Share News

కులగణనతో అసమానతలపై కొత్త పోరు

ABN , First Publish Date - 2023-11-10T01:32:59+05:30 IST

కుల గణన సుసాధ్యమూ ఉపయోగకరమూ అని బిహార్‌లో కులాల వారీ జనాభా గణన తొలి విడత సమాచారం నిరూపించింది. వర్తమాన భారతదేశంలో సామాజిక అసమానతలను...

కులగణనతో అసమానతలపై కొత్త పోరు

కుల గణన సుసాధ్యమూ ఉపయోగకరమూ అని బిహార్‌లో కులాల వారీ జనాభా గణన తొలి విడత సమాచారం నిరూపించింది. వర్తమాన భారతదేశంలో సామాజిక అసమానతలను అర్థం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడం అత్యవసరమని బిహార్ కుల జన గణనకు సంబంధించిన మలివిడత సమాచారం ధ్రువపరిచింది. కుల సంబంధిత సమగ్ర సమాచారం ఎంత ముఖ్యమో బిహార్ కుల జనగణనకు సంబంధించిన రెండో విడత సమాచారం ఎవరూ ఆక్షేపించలేని ఒక రుజువు. విద్యావకాశాల ప్రధాన నిర్ధారకంగాను, ఆర్థిక హోదాకు ఒక దృఢ సూచకంగాను, తగిన ఉపాధి అవకాశాలకు ఒక ప్రవేశ ద్వారంగాను కులం కొనసాగుతోంది. బిహార్ కుల జన గణనకు సంబంధించిన తొలి సమాచారం వర్తమాన కుల వ్యవస్థ తీరుతెన్నులకు ఒక ఎక్స్–రే అయితే, మలి విడత సమాచారం ఒక ఎమ్ఆర్ఐ వంటిది.

మన సామాజిక జీవనానికి సంబంధించిన ఈ విలువైన సమాచారాన్ని ఎవరూ శ్రద్ధగా పరిశీలించడం లేదనే చెప్పాలి. కుల గణన లాభ నష్టాలపై చర్చ అంతా ఆ జన గణనలో వెల్లడైన వాస్తవాల గురించికాక రిజర్వేషన్ యోగ్యతలు, లోపాలపైనే జరిగింది. ఇప్పుడు ఆ కులాలవారీ జనాభా గణన సమగ్ర వివరాలు వెల్లడి అయినందున 65 శాతం కోటాపై అందరూ దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన ఒక అనాలోచిత, అమర్యాదకర వ్యాఖ్యను సాకుగా తీసుకుని చర్చను అసలు సమస్య అయిన కుల అసమానతలపై నుంచి వేరే అంశాలకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. కుల అసమానతలపై వెల్లడైన తాజా సమాచారంపై ఎందుకు శీతకన్ను వేస్తున్నారు?

బిహార్‌లో కులాల వారీ జనాభా గణన వెల్లడించిన కొత్త అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా కుల అసమానతలను లోతుగా పరిశీలిద్దాం. ఈ కుల గణనకు సంబంధించిన తొలి సమాచారం ఏ కులంలో ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఈ కులాల వారీ జనాభా వివరాలు 1931 నుంచి అందుబాటులో లేవు. వెనుకబడిన కులాల (బీసీ), జనాభాతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కులాల జనాభా కూడా అంచనాలకు మించి ఉన్నదని ధ్రువపరిచింది. సమాజంలో అన్ని విధాల ప్రాబల్య స్థానాలలో ఉన్న ‘అగ్రకులాలు’ జనసంఖ్యాపరంగా చాలా చిన్నవి అని స్పష్టమయింది. బిహార్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన మలివిడత సమాచారం ప్రతీ కులం సామాజిక హోదా, ఆర్థిక స్థాయి వివరాలను సమగ్రంగా వెల్లడించింది. ముఖ్యంగా ఈ తాజా సమాచారం కుటుంబ ఆదాయం, సొంతంగా ఉన్న వాహనాలు, కంప్యూటర్ల సంఖ్య, కుటుంబంలోని ప్రతీ సభ్యుడి విద్యా స్థాయి, ప్రతీ వ్యక్తి ఉద్యోగ హోదా పరంగా ప్రతీ కులం ఆర్థిక స్థాయిని కచ్చితంగా అంచనా వేసింది.

తొలుత ప్రతి కుటుంబ ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన భోగట్టాను విశ్లేషిద్దాం. సామాజిక వ్యవస్థలో ఒక కులం ఎంత అడుగు భాగాన ఉంటే దాని ఆర్థిక స్థాయి అంత తక్కువగా ఉన్నట్టు విశద మవుతుంది. ఇది ప్రతీ కుల సమూహం– జనరల్, బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ– విషయంలోనూ యథార్థమే. అంతే కాదు ప్రతీ కుల సమూహం అంతర్గత పరిస్థితులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబ ఆదాయం గురించి స్వీయ వెల్లడింపు (ప్రజలు తమ ఆదాయాన్ని తక్కువ చేసి చెప్పడం సహజం కనుక అది పూర్తిగా నిజమని చెప్పలేము) ప్రాతిపదికన ఈ విశ్లేషణ జరిగింది. కనుక ద్విచక్ర వాహనాల నుంచి ఆరు చక్రాల వాహనాలను, అలాగే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నా లేక పోయినా కంప్యూటర్లను కలిగి వుండడంపై ఇచ్చిన వివరాలను ఒకటికి రెండు మార్లు సరిచూచుకోవల్సి వుంది. ఆదాయం విషయంలో ఆఖరు స్థానాలలో ఉన్న వారి వివరాలను పరిశీలిస్తే పేదరికం అన్ని కులాలలోనూ ఉందని తెలుస్తుంది. ఆగ్రకులాలవారిలోనూ నాలుగో వంతు మంది పేదలే. వీరి కుటుంబ ఆదాయం నెలవారీగా రూ6000 కంటే తక్కువగా ఉన్నది. పేదల శాతం బీసీలు, ఈ బీసీలలో 33 శాతం గాను, ఎస్సీ, ఎస్టీలలో 43 శాతంగాను ఉన్నది. నెలసరి ఆదాయం రూ.50 వేలు అంతకంటే ఎక్కువగా ఉన్న ‘ధనిక’ కుటుంబాలు ఎస్సీలు ఈ బీసీలలో 2 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ సంపన్న కుటుంబాలు బీసీలలో 4 శాతం మేరకు ఉండగా అగ్రకులాలలో 10 శాతం మేరకు ఉన్నాయి. లాప్‌టాప్ కంప్యూటర్లు (విద్యావకాశాలను తెలిపే అంశం), వాహనాల యాజమాన్యం (ఆర్థిక స్థితిని సూచించే అంశం) పరంగా ఉన్న సమాచారంపై విషయాలను గట్టిగా బలపరుస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే అగ్రకులాలలో బాగా సంపన్నులు భూస్వామ్య కులాలు అయిన భూమిహార్లు, రాజపుట్‌లు కాకుండా కాయస్తులే కావడం ఒక ఆసక్తికరమైన విషయం. ఓబీసీలలో జససంఖ్యాపరంగా యాదవులు, అతి పెద్ద కులం అయినప్పటికీ కుర్మీలు, బనియాలు (బిహార్‌లో వీరు బీసీలు) చివరకు కుష్వాహాల కంటే కూడా పేదలు.


విద్యారంగంలో కులాల వారీ సమాచారం ఆర్థికత విషయంలో కంటే మరింత హెచ్చుతగ్గులతో ఉన్నది. మంచి ఉద్యోగాలను సమకూర్చే డిగ్రీలు ఏ సామాజిక బృందంవారు ఏ విధంగా కలిగివున్నారో చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సిలతో పాటు ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీలు, ఇంకా సీఈఏ, పీఈహెచ్‌డీ మొదలైన ఉన్నత విద్యా అర్హతలను కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. ఈ విద్యాపరమైన సాఫల్యాలపై శతాబ్దాల కులాధిపత్యాలు, కొన్ని వర్గాలకు చదువులపై తీవ్ర ఆంక్షలు మొదలైన సామాజిక ఆచారాలు అమిత ప్రభావాన్ని కలిగి వున్నాయని మరి చెప్పనవసరం లేదు. బిహార్‌లో ఒక దళితుడు పైన పేర్కొన్న డిగ్రీలలో ఒకదాన్ని సాధించడంలో అగ్రకులాలకు చెందినవారి కంటే పది రెట్లు తక్కువ అవకాశాలు కలిగివున్నాడు. ఈ వ్యత్యాసం తత్తరపాటు కలిగించడం లేదూ? ప్రతీ పదివేల మందిలో 1089 మంది కాయస్తులు (మొదటి నుంచీ విద్యాధిక వర్గం) మంచి ఉద్యోగాలకు అర్హులను చేసే ఉన్నతస్థాయి డిగ్రీలను కలిగివున్నారు. కాయస్తులకు భిన్నంగా ముసాహర్లు (ఎస్సీలలో చాలా కింది స్థానంలో ఉన్నవారు) ప్రతీ పదివేల మందిలో కేవలం ఒకే ఒక్కరు మాత్రమే ఉన్నత విద్యావంతుడుగా ఉన్నారు!

బ్రాహ్మిణ్‌ల కంటే భూమిహార్లు ఎక్కువ విద్యావంతులు కావడం మరొక విశేషం. ఈ రెండు సామాజిక వర్గాలలోని మొత్తం విద్యాధికులు కాయస్త విద్యాధికులలో సగం మంది కంటే తక్కువ. విద్యావకాశాలలో సంప్రదాయ సవర్ణ–శూద్ర వ్యత్యాసాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. వెనుకబడిన కులాలలోని ఉన్నత విద్యావంతులు, అగ్రకులాల విద్యావంతులలోని మూడో వంతు కంటే కూడా తక్కువగా ఉన్నారు. బీసీలలో కంటే ఈబీసీలలో ఉన్నత విద్యావంతులు తక్కువగా ఉన్నారు. బీసీలకు పరిమితమై చూస్తే యాదవులలో ఉన్నత విద్యావంతులు 0.82 శాతం మంది మాత్రమే ఉండగా కుర్మీలలో వారు 2.4 శాతంగా ఉన్నారు.

ముస్లింలలో అంతర్గత వ్యత్యాసాల గురించి ఈ కుల జనగణన మరింత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆర్థికత, విద్యా హోదాకు సంబంధించిన సమాచారం సయద్ ముస్లింల అగ్ర స్థాయిని ఖాయపరిచింది. హిందూ అగ్రకులాల వారితో సమాన స్థాయిలో సయద్ ముస్లింలు ఉన్నారు. షేక్‌లు, పఠాన్లను ‘జనరల్’ వర్గంగా వర్గీకరించినప్పటికీ వారి ఆర్థిక, విద్యా హోదాలు ‘వెనుకబడిన వర్గాల’ స్థాయికి మించి లేకపోవడం గమనార్హం. బీసీలుగా పరిగణన పొందుతున్న మాలిక్ ముస్లింలు ‘జనరల్’ వర్గం వారితో సమాన స్థాయిలో ఉన్నారు. రిజర్వేషన్ విధానంలో మార్పులు చేర్పులకు కుల గణన ఎంత ముఖ్యమో బిహార్ సమాచారం స్పష్టం చేస్తోంది.


ఇక చివరగా ఉద్యోగాల విషయాన్ని చూద్దాం. ఆర్థికత, విద్యావకాశాలలోని అంతరాలు ఉద్యోగాలు, ఉపాధుల్లో కూడా ప్రతిబింబిస్తున్నాయి. బిహార్ జనాభాలో 3 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ‘సంఘటిత రంగం’లో ఉద్యోగస్తులుగా ఉన్నారు నెలవారీ వేతనభత్యాలు ప్రావిడెండ్ ఫండ్, బహుశా పెన్షన్ సదుపాయాన్ని కూడా వీరు పొందుతున్నారు. ఇటువంటి ఉద్యోగస్తులు అగ్రకులాల వారిలో 7 శాతం మేరకు ఉండగా బీసీలలో 2.8 శాతం, ఈబీసీలలో 1.7 శాతం మంది మాత్రమే ఉన్నారు. సంఘటిత రంగ ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగ ఉద్యోగాలుగా విభజిస్తే ఆ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రెండు రంగాలలో అగ్రకులాల వారు హెచ్చు స్థాయిలో ఉన్నారని మరి చెప్పనవసరంలేదు. ప్రభుత్వ ఉద్యోగాలలో కంటే ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో వీరు అత్యధిక శాతంలో ఉన్నారన్న విషయాన్ని కూడా చెప్పి తీరాలి. ప్రభుత్వ ఉద్యోగాలలోనూ, ప్రైవేట్ రంగ ఉద్యోగాలలోను కూడా కాయస్తులే మిగతా అగ్రకులాల వారికంటే ఎక్కువ శాతంలో ఉన్నారు. ప్రైవేట్ రంగంలో వెనుకబడిన కులాలవారు చాలా తక్కువగా ఉన్నారు. ఓబీసీలలో ఉన్నత శ్రేణుల (బిహార్‌లో బీసీలు) వారు జనసంఖ్య పరంగా అత్యధికంగా ఉన్న ఈబీసీల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక దళితులు ప్రభుత్వ ఉద్యోగాలలో 1.13 శాతాన్ని మాత్రమే పొందగలిగారు. ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో కేవలం 0.51 శాతం ఉద్యోగాలు మాత్రమే వారికి దక్కాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ సదుపాయం లేకపోతే దళితుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఓబీసీ కోటా పెంపుదల విషయమై చర్చకు ఉపక్రమించే ముందు ఈ వాస్తవాలను మనం పూర్తిగా అవగాహన చేసుకోవల్సిన అవసరమున్నది. దేశ వ్యాప్తంగా కుల వ్యవస్థకు ఇదే విధమైన ఎక్స్‌రేలు, ఎమ్ఆర్ఐలు తీయాలని కూడా మనం డిమాండ్ చేసి తీరాలి.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2023-11-10T01:33:01+05:30 IST