వెలుగు, వివేకం, గాంధేయం...!
ABN , First Publish Date - 2023-01-28T01:04:30+05:30 IST
‘మనజీవితాలలోని వెలుగు వెళ్లిపోయింది. కాదు, ఆ కాంతి ప్రకాశిస్తూనే ఉంది.
‘మనజీవితాలలోని వెలుగు వెళ్లిపోయింది. కాదు, ఆ కాంతి ప్రకాశిస్తూనే ఉంది. సహస్రాబ్దాల తరబడి అది మన హృదయాలను జ్యోతిర్మయం చేస్తూనే ఉంటుంది’ – 1948 జనవరి 30 సాయంత్రం జవహర్ లాల్ నెహ్రూ ఆకాశవాణిలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్న మాటలవి. ఆ జ్యోతి, మనం మహాత్ముడుగా గౌరవిస్తున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. మత సామరస్యానికై 75 సంవత్సరాల క్రితం (జనవరి 30న) ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇన్ని దశాబ్దాల తరువాత కూడా గాంధీ జీవితాచరణలు, బోధనలకూ ప్రాధాన్యమున్నదా? వాటిని మనం ఔదలదాల్చాలా? అవును. శిరసావహించాలి. 21వ శతాబ్ది మూడో దశకంలో మహాత్ముని జీవితమూ, భావాలూ ఎందుకు యుక్తమైనవో పది భావద్యోతకమైన కారణాలను ప్రతిపాదించ దలుచుకున్నాను.
సత్యాగ్రహం మొదటి కారణం. బలాన్ని ఉపయోగించకుండా అధర్మ పాలకులు, అన్యాయాలను ప్రతిఘటించేందుకు ఆయన ఒక వినూత్న మార్గాన్ని మనకు చూపారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే సత్యాగ్రహ భావన 1906 సెప్టెంబర్ 11న జోహాన్నెస్‌బర్గ్ లోని ఎంపైర్ థియేటర్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రభవించింది జాతి వివక్షా విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపి స్వచ్ఛందంగా అరెస్టవ్వాలని ఆ సమావేశంలో పాల్గొన్న భారతీయులు గాంధీ నాయకత్వంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. 95 సంవత్సరాల అనంతరం సరిగ్గా అదే రోజున న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని ఉగ్రవాదులు కూల్చివేశారు. రెండు 9/11 లు! ఒకటి– అహింసాత్మక పోరాటం, వ్యక్తిగత త్యాగాల ద్వారా న్యాయసాధనకు పూనుకోగా మరొకటి హింస, విధ్వంసకాండతో శత్రువును జడిపించడానికి ప్రయత్నించింది. అన్యాయంపై నిరసన పోరాటంగా సత్యాగ్రహం మరింత నైతికమైనదని, ప్రత్యామ్నాయ పోరాట రూపాల కంటే అదే మరింత ప్రభావశీలమైనదని చరిత్ర రుజువు చేసింది. దక్షిణాఫ్రికా, భారత్‌లలో బ్రిటిష్ పాలనపై పోరాటానికి గాంధీ ఉపయోగించిన సత్యాగ్రహ పద్ధతిని ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనుసరించారు. అమెరికాలో 1960వ దశకంలో జరిగిన పౌరహక్కుల ఉద్యమం వాటిలో అగ్రగణ్యమైనది.
గాంధీ తన మాతృదేశాన్ని, దాని సంస్కృతిని ఔదలదాలుస్తూనే అందులోని మానవతా విరుద్ధ లక్షణాలను నిరసిస్తూ వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించారు. ఇది ఆయన వర్తమాన ప్రాధాన్యానికి రెండో కారణం. గాంధీ కేవలం బ్రిటిష్ వారిపైనే కాకుండా భారత్‌పై కూడా పోరాడారని చరిత్రకారుడు సునీల్ ఖిలానీ ఒకసారి వ్యాఖ్యానించారు. భారతీయ సమాజంలో అసమానతలు ఎల్లెడలా దట్టంగా ఉన్నాయని గాంధీ గ్రహించారు. అసంఖ్యాక భారతీయులను పీడిస్తున్న దురాచారాలలో ఒకటైన అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. అస్పృశ్యత ఉన్నంతవరకు భారతీయులు నిజమైన స్వాతంత్ర్యానికి అర్హులు కారని విశ్వసించినందునే అంటరానితనంపై ఆయన ఎడతెగని యుద్ధం చేశారు. అలాగే మహిళలు సకల జీవన రంగాలలో, ముఖ్యంగా ప్రజా జీవితంలోకి ప్రవేశించేందుకు గాంధీ అద్వితీయమైన తోడ్పాటునందించారు.
మహాత్ముడు అనుష్ఠాన హిందువు. అయితే పౌరసత్వాన్ని మత ప్రాతిపదికన నిర్వచించేందుకు ఆయన నిర్ద్వంద్వంగా నిరాకరించారు. కులం హిందువులను అడ్డంగాను, మతం భారత్‌ను నిట్టనిలువుగాను విభజించిందని ఆయన భావించారు. ఈ చీలికలను ఆయన వ్యతిరేకించారు. హిందూ–ముస్లిం సమైక్యతకు కృషి చేశారు. అందుకు ప్రాణత్యాగం చేసేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు. ఇది మహాత్ముని సార్వకాలిక ప్రాధాన్యానికి మూడవ కారణం.
జీవిత వైవిధ్యాన్ని గౌరవించడం గాంధీ గొప్పదనానికి, ఆయన స్పూర్తిదాయక ప్రాసంగికతకు నాలుగో కారణం. గుజరాతీ ఆయన మాతృభాష. ఆ భాషలో ఆయన మహా వచనకారుడు అని అందరూ అంగీకరించారు. ప్రాంతీయ సంకుచితత్వం ఆయనలో ఏ కోశానా లేదు. ఇతర భాషా సంస్కృతులను చిన్నచూపు చూడడం, స్వభాషా సంస్కృతులు సర్వోత్తమమైనవని భావించడం ఆయన స్వభావానికి పూర్తిగా విరుద్ధం. లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం, దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ వృత్తి జీవితం ఆయనకు స్వదేశంలోని మత, భాషా పరమైన వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించేలా చేశాయి. ఆయన సన్నిహిత సహచరులలో హిందువులే కాదు, ముస్లింలూ ఉన్నారు. అలాగే గుజరాతీలే కాదు తమిళ తంబీలు కూడా ఎంతో మంది ఉన్నారు.
గాంధీ ఎంత దేశభక్తుడో అంతగా అంతర్జాతీయవాది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆయన విశ్వనరుడు. ఇది, మహాత్ముని ప్రాధాన్యాన్ని విశదం చేసే ఐదవ కారణం. భారతీయ నాగరికత సమున్నతమైనదని ఆయన ప్రశంసించారు. అయితే 20వ శతాబ్దంలో ఏ దేశమూ బావిలో కప్పలా ఉండలేదని, ఉండకూడదని కూడా ఆయన విశ్వసించారు. ప్రాచ్య ఋషులే కాదు, పాశ్చాత్య విజ్ఞులూ ఆయన్ని ప్రభావితం చేశారు. తన విలక్షణ దృక్పథం, చింతనా రీతికి గోఖలే, రాయచంద్ భాయికే కాకుండా టాల్‌స్టాయి, రస్కిన్ లకు కూడా ఆయన రుణపడి ఉన్నారు. అన్ని జాతుల, మతాల వారూ ఆయన సన్నిహిత స్నేహితులలో ఉన్నారు.
ప్రస్తావిత ఐదు అంశాలూ స్వతంత్ర భారతదేశాన్ని పూర్తిగా ఒక భిన్న, సమున్నత దారిలో ఎలా ముందుకు నడిపాయో తెలుసుకోవాల్సిన అవసరముంది. హింసాత్మక పద్ధతులను అనుసరించకుండా చర్చల ద్వారా అహింసాయుతంగా స్వాతంత్ర్య సాధనకు గాంధీ ప్రాధాన్యమిచ్చారు. ఈ గాంధీ వారసత్వమే మన దేశం ఏక పార్టీ నియంతృత్వ రాజ్యంగా కాకుండా బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రభవించేందుకు విశేషంగా దోహదం చేసింది. జెండర్, కుల సమానత్వానికి గాంధీ, అంబేడ్కర్‌లు జీవితాంతం కృషి చేశారు. ఆ సమానత్వ సాధనకు తోడ్పడే నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరిచారు. మత, భాషా పరమైన వైవిధ్యాన్ని పరిరక్షించాలని గాంధీ, నెహ్రూలు వక్కాణించినందునే మన దేశం పౌరసత్వాన్ని మతప్రాతిపదికన నిర్వచించలేదు. స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా సామాజిక సమానత్వం, సాంస్కృతిక బహుళత్వానికి మహాత్ముడు అగ్ర ప్రాధాన్యం ఇవ్వడం వల్లే స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక, సమ్మిళిత రాజకీయ విలువలు వర్థిల్లుతున్నాయని చెప్పి తీరాలి.
పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు ప్రారంభం కాక పూర్వమే మహాత్ముడు పర్యావరణ వాది. ఇది ఆయన ప్రాధాన్యానికి ఆరో కారణం. విచక్షణా రహిత అభివృద్ధి, అడ్డూ అదుపూ లేని వినియోగదారీ సంస్కృతి ఈ ధరిత్రిని ధ్వంసం చేస్తాయని ఆయన 1928లోనే హెచ్చరించారు. గాంధీ జీవితం ఒక ప్రవాహ సదృశం. కొత్త వ్యక్తులతో సంభాషణలు, సంవాదాలు; నూతన అనుభవాల నుంచి మహాత్ముడు నిత్యం విలువైన విషయాలు నేర్చుకునేవాడు. ఈ విశాల దృక్పథం ఆయన ప్రాధాన్యానికి ఏడవ కారణం. వాస్తవాలకు అనుగుణంగా ఆయన తన అభిప్రాయాలను మార్చుకునేవారు. జీవిత క్రమంలో ఆయన మూడు అంశాలపై తన భావాలు, దృక్పథాన్ని మార్చుకున్నారు. జాతి, కులం, జెండర్ వాటిలో ముఖ్యమైనవి. ఈ జీవన వాస్తవాలపై గాంధీ తన యవ్వన కాలపు దురభిప్రాయాలను త్యజించి మరింత ప్రగతిశీల వైఖరిని అలవరచుకున్నారు. అనాలోచిత జాతి దురహంకారం నుంచి బయటపడి సూత్ర బద్ధ జాతి వివక్ష వ్యతిరేకవాదిగా మారారు. కులానికి సంబంధించి సామాజిక నిచ్చెన మెట్ల వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అంతిమంగా కుల వ్యవస్థ దురాచారాలపై నేరుగా పోరాడారు. తొలుత మహిళలను రాజకీయేతర కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసిన గాంధీ ఆ తరువాత వారిని ప్రజా జీవితంలో ప్రవేశించేందుకు, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేందుకు హృదయపూర్వకంగా ప్రోత్సహించారు.
తన అనుయాయులను నాయకులుగా రూపొందించడంలో గాంధీకి అద్భుతమైన నేర్పు ఉన్నది. ఇది ఆయన ప్రాధాన్యానికి ఎనిమిదో కారణం. ప్రతిభావంతులను గుర్తించి వారిని అన్ని విధాల ప్రోత్సహించేవారు. శిక్షణ ఇచ్చేవారు. సమున్నత బాధ్యతలను నిష్పాక్షికంగా నిర్వర్తించేలా వారిని తీర్చిదిద్దేవారు. ఆ తరువాత వారు తమ సొంత మార్గాలలో ముందుకు సాగేందుకు స్వేచ్ఛనిచ్చేవారు. గాంధీ అనుయాయులలో అనేక మంది మహానాయకులుగా ఎదిగారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, కమలాదేవి ఛటో పాధ్యాయ, సి. రాజగోపాలాచారి, జకీర్ హుస్సేన్, జెబి. కృపలానీ, జేసీ కుమారప్ప మొదలైన వారినెందరినో ఉదహరించవచ్చు.
ప్రత్యర్థుల దృక్పథంలోని సమంజసత్వాన్ని అంగీకరించి, వారితో గౌరవపూర్వకంగా రాజీపడేందుకు సుముఖత చూపే వైఖరి గాంధీ గొప్పదనానికి, ప్రాధాన్యానికి తొమ్మిదో కారణం. రాజకీయ ప్రత్యర్థులైన జిన్నా, అంబేడ్కర్‌లతోనూ, దక్షిణాఫ్రికా, భారత్‌లలో బ్రిటిష్ పాలనాధికారులతోనూ ఆయన తీవ్రంగా విభేదించేవారు. అయితే ఆ విభేదాలు మేధాపరమైనవి, విధానపరమైనవి మాత్రమే, వారిపట్ల వ్యక్తిగత అయిష్టత, విద్వేష భావం చూపడమనేది గాంధీ స్వభావంలో లేనేలేదు. ఆ విభేదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఆయన ప్రయత్నించేవారు.
గాంధీ రాజకీయ జీవితమూ ఒక తెరిచిన పుస్తకమే. సంపూర్ణ పారదర్శకత దాని విశిష్ట గుణం. మహాత్ముని ప్రాధాన్యానికి ఇది పదవ కారణం. ఎవరైనా సరే గాంధీ ఆశ్రమంలోకి వెళ్లవచ్చు. ఆయనతో ఎవరైనా స్వేచ్ఛగా సంవాదపడవచ్చు. ఎవరైనా సరే బాపూ వద్దకు స్వేచ్ఛగా వెళ్లవచ్చు; ఆయన్ని హత్య చేయవచ్చు! నిజానికి అంతిమంగా జరిగింది కూడా ఇంతేకదా!!
ఇవీ, గాంధీ జీవితం నుంచి మనం నేర్చుకోవల్సిన పాఠాలు. మహాత్ముని జీవనరీతులు, సామాజిక దురన్యాయాలు, అధర్మ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన అనుసరించిన పద్ధతులు, నవీన నాగరికతలోని ప్రమాదకర పోకడల గురించి అసాధారణ దూరదృష్టితో చేసిన హెచ్చరికలు నేడు కేవలం మన దేశానికే కాకుండా యావత్ప్రపంచానికీ ఉపయుక్తమైనవి. కలహశీల మతోన్మాద మెజారిటీ వాదం; ప్రతీకార రాజకీయ ధోరణులు; సత్యసంధత లోపించిన నాయకులు, చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు, విచక్షణారహితంగా ప్రాకృతిక సంపదల విధ్వంసం, వ్యక్తి పూజలు పెరిగిపోతున్న వర్తమాన భారతదేశంలో గాంధీ జీవితం నేర్పుతున్న పాఠాలకు మరింత ప్రాధాన్యమున్నది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)