరీబియన్ల యూరోప్‌ రాజధాని’ అంటాడు.

జెఫనాయాకు ఐదుగురు సోదరులు, ఒక అక్క. తండ్రి హింసను భరించలేక తల్లి పదేళ్ళ వయసులో ఉన్న జెఫనాయాను తీసుకుని వెళ్ళిపోయింది. పేదరికం, జాతివివక్షల వాతావరణంలో జెఫనాయా పెరిగాడు. చదవటం, రాయడంలో వెనకబడుతుండడంతో జెఫనాయాను స్కూల్‌ నుంచి తీసేశారు. జమైకన్‌ పాప్‌ కవిత్వంతో రెగే సంగీతాన్ని మేళవించి చర్చిల్లో ప్రదర్శనలిచ్చేవాడు. పదిహేను ఏళ్ళకే హాండ్స్‌వర్త్‌లో ఆఫ్రికన్‌, కరీబియన్‌ సముదాయాల్లో కవిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

యువకుడిగా చిల్లర నేరాలు చేసి జైలుకెళ్ళాడు. 22 ఏళ్ళ వయస్సులో లండన్‌ చేరాడు. ప్రధాని థాచర్‌ పాలన ప్రారంభమై అప్పటికే సంవత్సరం అయింది. బ్రిటన్‌ తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉంది. నిరుద్యోగం, పేదరికం తాండవమాడుతున్నాయి. థాచర్‌ కార్మిక వర్గంపై యుద్ధం ప్రకటించింది. పరిశ్రమలను మూతపెట్టడం ప్రారంభించింది. పెరుగుతున్న నేరాలను అరికట్టే నెపంతో వాగ్రన్సీ చట్టం తెచ్చింది. నల్లజాతి వ్యతిరేక దురహంకారం ఉన్న వాతావరణంలో పోలీసులు నల్లజాతి ప్రజల్నే రాజ్యహింసకు గురిచేశారు. లండన్‌ వచ్చిన జెఫనాయా టోరీ ప్రభుత్వ పోలీసులకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నాడు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా మొదలయిన క్రియాశీలతను జెఫనాయా తన ఆఖరి శ్వాసవరకు నిలబెట్టుకున్నాడు.

22 ఏళ్ళప్పుడు చదవడం, రాయడం కోసం వయోజన విద్యాశాలలో చేరాడు. అప్పుడే జెఫనాయాకు తెల్సింది– తనకు డిస్లెక్సియా ఉందని. దాన్ని అధిగమించటానికి ఎంతో పోరాడాడు. అప్పటికే డబ్‌1 కవిత్వంలో, రెగే2 సంగీతంలో ప్రావీణ్యుడు. తన కలంలోని ప్రతి సిరా చుక్కా–పీడిత ప్రజల కోసం, జాతి దురహంకార వ్యవస్థకు వ్యతిరేకంగా ఉపయోగించడం ప్రారంభించాడు. లండన్‌లో కార్మికుల కో–ఆపరేటివ్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ తర్వాతే ఆయన మొదటి కవితల సంకలనం ‘పెన్‌రిధమ్‌’ వచ్చింది. జెఫనాయా కవిత్వం, గానం, సామాజిక క్రియాశీలత పడుగు పేకల్లాగా కలిసిపోయాయి. జెఫనాయాకు తెలుసు తన ప్రేక్షకులెవ్వరో. చదువుకోలేని వారికి కూడా తన కవిత్వం చేరాలి. అందుకే ఆయన తన డబ్‌ కవిత్వాన్ని రెగే సంగీతంతో మేళవించి ప్రదర్శనల్లో పాడేవాడు. తేలిక పదాలతో, బలమైన చిత్రణచేసే భావాలతో అట్టడుగు జన సముదాయాలకు అర్థమయ్యేలా ఉంటుంది జెఫనాయా కవిత్వం. బ్రిటిషు న్యాయ వ్యవస్థ జాత్యహంకారాన్ని ఎట్లా పరిరక్షిస్తుందో 1995లో వెలువడ్డ తన కవితా సంకలనం ‘డ్రెడ్‌ అఫైర్‌’ లో ఎండగట్టాడు. రాజ్యహింస ఎక్కడున్నా నిరసిస్తూ నిలబడ్డాడు. 1972లో ఉత్తర ఐర్లాండ్ అసోసియేషన్‌ నిర్వహించిన ఒక ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనని బాగ్‌సైడ్‌ నరమేధం అంటారు. ఈ రక్తసిక్త ఘటనపై జరుగుతున్న విచారణలో జెఫనాయా క్రమం తప్పకుండా పాల్గొనేవాడు. న్యాయవ్యవస్థ ఎంత డొల్లగా ఉందో 2001లో వచ్చిన తన ‘టూ బ్లాక్‌, టూ స్ట్రాంగ్‌’ కవితా సంకలనంలో చెప్పాడు.

జెఫనాయా పిల్లల కోసం కవిత్వం రాశాడు. ఆయన పూర్తి శాకాహారిగా మారాడు. 1994లో ప్రచురణ అయిన ‘టాకింగ్‌ టర్కీస్‌’ 66 వేలు కాపీలు ముద్రణ అయ్యాయి. యువతరం కోసం ‘ఫేస్‌’ అనే నవల రాశాడు. తూర్పు ఆఫ్రికా నేపధ్యంలో రాసిన ‘రెప్యూజీ బాయ్‌’లో పద్నాలుగేళ్ళ కాందిశీకుడే కేంద్రం. ఈ నవల కూడా జెఫనాయాకు మంచి పేరు తెచ్చింది. తర్వాత దీన్ని నాటకంగా రూపొందించారు. 2003 నాటికి జెఫనాయా తన రచనల ద్వారా, ప్రదర్శనల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. బ్రిటన్‌లో జాత్యహంకారం ఎలా మారుతున్నదనే విషయం మీద బీబీసీకి ఒక డాక్యుమెంటరీ తయారు చేశాడు. నల్లజాతి ప్రజలకు వ్యతిరేకంగా జాత్యహంకారంలో మార్పు వస్తున్నా, యూరోప్‌లో ఇస్లామోఫోభియా పెరుగుతోందని ఆ డాక్యుమెంటరీలో వాస్తవంగా జరిగిన ఓ ఘటన చూపిస్తాడు. 2015లో లండన్‌లోని ఒక మెట్రో రైల్లో హిజాబ్ ధరించిన మహిళను ఐసిసికు చెందినదంటూ మరో మహిళ అసభ్యకరంగా మాట్లాడడం చూపిస్తాడు. కొన్ని సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో నటించాడు. ‘టినీ స్పార్క్‌’ అనే డాక్యుమెంటరీ రూపొందించాడు. హాండ్స్‌వర్త్‌లో 1985లో రెండురోజుల పాటు పోలీసులపై నల్లజాతి ప్రజల తిరుగుబాటే ఈ డాక్యుమెంటరీ విషయం. జెఫనాయా కవిత్వం ఈ డాక్యుమెంటరీ నిండా పరుచుకొని ఉంటుంది.

చదవటం, రాయటంలో వెనకబడటం వల్ల స్కూల్‌లో ప్రతిరోజూ గోడకుర్చీ వేసి, తలపై చేతులు ఉంచుకుని గంటల తరబడి నిలబడి, ఆఖరుకు స్కూల్‌ నుండి వెళ్ళగొట్టబడిన జెఫనాయాకు బ్రిటన్‌లో పదహారు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు ఇచ్చాయి. బ్రన్నెల్‌ యూనివర్సిటీ ఆయనకు ప్రొఫెసర్‌ ఆఫ్‌ పొయెట్రీ పదవి ఇచ్చింది. జెఫనాయా కవితా సంకనాలు మొత్తం 13 ప్రచురితమయ్యాయి. ఐదు నవలలను రాశాడు. ఒక జీవిత చరిత్ర, స్వీయచరిత్ర ‘లైఫ్‌ అండ్‌ రైమ్స్‌ ఆఫ్‌ బెంజమిన్‌ జెఫనాయా’ (2018), పిల్లల కోసం మరో ఐదు పుస్తకాలు రాశాడు. మొత్తం ఏడు నాటకాలు రాశాడు. పాటల ఆల్బమ్స్‌ ఏడు మన ముందున్నాయి.


ఏ బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎడతెరపి లేకుండా తన కలాన్నీ, గళాన్నీ వెచ్చించాడో ఆ ప్రభుత్వమే ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌’గా నియమిస్తున్నట్లు 2003లో ప్రకటించింది. జెఫనాయా దాన్ని నిరాకరించాడు. ‘నాకా? ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైరా? ఛీ! ‘సామ్రాజ్యం’ అనే పదం వింటేనే నాకు మండుకొస్తుంది. మాముందు తరాల బానిసత్వమే గుర్తొస్తుంది. మా అవ్వలను చెరచింది ఈ సామ్రాజ్యమే. మా తాతలను దారుణంగా హింసించిందీ ఇదే. ఏమ్మా రాణిగారూ, మీరు నాకు బ్రిటిష్‌ సామ్రాజ్యం నుండి గౌరవం ఇవ్వడమా? నేను ఒక గట్టి సామ్రాజ్యవాద వ్యతిరేకిని’ అని అన్నాడాయన.

జాత్యహంకారానికి వ్యతిరేకంగా నల్లజాతి ప్రజల పట్ల పక్షపాతం వహిస్తూనే, అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా పీడిత ప్రజలు, జాతులు ఏకం కావాలని అంటాడు: ‘అణచివేత చేసేవాళ్ళకు ఎలా ఐక్యం కావాలో తెలుసు. అణచివేతకు గురవుతున్న వాళ్ళు తప్పక ఐక్యం కావాలి.’ జెఫనాయా పాలస్తీనా స్వయం నిర్ణయాధికార హక్కును గట్టిగా సమర్ధించాడు. పాలస్తీనా ప్రాంతాలను పర్యటించి ‘రాస్టా టైమ్‌ ఇన్‌ పాలస్తీనా’ అనే పుస్తకాన్ని 1990లో ప్రచురించాడు. నాలుగేళ్ళ క్రితం ఒక వీడియాలో ఇలా అన్నాడు: ‘చిన్నప్పుడు నాకీ కోరికలు ఉండేవి: దక్షిణాఫ్రికానూ పాలస్తీనానూ స్వతంత్రంగా చూడాలని. దక్షిణాఫ్రికా వర్ణ వివక్షనుండి విముక్తి అయింది. అయితే పరిపూర్ణ స్వతంత్ర దేశం ఇంకా కాదు. పాలస్తీనా ఇంకా విముక్తి కావల్సి ఉంది’.

అణచివేతకు గురవుతున్న ప్రజలనెంత ప్రేమించాడో, వాళ్ళకు ద్రోహం తలపెడుతున్న నల్లజాతి వాళ్ళనైనా సరే తీవ్రంగా విమర్శించాడు. తన కవిత ‘రేస్‌ ఇండస్ట్రీ’లో వీళ్ళను కొబ్బరికాయలుగా (బయట గోధుమ రంగు, లోపల తెలుపు రంగు) వర్ణిస్తాడు. పోస్ట్‌ మాడర్న్‌ భావాలకు వ్యతిరేకంగా ‘‘నేను, నువ్వు’’కు మధ్య ఉండే చైనాగోడలను బద్దలు కొట్టాలంటాడు. ‘యునైటైడ్‌ నైబర్స్‌’ అనే కవితలో ఇలా రాస్తాడు: నేనో మామూలు వ్యక్తిని, జమైకా నుండి వచ్చాను జమైకా కరీబియన్‌ సమూహంలోనిది, నేనో ఆఫ్రికన్‌లా కన్పిస్తా, నిజానికి ఆఫ్రికానే నా మాతృభూమి, మా పొరుగువాడు యూరోపియన్‌, ఇంగ్లాండులో పుట్టి, పెరిగాడు, మా కర్థం కాని విషయం ఏమంటే, వేరు వేరు జాతులు ఎందుకు కలిసి ఉండలేవని?’. జాతులు, రంగులు మరచి అణచివేతకు గురయ్యే వాళ్ళంత ఐక్యం కావాలనే భావం ఆయన కవిత్వమంతటా కన్పిస్తుంది.

దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజల పోరాటానికి పూర్తి మద్దతునిచ్చాడు. 1977లో నిర్భంధంలో ఉన్న స్టీవ్‌ బికోను పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపారు. స్టీవ్‌ బికో ‘బ్లాక్‌ కాన్షస్‌నెస్‌ మూవ్‌మెంటును స్థాపించాడు. ‘బికో ది గ్రేట్‌నెస్‌’ కవితలో ఇలా రాస్తాడు. ‘వాళ్ళను మరవనంత వరకూ వారు ఎవ్వరూ చనిపోరు, ఈ రోజు బికోను తలచుకుందాం, రేపు కూడా, ఎప్పటికీ తలచుకుందాం’.

జెఫానియా కృషితో ఏర్పడ్డ బ్లాక్‌ రైటర్స్‌ గిల్డ్‌ ఆయన మరణం తర్వాత తన సందేశంలో ఇలా అంది: మా రచయితల కుటుంబం విలువైన స్నేహితుడిని, బ్రిటిష్‌ సాహిత్య బాహుబలిని కోల్పోయింది. తను నమ్మిన విలువల కోసం ఎలా జీవించాలో చెప్పిన జెఫనాయా నిజాయితీపరుడు, మనకందరికీ ఆదర్శప్రాయుడు’.

విమల్

Updated Date - Dec 17 , 2023 | 12:38 AM