బంజరు సంబంధాలు

ABN , First Publish Date - 2023-10-02T00:58:59+05:30 IST

మొదలంటా కూలిన చెట్టులా జీవితం పక్కకు ఒరిగిపోతున్నపుడు భరోసాగా నిలబడే భుజమొకటి కానరాదు..

బంజరు సంబంధాలు

మొదలంటా కూలిన చెట్టులా

జీవితం పక్కకు ఒరిగిపోతున్నపుడు

భరోసాగా నిలబడే భుజమొకటి కానరాదు

లోపల సుడులుగా తిరుగాడు దుఃఖం

నిట్టనిలువునా కుదిపి వేస్తున్నపుడు

హత్తుకొని ఓదార్పునిచ్చే హృదయం లేదు

మనసులో పోగుబడిన మాటల భారాన్ని

బయట పడవేసి కాస్త తేలిక పడాలంటే

కరుణతో ఎదుట కూర్చునే కళ్ళు లేవు

మనుషులందరూ మొబైల్‌ టచ్‌ దూరంలోనే

నా అన్న వాళ్లందరూ వీడియోకాలంత సమీపంలోనే

వినిపించే మాటల వెనుక కనిపించని పరుగులు

కనిపించే రూపాలలో వినిపించని తడిసవ్వడులు

సముద్రమంత సంబంధాల నడుమ వున్నా

ఒంటరి నావ దుఃఖ గీతానికి శ్రోతలుండరు

ఎవరిని ఎవరూ నిందించలేరు

వాళ్ళని వాళ్లు నిందించుకోవలసిందే - ఎవరైనా

బంజరు నేలలుగా మారిన

సంబంధాల మీద కూడా

కొన్ని వానలు పడితే ఎంత బాగుండు

కాసింత పచ్చదనం కనిపిస్తే ఎంత బాగుండు

కొంచెం పూల పరిమళం వ్యాపిస్తే ఎంత బాగుండు

కోడూరి విజయకుమార్‌

83309 54074

Updated Date - 2023-10-02T00:58:59+05:30 IST