Art lovers : అగ్ని సరస్సున విరిసిన వజ్రం

ABN , First Publish Date - 2023-08-28T00:47:54+05:30 IST

రాజకీయాల వేడికి సమాజం భగభగ మండుతున్న రోజులు. విప్లవ భావజాలంతో కవులు, రచయితలు తమ కలాలను ఝళిపిస్తున్న కాలం. ‘ఆర్ట్‌ లవర్స్‌’ అనే సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించింది అబ్బూరి రామకృష్ణారావు గారి చేతుల మీదుగా...

Art lovers : అగ్ని సరస్సున విరిసిన వజ్రం

రాజకీయాల వేడికి సమాజం భగభగ మండుతున్న రోజులు. విప్లవ భావజాలంతో కవులు, రచయితలు తమ కలాలను ఝళిపిస్తున్న కాలం. ‘ఆర్ట్‌ లవర్స్‌’ అనే సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించింది అబ్బూరి రామకృష్ణారావు గారి చేతుల మీదుగా. రవీంద్ర భారతిలో 1966లో పురుడు పోసుకున్న ఈ సంస్థ అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయమైంది. ‘దిగంబర కవుల’ కాలం తర్వాత ‘విప్లవ కవుల’ కాలం ఆవి ర్భవించింది. 1970లో ‘ఆర్ట్‌ లవర్స్‌’ స్థావరం హైదరాబాద్‌ నుండి అల్వాల్‌కు మారింది. అప్పటికే ‘విరసం’ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఎనభై మంది విద్యార్థులతో మేమొక రాత్రి పాఠశాలను ప్రారంభించాము. వారానికి ఐదు రోజులు స్కూల్‌లో చెప్పే పాఠాలే చెప్పేవాళ్ళం. శనివారం మాత్రం చిత్రకళ, అలాగే ఆదివారం ప్రస్తుత సామాజిక పరిస్థితులను తెలియజెప్పే వాళ్ళం. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారం. పైన పేర్కొన్న కార్యక్రమాలన్నీ విప్లవ భావజాలంతో తొణికిసలాడుతూ ఉండేవి.

1971 చివర్లో మా యింటికి శేషగిరి అనే యువకుడు మరో యువకుడిని వెంటబెట్టుకొని వచ్చాడు. ఆ వచ్చిన ఆగంతకుడి పేరు గుమ్మడి విఠ్ఠల్‌బాబు. విఠ్ఠల్‌బాబు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు: ‘‘నేను వెంకటాపురంలో ఉంటాను. తరచుగా చదువుకోవడానికి అల్వాల్‌ లైబ్రరీకి వచ్చిపోతోంటాను. ఈ శేషగిరి అనే మిత్రుడు మీ గురించి చెప్పాడు. అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను.’’

‘‘ఏం చేస్తున్నావు,’’ నేను.

‘‘స్టూండెంట్‌ని! అప్పుడప్పుడు ప్రభుత్వంవారి ఫీల్డ్‌ పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్‌ వారి కోసం బుర్ర కథలు చెపుతుంటాను. అవి కుటుంబ నియంత్రణ, చిన్న మొత్తాల పొదుపు అనే వస్తువుతో కూడుకొని ఉంటాయి. ఒక కార్యక్రమానికి అరవై రూపాయలు ఇస్తారు. ఐతే అవి మేం ముగ్గురం పంచుకుంటాం,’’ అని నవ్వాడు.

‘‘ఈ బుర్రకథలు ఏఏ విషయాలపై ఆధారపడి ఉంటాయి...’’ నేను.

‘‘పౌరాణిక, చారిత్రక, సామాజిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదా: సీతారామ కళ్యాణం, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, మహాత్మా గాంధీ మొదలైన కథలు చెబుతాం. అల్లూరి సీతారామరాజు కూడా చెబుతాం.’’ అన్నాడు విఠ్ఠల్‌ బాబు.

‘‘బాగుంది. త్వరలో మా ‘ఆర్ట్‌ లవర్స్‌’ వార్షికోత్సవం ఉంది. దాంట్లో సీతారామరాజు కథ చెప్పండి,’’ అన్నాను. ఆ వార్షికోత్సవంనాడు విఠ్ఠల్‌బాబు తన బృందంతో ‘సీతారామరాజు’ బుర్రకథ చెప్పాడు. అంతా బాగానే ఉంది. కానీ బుర్ర కథ చివరన కథ చెప్పించినందుకు నన్ను పొగిడాడు. మరుసటి రోజు జరిగిన మా సంస్థ సమావేశంలో మా సభ్యులు నాతో అన్నారు, ‘‘కథ బాగానే చెప్పాడు. కాని చివర్లో నిన్ను పొగిడాడేంటి?’’ అని. ‘‘అదే నా కర్థం కావడం లేదు!’’ అన్నాన్నేను. మూడు రోజుల తర్వాత విఠ్ఠల్‌బాబు వచ్చి ‘‘కథ నచ్చిందా?’’ అని అడిగాడు. ‘‘కథ బాగానే ఉంది. కాని కథ చివర్లో నన్ను పొగిడారేంటి?’’ అన్నాను. ‘‘కథ చెప్పించినవాళ్ళని చివర్లో పొగడడం మాకు ఆనవాయితీ...’’ అన్నాడతడు. ‘‘అలా పొగడకూడదు కదా’’ నేను. ‘‘ఓనా పొగడకూడదా!’’ ఈసారి ఆశ్చర్యపడడం విఠ్ఠల్‌బాబు పనైంది. బహుశా అది అతనికి కొత్తగా ధ్వనించి ఉంటుంది.

ఇక అప్పటి నుండి ఒక సంవత్సరం వరకు అతడు మా సంస్థకు వచ్చి పోతూనే ఉన్నాడు. అక్కడ జరిగే విషయాలన్నీ ఆసక్తితో గమనిస్తూనే ఉన్నాడు. ‘ఆర్ట్‌ లవర్స్‌’లో నగ్జల్‌బరి, శ్రీకాకుళ పోరాటాలపై, ఆ రకమైన విప్లవ భావజాలంపై చర్చలు జరుగుతూ ఉండేవి. అవన్నీ అతడికి కొత్తగా అనిపించేవి. విప్లవ భావజాలం తొణికిసలాడే సాంస్కృతిక ప్రదర్శనలు ఎలా ఇవ్వాలి అనేది ఆ చర్చల్లో ప్రధానాంశంగా ఉండేది. అదీ కాకుండా, సామాజిక, సాంఘిక అంశాలపై శాస్త్రీయ దృక్పథంతో (మార్క్సిజం) కూడా ఆవేశపరమైన చర్చలు జరుగుతుండేవి. ఇవన్నీ విఠ్ఠల్‌బాబు చాలా ఆసక్తితో గమనిస్తూ ఉండేవాడు. అలాగే పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవడం, సాంస్కృతిక రూపకాలు ప్రాక్టీసు చేయడం, ఎప్పుడో ఏదో ఒక కార్యక్రమంలో ‘ఆర్ట్‌ లవర్స్‌’ సంస్థ చాలా బిజీగా ఉండేది. ‘ఆర్ట్‌ లవర్స్‌’ ఆదర్శాలతో మమేక మైన వారే ఆ సంస్థలో సభ్యులుగా ఉండేవారు. అది విఠ్ఠల్‌బాబుకు స్పష్టంగా అర్థమైంది.

తన సామాజిక జీవనంలో ఎక్కడికెళ్ళినా ‘కులం’ తనను వెంబడించింది అని అతడు నాతో అన్నాడు. దానికి రెండు ఉదాహరణలు కూడా చెప్పాడు. ఒకటి: వాళ్ళ బుర్ర కథల ప్రదర్శనలకోసం గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రదర్శన తర్వాత ఏ సర్‌పంచ్‌ ఇంట్లోనో భోజనాలు ఏర్పాటు చేసేవారు. ఇక పడుకో వాల్సిన సమయంలో వాళ్ళను (విఠ్ఠల్‌బాబు బృందాన్ని) ఆ యింటి పెద్ద అడిగేవాడు, ‘‘ఏ వర్ణం బాబు మనది’’ అని. దానికి సమాధానంగా ‘‘దళితులం’’ అనేవారు విఠ్ఠల్‌బాబు బృందంవాళ్ళు. అది విన్న ఇంటి యజమాని ఒక మూడు చుట్టలు (బెడ్స్‌) తీసుకొని అవి వాళ్ళకిచ్చి అలా దూరంగా పడుకొండి అనేవారు. రెండు: విఠ్ఠల్‌బాబు క్లాస్‌మేట్‌ వీరేశం (కోమటి) తన షాప్‌లో విఠ్ఠల్‌బాబుకి ఉద్యోగం ఆఫర్‌ చేస్తాడు. దానికి అంగీకరించి అతడు దుకాణం లోకి అడుగుపెట్టాగానే, ‘‘ఆ చీపురు తీసుకొని దుకాణం ఊడ్వు’’ అన్నాడట! ఇలాంటి సంఘటనలు ఆయన మనసును ఎన్నోసార్లు గాయపర్చాయి. ఆ రకంగా చూస్తే ‘ఆర్ట్‌ లవర్స్‌’లో కులం లేదు. ఇక్కడ ఎవ్వరికీ ఆ పట్టుదలలు ఉన్నట్టు కనిపించదు. బి. నరసింగ రావు (నేను) పెద్ద భూస్వామి బిడ్డ, పెద్ద బంగళాలు, పొలాలు కలిగినవాడు. కాని ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం గది ఊడుస్తున్నాడు. ఇతర్లు ఏ పని చేస్తున్నారో ఆయన కూడా ఆ పనులన్నీ చేస్తున్నాడు. ఇది విచిత్రంగా తోచింది విఠ్ఠల్‌ బాబుకి.

ఒకసారి కొంతమంది ఆర్ట్‌ లవర్స్‌ సభ్యులం హైదరాబాద్‌లో జరిగే విప్లవ రచయితల సంఘం (విరసం) సభలకు వెళ్ళాం. మాతో బాటు విఠ్ఠల్‌ బాబు కూడా వచ్చాడు. ఆ సభలో ప్రఖ్యాత ప్రజా కళాకారుడు నాజర్‌ ఉపన్యాసం ఉత్తేజకరంగా సాగింది. ‘‘కథలు, నవలలు, వ్యాసాలు, కవితలు విప్లవ భావ జాలంతో రాయడం మంచిదే. కానీ వీటితోబాటు పాటలు, సాంస్కృతిక ప్రద ర్శనలు ప్రజలలోకి మరింతగా చొచ్చుకుపోతాయి. వాటిని తిలకిస్తున్న ప్రేక్ష కులు ఎంతో భావోద్వేగానికి గురైతారు. ఆ రూపకాలు చాలా మేలైన ఫలితా లనిస్తాయి,’’ అన్నాడు నాజర్‌. దానికి మా ‘ఆర్ట్‌ లవర్స్‌’ సభ్యులు ప్రభావితులై ఆయనతో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ప్రజాకళాకారునిగా తన వ్యక్తిగత అనుభవాలెన్నో మా సభ్యులతో పంచుకున్నాడు.

ఈ సంఘటన జరిగిన వారం రోజులకు విఠ్ఠల్‌బాబు ఒకసారి ‘ఆర్ట్‌ లవర్స్‌’కు వచ్చి నన్ను కలిశాడు. ‘‘జానపద రీతిలో విప్లవ గీతం రాయాలని అంటున్నారు. ఆ పద్ధతిలో వెలువడిన రచనలు యెంతో ప్రాచుర్యం పొందు తాయని కూడా అంటున్నారు కదా! అలాంటి పాటలు రాయడం ఎలా?’’ అని విఠ్ఠల్‌ బాబు నన్ను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా, ‘‘ఒక జానపద గీతం బాణీ పట్టుకొని దాన్ని మన విప్లవ కథా వస్తువుతో నింపి రాయ గలిగితే నిజంగానే అది ప్రజలను బాగా ఆకట్టుకుంటుంది. దాంట్లో సందేహం ఏమీ లేదు,’’ అన్నాన్నేను. ‘‘అయితే మీకు నచ్చిన ఒక జానపద గీతం వినిపించండి’’ అన్నాడతడు. అప్పుడు నేను గొంతు సవరించుకొని ఇలా ఆలపించాను: ‘‘ఆపుర బండోడో బండెంట నేనొస్తా/ నిలుపుర బండోడో బండిమీద నేనొస్తా// నువ్వురకా నేనురకా - నీ చెంప నేన్‌ గొరక/ చీరగట్టిందాకా - రైకా దొడిగిందాకా/ ఆపుర బండోడో - బండెంటనేనొస్తా...

-ఈ పాట బాణీకి విప్లవ రాజకీయ వస్తువును జోడించి నువ్వు నీ రచన కొనసాగించాల్సి ఉంటుంది,’’ అన్నాన్నేను. ‘‘ఇప్పుడు దీంట్లో నేను ఏది ఉంచాలి, ఏది తీసేయాలి. అది చెప్పండి ముందు...’’ విఠ్ఠల్‌ బాబు. ‘‘దీంట్లో పల్లవి ఉంచాల్సిందే- ‘ఆపుర బండోడో... బండెంట నేనొస్తా/ నిలుపుర బండోడో... బండి మీద నేనొస్తా...’ అలాగే ‘చెంప కొరకడమూ, చీరకట్టడమూ’ మనకు అవసరం లేని విషయాలు...’’ అన్నాన్నేను. ‘‘అయితే ఇప్పుడేం మిగిలింది! ‘ఆపుర బండోడో... బండెంట నేనొస్తా...’ అంతే కదా’’ అని నవ్వాడతడు. నేనూ నవ్వుతూ, ‘‘అవును, అంతే! అంతే మిగులుతుంది మరి. మిగతా చరణాలు నీవు రాయాల్సిందే’’ అన్నాను. ‘‘సరే! అట్లనే గాని, నువ్వన్నట్లే రాయడానికి ప్రయత్నిస్తా...’’ అన్నాడు విఠ్ఠల్‌ బాబు.

ఇక మరుక్షణం నుంచి అదే ధోరణిలో ఉన్నాడతడు. ఇందాక చర్చించిన పద్ధతిలో రాయాలి. ఇక అతడికి మానసిక సంఘర్షణ మొదలైంది. రకరకాల ఆలోచనలు అతడి బుర్రను ఆవహించాయి. తన పక్కన ఏ వస్తువున్నా దానిపై దరువేస్తూ... ‘‘ఆపుర బండోడో... బండెంట నేనొస్తా...’’ అలాగ రెండు మూడు రోజులు యాతన పడి, అంతిమంగా ఒక పాట రాసుకొని ‘ఆర్ట్‌ లవర్స్‌’ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. ‘‘పాట రాసాను. వింటావా?’’ అన్నాడు. ‘‘తప్పకుండా వినిపించు’’ అన్నాను. ‘‘అల్వాల్‌ చుట్టుపక్కల స్థలాలన్నింటిని ఈ పాటలోకి దించిన’’ అన్నాడు నవ్వుతూ. ఆయనతో బాటు నేనూ నవ్వుతూ పాట వినడానికి ఉపక్రమించాను:

‘‘గోల్‌నాక కాడ నీకు - గోల్‌ మిఠాయ్‌ దినిపిస్తా/ సత్యా టాకీస్‌లోన - నిక్‌ సిన్మా జూపిస్తా/ లాల్‌బజార్‌ కాడ - లడ్డు మిఠాయ్‌ దినిపిస్తా/కార్ఖానా కాడా - నిక్‌ కల్లు బోపిస్తా/ఆల్ఫా హోటల్‌లోన - ఆలు బిర్యాని దినిపిస్తా// ఆపుర రిక్షోడో... రిక్షెంట నేనొస్తా/ నిలుపుర రిక్షోడో... రిక్ష మీద నేనొస్తా...’’

ఇలా సాగింది ఆయన పాట.

పాట విన్నాక నేనన్నాను గదా! ‘‘లడ్డూలు ఏడికేల్లి దినిపిస్తవు, కల్లు ఏడికేల్లి పోపిస్తవు, సీన్మ యేడికేల్లి జూపిస్తవు, ఆలు బిర్యాని ఏడికేల్లి దెస్తవు. అట్ల కాదు! పేదవాడు పడే బాధలు రాయాలి. పేదల సంఘర్షణ, వాళ్ళ తల రాత మారే వైనం గురించి రాయి’’.

దానికి విఠ్ఠల్‌ బాబు పగలబడి నవ్వుతూ... ‘‘ఈసారి నువ్వు అన్నట్టే రాసి తీసుకొస్తాను’’ అన్నాడు. మూడు రోజుల తర్వాత గతంలో రాసిన పాటకు ఇంకొక వర్షన్‌ రాసి తీసుకొచ్చాడు:

‘‘రెక్కలాడితె గాని - డొక్క నిండని మనకు

కాయ కష్టం జేశ్నా - కడుపే నిండని మనకు

ఈ కామందుల పాలనలో - మన కడుపు నిండదిరా

కత్తులు బట్టన్న - కదన మందు దూకన్నా

వర్గ పోరాటంలో - కన్నెర్ర జెయ్యన్న

నీకడ్డమొచ్చినోళ్ళను - నడ్డి విరగ దన్నన్నా

ఆపుర రిక్షోడో - రిక్షెంట నేనొస్తా

నిలుపుర రిక్షోడో - రిక్ష మీద నేనొస్తా...’’

- ఈసారి చప్పట్లు కొడుతూ, నవ్వుతూ ‘‘బాగుంది’’ అన్నాన్నేను. కానీ ఈ పాటలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది నేను’’ అన్నాను. ‘‘ఇగొ గిది నాతోటయింది. ఇగ ఇప్పుడు దీన్ని నీ ఇష్టమొచ్చినట్టు చేసుకో’’ అన్నాడు విఠ్ఠల్‌ బాబు. తరువాత కాలంలో కొత్త బస్తీలో, మరికొన్ని చోట్లల్ల, సాంస్కృతిక ప్రదర్శనలిచ్చినప్పుడు విఠ్ఠల్‌ బాబుతో ఈ పాట పాడించాము. ప్రజలు ఈ పాట విని బాగా స్పందించారు. ఇంకొంత కాలానికి ‘ఆర్ట్‌ లవర్స్‌’లో ఈ పాటని ఏ పత్రికకైనా పంపిస్తే బాగుంటుంది అన్న చర్చ వచ్చింది. కవి పేరుతో కాకుండా కలం పేరుతో పంపడం మంచిది అని ఒకరు సూచించారు. అందరూ దానికి సరేనన్నారు. ఇక కలం పేరు గురించి చర్చ. రకరకాల పేర్లు సూచిం చారు సభ్యులు. భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, చిట్టగాంగ్‌ వీరులు, గదర్‌ వీరులు... మొదలైనవి... అయితే గదర్‌ని గద్దర్‌గా మార్చి, విఠ్ఠల్‌బాబును వి.బి.గా మార్చి, అంతిమంగా విఠ్ఠల్‌బాబు కలం పేరును వి.బి. గద్దర్‌గా మార్చి ఆ పాటను ‘పిలుపు’ పక్ష పత్రికకు పంపాము. అది అతిత్వరలోనే ‘పిలుపు’ పత్రికలో ప్రచురింపబడ్డది. కాని ఆ పాట ప్రచురింపబడ్డ వారం రోజులు తిరక్కుండానే ప్రభుత్వం దాన్ని నిషేధించింది. ఆలోగానే ఆ పాట అల్వాల్‌ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ప్రచారంలోకి వచ్చింది.

ఇక అప్పటి నుండి మరో దశాబ్దం వరకు గద్దర్‌ పాటలు రాయడం, నేను వాటిని ఎడిట్‌ చేసి ప్రజలలోకి ప్రవేశపెట్టడం పరిపాటయిపోయింది. ‘ఆర్ట్‌ లవర్స్‌’లోని ఇతర సభ్యులం కూడా అదే ధోరణిలో పాటలు, రూపకాలు ఇతర కళారూపాలు రాయడం, ప్రదర్శించడం ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాం. ఉత్తరోత్తర ‘ఆర్ట్‌ లవర్స్‌’ జననాట్యమండలిగా రూపాంతరం చెందింది. గత ఐదు దశాబ్దాలుగా గద్దర్‌ తన పాట, ఆటలతో తెలుగు ప్రజలనే కాదు, మన దేశ ప్రజలను కూడా సమ్మోహితులను చేసి, ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. గొప్ప ప్రజాగాయకుడైన గద్దర్‌ అజరా మరుడు. అతడి సాహిత్యం అజరామరం.

బి. నరసింగరావు

Updated Date - 2023-08-28T05:32:57+05:30 IST