గల్మ

ABN , First Publish Date - 2023-09-25T00:43:59+05:30 IST

ఘడియలు మింగిన గల్మ అటో అడుగు ఇటో అడుగు ఇంటికి బయిటకి కాలం మీద వారధి గాలి దుమారాల్ని ఉరుముల్ని మెరుపుల్ని అరి పాదాల దుఃఖాన్ని... ఆలింగనం చేసుకోని మంచి చెడుల్ని కడుపున పెట్టుకొని...

గల్మ

ఘడియలు మింగిన గల్మ

అటో అడుగు ఇటో అడుగు

ఇంటికి బయిటకి

కాలం మీద వారధి

గాలి దుమారాల్ని

ఉరుముల్ని మెరుపుల్ని

అరి పాదాల దుఃఖాన్ని

ఆలింగనం చేసుకోని

మంచి చెడుల్ని కడుపున పెట్టుకొని

కన్నీళ్లతో పుదిచ్చికున్న దేవత

తెడల తాకిడి తిన్న ఇంటి దరి

తలుపులు తీసినప్పుడల్ల

తలపులు ఇచ్చిన తల్లి

ఎడమ కాలు పెట్టినప్పుడు ఏడ్చింది

కుడికాలు పెట్టినప్పుడు దీవించింది

ఎన్ని ఎదురీతలకు సాక్ష్యమో

ఇంటికి పెద్ద దిక్కోలే

ఎన్నిటికో అడ్డం పడ్డది

గల్మ లోపలి మాట

ఎదురొచ్చి ఎద లోపల బొమ్మకట్టి

రంగుల తాన మాడింది

ముచ్చటలు ఇని మురిసి పోయింది

అమ్మగాల్లాడి గల్మదాక వొచ్చి

తొంగి చూసిన ఆకాశం

అందరు వొచ్చే దాకా ఎదురుచూసే అమ్మ

ఎన్ని పాదాలకు లక్ష్మణరేఖో

ఎన్ని అప్పగింతలకు రెక్కలిచ్చిన

మంత్ర దండమో

దాటి పోయిన అడుగులు

తిరిగొస్తే

అక్కున చేర్చుకోని చెమ్మగిల్లింది

పసుపు కుంకుమలు రాసుకొని

ఇంటిముందు కూసున్న ఇంటి ముత్యాలమ్మ

ఘనీభవించిన చింత

గుండెకు కవచమైంది

గల్మ లోపల అడవులున్నాయి

నిశబ్దపు పులులున్నాయి

తిరగాడే ప్రవాహాలున్నాయి

గల్మ ముందల నిలబడి

అంతా నిజమే చెప్తాను

ఏ గల్మ అయితేంది

వొచ్చేది గల్మగుండే

పొయ్యేదీ గల్మగుండే

బతుకు సారమంతా

గల్మ లోపలే...

మునాసు వెంకట్‌

9948158163

Updated Date - 2023-09-25T00:43:59+05:30 IST