సమూహాలు పూనిన మనిషి
ABN , First Publish Date - 2023-01-11T00:24:25+05:30 IST
జాతరలు తెలుగువారికి కొత్త కాదు. ఏడాదికి ఓసారి వచ్చినా వాటిలో ఎప్పుడూ తాజాదనమే పరిమళిస్తుంది.
జాతరలు తెలుగువారికి కొత్త కాదు. ఏడాదికి ఓసారి వచ్చినా వాటిలో ఎప్పుడూ తాజాదనమే పరిమళిస్తుంది. ఒక్కసారన్నా పోయిరాకపోతే ఏడాదంతా ఆ వెలతి వెంటాడుతుంది. అలాంటిదే ఒకటి హైదరాబాదులో ఈ జనవరి ఒకటితో ముగిసిన పుస్తక కుంభమేళా. ఈసారి దాని విశేషమేమిటంటే అది అలిశెట్టి ప్రభాకర్ స్మారక జాతరనా అన్నట్టుగా సాగింది. గత డిసెంబరు 22న ఆరంభమైన పుస్తక ప్రదర్శన పది రోజుల ఆలస్యంగా మొదలైతే నిజంగానే అది అలిశెట్టి మూడు దశాబ్దాల వర్ధంతి సభగానే స్ఫురించేది. ఈ జనవరి 12 నాటికి ప్రభాకర్ మరణించి ముప్పయి ఏళ్లవుతోంది. 1993లో తెల్లవారితే జనవరి 12 కాబోతుండగా ఒక ఆత్మీయురాలు తెచ్చిన బర్త్ డే కేకును ‘ఇదంతా ఎందుకు?’ అంటూనే ఆ రాత్రి నడిజామున కట్ చేసి, చప్పట్ల మధ్యన ‘మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!’ అని విన్న ప్రభాకర్ నలభైయవ యేడులో అడుగు పెట్టకుండానే వెళ్ళిపోయాడు. ఒక్క రోజు అటు ఇటు కాకుండా సరిగ్గా 39ఏండ్లు బతికిన అలిశెట్టి జీవితం సగానికిపైగా చిత్రకళకు, కవిత్వానికే అంకితమైంది.
బుద్ధి తెలిసిననాటి నుండే బొమ్మలు, ఆ తర్వాత కవితలు... అంతే తప్ప మరో ధ్యాసకు ఆయన మనసులో చోటే లేదు. ఆ రెంటి కోసం చివరి ఊపిరిని కూడా వాడుకున్నాడు. రాయడానికే పుట్టినట్లు రక్తం ఇంకిపోయేదాకా రాసి నిష్క్రమించాడు. ఎంత రాసినా ఏమి రాసినా ఒక్క వాక్యం కూడా పేరు ప్రఖ్యాతుల కోసమో, తెలుగులో కవిగా నిలబడాలనో రాయలేదు. బతికినన్నాళ్లు ఎలాంటి భేషజాలకు లోనుకాలేదు. సాయుధ పోరును సమర్థించినా, విప్లవోద్యమాన్ని ప్రేమించినా తన రాతల్లో వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు. వ్యక్తులపై ద్వేషం చిమ్మకుండా, హింసను ప్రేరేపించకుండా అందరికి అర్థమయ్యేలా, అందరు అంగీకరించేలా ఈ ‘లోపభూయిష్టమైన వ్యవస్థ’లో ‘పరాధీనమవుతున్న స్వేదం’ గురించి చెప్పాడు. నిరసించినా, ధిక్కరించినా అందరితో ‘ఔను కదా! ఉన్నదే రాసాడు’ అని మెప్పించుకున్నాడు. ఆయన కవిత్వంలో ఆవేశంతో పాటు కనబడే ఆర్ద్రత, వేదన అన్ని వర్గాలను ఆలోచింపజేశాయి. తీవ్రమైన అంశాన్ని కూడా వాడుక పదాలతో, వాస్తవరేఖను దాటకుండా పీడక, పీడిత ప్రజలకు మనసుకు తాకేలా వివరించాడు. ‘హింసకు ప్రతిహింసను నేను’ అని చెప్పినా ఆయన పదవిన్యాసంలోని లాజిక్, మ్యాజిక్ వల్ల ఏ వర్గమూ ఆయన్ని వ్యక్తిగతంగా శత్రువుగా చూడలేదు. రాజకీయ నాయకులను తీవ్రస్థాయిలో ఎద్దేవా చేసినా ఆయన సరళిని అంగీకరించినవారే ఎక్కువ. కవిగా అలిశెట్టి ఒక సైద్ధాంతిక భావజాల ధోరణికి ప్రతినిధి అని ఏకపక్షంగా అభిప్రాయపడేవారున్నా ఆయన మాత్రం ‘ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ’ పునాదిపై నిలబడి ‘కలల ఉపరితలం మీద కదలాడే కాంతి పుంజం నేను’ అని తనను నిర్వచించుకున్నాడు. అలా జనబాహుళ్య కవిగా బతికిన అలిశెట్టి ఇప్పటికి అర్ధ శతాబ్దిని తన కవిత్వమయం చేశాడు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో అలిశెట్టిని గుర్తు చేసుకోవడం కొత్త కాదు గానీ, ఈసారి ప్రదర్శనే ఆయన పేరిట సాగుతున్నట్లుగా ఏర్పాట్లు జరిగాయి. పుస్తక ప్రదర్శన సమావేశ ప్రాంగణానికి అలిశెట్టి ప్రభాకర్ వేదిక అని పేరు పెట్టి ఆయన చిత్రంతో కూడిన పెద్ద బ్యానరును అందరికీ కనబడేలా ఏర్పాటు చేశారు. మరోవైపు మరో పెద్దసైజు ఫ్లెక్సీపై ప్రభాకర్ ఫోటోతో పాటు ఆయన కవితాపంక్తులను ఉంచారు. ఆయన ఫోటోను చూడగానే అదిగో అలిశెట్టి అనేవారే ఎక్కువ తప్ప ఆయనెవరు అనే సంశయం ఎవరి ముఖాల్లో కానరాదు. 1993 నుంచి నాలుగు గోడల మధ్య ప్రభాకర్ కుటుంబానికే పరిమితమైన ఈ ఫోటో 2012 జనవరి 12న ఒక దినపత్రిక అలిశెట్టి పేరిట తెచ్చిన విశేష సంచిక ముఖచిత్రంగా వెలుగు చూసింది. ఈ రకంగా నేడు ప్రాచుర్యంలో ఉన్న అలిశెట్టి ప్రభాకర్ నూనూగు మీసాల చిత్రాన్ని మనందరికీ అందించినవారు కందుకూరి రమేష్‌బాబు. 2013లో వచ్చిన అలిశెట్టి ప్రభాకర్ కవితల సంపుటికి ముఖచిత్రంగా ఆ ఫోటోను తీసుకోవడంతో ఆయన రూపం మరింత మందికి చేరువయింది.
‘అలిశెట్టి ప్రభాకర్ వేదిక’పై ప్రముఖుల, ప్రభుత్వ పెద్దల ప్రసంగాలు, సాహితీవేత్తల చర్చలు, పుస్తక ఆవిష్కరణలు కొనసాగితే, స్టాళ్ళ మధ్యన కట్టిన భారీ ఫ్లెక్సీ ముందర నిలబడి ప్రభాకర్ బొమ్మతో సహా ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఎందరో ఉత్సాహం చూపారు. ప్రభాకర్ కవిత్వం తెలిసినవారు ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా ఆకర్షితులయ్యారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోతున్నా చివరి శ్వాస వరకు కవన సృష్టిని వదిలిపెట్టని అలిశెట్టి కేవలం 39ఏళ్లకే కన్నుమూయడంతో ఆయన పట్ల అందరి మనస్సులో సానుభూతితో కూడిన ప్రేమాభిమానాలు రూపుదిద్దుకున్నాయి. ఆయన రాసిన అక్షరాలతో పాటు ఆయన రూపం కూడా తరం తరవాతి తరానికి ఇష్టంగా చేరువవుతోంది.
పుస్తక ప్రదర్శనలో ప్రభాకర్‌కు లభిస్తున్న గౌరవం గురించి నలుగురూ చెప్పగా విన్న ఆయన భార్య భాగ్య స్వయంగా తానూ ఆ భాగ్యాన్ని చూడడానికి ప్రదర్శనకు వచ్చింది. తన సంబరాన్ని బుక్ ఫెయిర్ నిర్వాహకులతో పంచుకుంది. వేదికపై వారు ఆమెను సత్కరించారు. పుస్తకం పేరును కూడా చదవలేని భాగ్యకు పుస్తక మేళాలో దక్కిన అరుదైన గౌరవమిది. బాల్యంలోనే చదువు వదిలేసిన ఆమె ప్రభాకర్ కవిత్వానికి శ్రోతనే తప్ప పాఠకురాలు కాదు. పెళ్లయిన కొత్తలోనే ప్రభాకర్‌ను అర్థం చేసుకొని ఇక కుటుంబభారం తనదే అనుకుంది. ‘ఎవరినీ ఏమీ అడగద్దు. పిల్లలను సర్కారు బడిలో వేద్దాం!’ అన్న ప్రభాకర్ మాటను పక్కనబెట్టి పిల్లలిద్దరినీ తీసుకొని హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూలుకెళ్ళి ‘వీళ్ళు అలిశెట్టి ప్రభాకర్ పిల్లలు’ అని వేద్‌కుమార్ ముందు నిలబడింది. పైసా ఫీజు తీసుకోకుండా ఆయన పుస్తకాలూ తదితరాలు ఉచితంగానే ఇచ్చి వారిని తన స్కూల్లో చదివించాడు. ఇలా మంచి ఆంగ్ల విద్య దొరకడం వల్ల వాళ్ళు ఎదిగి ప్రయోజకులయ్యారు. నాగరికం తెలియని అమాయకురాలైన ఆమె ప్రభాకర్‌తో సహా పదేళ్లు, ఆయన తర్వాత ముప్ఫయ్యేళ్లు ఈ నగరంలో గడపడమే ఓ విషాదకర విచిత్రం. అన్నీ పరిస్థితులు నేర్పిన పాఠాలే. సి. నారాయణరెడ్డి గారి దయవల్ల తెలుగు విశ్వవిద్యాలయంలో బతుక్కి ఆసరాగా దొరికిన తాత్కాలిక ఉద్యోగంతో కుటుంబాన్ని ఈదుతోంది. పెన్షన్ సౌకర్యం లేని ఆ ఉద్యోగం మరో రెండేళ్లలో ముగిసిపోతుంది. వీటన్నింటిని మించిన భయంకర విషాదమేమిటంటే ప్రస్తుతం భాగ్య రొమ్ము క్యాన్సర్ పీడితురాలు. తాను నోరారా అన్నా అని పిలిచే వారిలో ఒకరైన అల్లం నారాయణ తోడ్పాటుతో ఎం.ఎన్.జె హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.
తెలుగువారిలో ప్రభాకర్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులకేమీ కొదవ లేదు. పదేండ్లలో పదివేలకు పైగా ఆయన కవితా పుస్తకాలు తెలుగిళ్ళలోకి చేరుకున్నాయి. ఏటా ఆయన పేరిట అవార్డు ప్రకటించే సంస్థలున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆయన స్మారక సభలు జరుపుకుంటారు. ఆ సత్తా ఆయన అక్షరానికి ఉంది. అయితే అందరూ కీర్తిస్తున్న ప్రభాకర్ ఘనతకు, ఆయన కుటుంబ దుర్భర పరిస్థితికి పొంతన కుదరడంలేదు. ఏడాదికోసారి అయ్యో పాపం అనుకోవడం తప్ప అడుగు ముందుకు పడదు. వ్యక్తులుగా కాకుండా అధికారికంగా స్థిరమైన నిర్ణయం జరగాలి. ప్రపంచ తెలుగు సభల్లోను, పుస్తక ఉత్సవాల్లోను ప్రభాకర్‌కు ఎంత గౌరవం దక్కినా నిర్వాహకుల బాధ్యత అంతటితో తీరిపోదు. తక్కెడ రెండువైపులా తూగాలి. ఇంతకన్నా ఎక్కువ చెబితే అలిశెట్టి కవితా స్ఫూర్తికి భంగం కలుగవచ్చు. ఎందుకంటే ఆయన ‘ఎల్లలు లేని కవితాకాశంలో/ ఎవరెవరి బాధలైన రాస్తా... క్షమించండి/ నా ఒక్కడివి మాత్రం దాస్తా’ అని రాసుకున్న కవి.
బి. నర్సన్
(రేపు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి)