‘‘ఉత్తరాంధ్ర జీవనాడిని దొరకబుచ్చుకునే ఒక ప్రయత్నం’’
ABN , First Publish Date - 2023-10-30T01:05:03+05:30 IST
ఉత్తరాంధ్ర అస్తిత్వ వాహినిని కవిత్వం ద్వారా వినిపిస్తున్న కంచరాన భుజంగరావు కవిత్వ సంపుటి ‘నీటి గింజల పంట’ ఇటీవల విడుదలైన సందర్భంగా వారితో ముఖాముఖి...
కంచరాన భుజంగరావు : పలకరింపు
ఉత్తరాంధ్ర అస్తిత్వ వాహినిని కవిత్వం ద్వారా వినిపిస్తున్న కంచరాన భుజంగరావు కవిత్వ సంపుటి ‘నీటి గింజల పంట’ ఇటీవల విడుదలైన సందర్భంగా వారితో ముఖాముఖి:
సాహిత్యం వైపు మరలడం వెనుక మీ నేపథ్యం గురించి చెప్పండి?
నన్ను మంత్రముగ్ధుడిని చేసిన ఏ వాక్యం దగ్గర మొదలై సాహిత్యానికి ఎలా చేరువయ్యానో ఇప్పుడు గుర్తు చేసుకోవడం కష్టం. ఏదో ఒక ప్రత్యేక సందర్భం నన్ను ఇటువైపు నడిపించింది అనుకోను. నా బాల్యంలో మా ‘బడగాం’ గ్రామపెద్ద కూన షణ్ముఖరావు నాయుడుగారు ఊళ్ళో తగాదాలు తీర్మానం చేస్తూ రోజూ చెప్పే పిట్టకథలన్నీ ఆకర్షించేవి, ఆలోచింపజేసేవి. మా ఊరి గౌరీపౌర్ణమి సంబరాల్లో పరిచయమైన జానపదాలు ఎన్నితరాలపాటు అనూచానంగా దక్కిన మౌఖిక సంపదో! నవరసాలు చొప్పించి హనుమంతు లోకనాథం తాత మండపం మీద నుండి రోజుల తరబడి మైకులో చెప్పిన గాథలు ఎలా స్మృతిపథంలో నిలిచిపోయాయో! వీటన్నింటి కొనసాగింపుగా హైస్కూల్ రోజుల్లో సాహిత్యం చదవడం ఒక విరామ ఆసక్తిగా మొదలైంది. ముఖ్యంగా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిని కావడం వలన బోధనకు కథల్ని జోడించడం ఒక అలవాటు నాకు. రెండు దశాబ్దాల పైబడిన నా బోధనా వృత్తి నన్ను సాహిత్యానికి ఇంకా చేరువ చేసిందని అనుకుంటాను.
మీ కవిత్వంలో ఇతివృత్తాలుగా రైతు, మట్టి, నోస్టాల్జియా ఎక్కువ కనిపిస్తాయి, కారణం?
నా పరిసరాల ప్రభావం కావచ్చు, నా కుటుంబ నేపథ్యం కూడా కావచ్చు. రైతు, మట్టి నన్ను నా అక్షరాలనూ పెనవేసుకున్న వస్తువులు. పెరిగిన వాతావరణం జ్ఞాపకాలను నిండా ఆవరించి ఉన్నప్పుడు తలపుల్లో తలపోతల్లో అసంకల్పితంగా అవే గుర్తులు దొర్లుతుంటాయి కదా! నోస్టాల్జియా అనేది ఏ సృజనకారుడి నుండైనా ఎంతో కొంత సృజనను పిండుకోకుండా ఉండదు. ఒక్కోసారి అలా వెలువడిన కళాకృతి బహుదా ప్రశంసలు పొందుతుంది. బహుశా ‘పెరట్లో చింతచెట్టు’ అనే నా కవిత నోస్టాల్జియాతోనే వచ్చినా అది బాగా మెప్పు పొందడానికి కారణం అది చాలామంది పాఠకులకు కనెక్ట్ కావడమేనేమో!
తెలుగు సాహిత్యంపై మీ ‘నీటిగింజల పంట’ కవిత్వం ఏవిధమైన ఆనవాలుగా మిగులుతుందని అనుకుంటున్నారు?
ఉత్తరాంధ్ర జీవనాడిని దొరకబుచ్చుకునే ఒక ప్రయత్నం చేశాను. ఎంతో విశిష్టత గల ఇక్కడి గ్రామీణ జీవితాల్లోకి చొరబడిన బీభత్సాన్ని కళ్ళ ముందుంచేందుకు ప్రయత్నించాను. కళ్ళల్లో నీళ్లు కుక్కుకుని దీనమైన చూపులతో నిలబడ్డ లక్షలాదిమంది రైతులు, రైతు కుటుంబాల గుండెచప్పుళ్ళకు తెరపట్టాను. గిట్టుబాటు కాని పంటపొలాల అంతర్వేదనను మట్టిబెడ్డల చాటున అదిమిపెట్టి మళ్ళీ సాగులోనే మునిగిపోయే మట్టిబిడ్డల కడుపు గోసను వలపోశాను. అనివార్యమైన వలసల వెనుక సముద్రమై పొంగే దుఃఖానికి దాఖలా చూపెట్టాను. ఉద్దానం గోడు వినిపించాను. స్వాతంత్ర్యోద్యమ కవి గరిమెళ్ళ సత్యనారాయణ చెప్పినట్టు, ‘‘రాజకీయాల నుండే కవిత్వ విషయాలు ఎంచుకోవాలి’’. నేను చూస్తున్న జీవితాలను అమితంగా ప్రభావితం చేస్తున్న ఆ రాజకీయాల నుండే ‘నీటిగింజల పంట’లోని చాలా కవితలు చిత్రించబడ్డాయి.
‘‘పెదవులు పగిలిన పొలాలు’’, ‘‘మా పేదరంగు బతుకు సుంకంలేని ఒక ఎగుమతి సరుకు’’, ‘‘నాగలి జెండా పట్టుకొని’’... వంటి మెరుపు వాక్యాలు రాయడం వెనుక ఏదైనా ప్రత్యేక కృషి ఉంటుందా?
కవిత రాస్తున్న క్రమంలో కొన్నిసార్లు మెరుపు వాక్యాలు వాటంతట అవే పుడతాయి. రాసిన కవితకు మెరుగులు దిద్దుతున్నప్పుడు కూడా మరికొన్ని మెరుపు వాక్యాలు అలా కుదిరిపోతాయి. ఏదేమైనా ఏ వాక్యమూ తేలిపోకుండా కాస్త జాగ్రత్త పడతాను.
మీపై శ్రీకాకుళ రైతు, గిరిజన పోరాటాల ప్రభావం ఏమైనా ఉందా?
మట్టితోనే పోరాడుతూ మట్టి పైనే మమకారం ప్రదర్శించే కుటుంబం మాది. నిజానికి అంతకు మించిన ప్రపంచం ఏదీ తెలియదు కూడా. శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాల గురించి తొలిసారి చదువుకున్నది ఛాయరాజ్ కవిగారి ‘శ్రీకాకుళం’ కావ్యం నుండే. రాన్రానూ దాని సాఫల్య వైఫల్యాల గురించిన వివేచన మొదలైంది. ‘‘గుండె గిన్నెలో పెచ్చుగట్టిన ఆ వెలుతురు మీగడ మాకు ఒక మెలకువ గీతం’’ అని నేను రాసుకున్నది ఈ నేల పోరాటాల ప్రతిఫలనాలనే.
ఇంటర్వ్యూ ుఽ మదన మోహన్ రెడ్డి బుగడూరు
నాగరాజు సారిపల్లి
80083 70326