Share News

పౌరహక్కుల సంఘం ప్రకటనలో అర్ధసత్యాలు

ABN , Publish Date - Dec 29 , 2023 | 01:28 AM

డిసెంబర్‌ 23 ఆంధ్రజ్యోతిలో ‘యాభైయేళ్లుగా ప్రజల పక్షాన’ అనే పౌరహక్కుల సంఘం ప్రకటన చూసిన తర్వాత ఒక వాస్తవం చెప్పాలనిపించింది...

పౌరహక్కుల సంఘం ప్రకటనలో అర్ధసత్యాలు

డిసెంబర్‌ 23 ఆంధ్రజ్యోతిలో ‘యాభైయేళ్లుగా ప్రజల పక్షాన’ అనే పౌరహక్కుల సంఘం ప్రకటన చూసిన తర్వాత ఒక వాస్తవం చెప్పాలనిపించింది.

‘తారీఖులు, దస్తావేజులు చరిత్రసారం’ కాదనేది నిజమే కాని, అవాస్తవికమైన ఒక విషయాన్ని ఒక తారీఖుతో ముడిపెట్టి రికార్డు చేయటం సబబు కాదు. భవిష్యత్తులో ఇదే చరిత్రగా నమోదయ్యే ప్రమాదం ఉంది.

పౌరహక్కుల సంఘం వారు ప్రస్తావించిన పౌరహక్కుల రాష్ట్రస్థాయి సభ 1973 డిసెంబర్‌ 23న గుంటూరులో జరిగిన మాట వాస్తవం. కాని ఆ రోజు సంఘం ఏర్పడలేదు. ఆ సభకు అధ్యక్షత వహించిన శ్రీశ్రీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం విషయంలో ఏకాభిప్రాయం కుదిరినా, కార్యదర్శిగా ఎవరుండాలనే విషయంపై కుదరలేదు. ఆ నాటికి ఉమ్మడి రాష్ట్రంలో పౌరహక్కుల మహాసభల్ని వివిధ జిల్లాల్లో నిర్వహించి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాలూకా స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటుచేసి ఆనాటి ఉద్యమానికి తరిమెల నాగిరెడ్డి ఆధ్వర్యంలోని నక్సల్‌ గ్రూపు నాంది పలికి పౌరహక్కుల ఉద్యమానికి ఒక భూమిక ఏర్పాటు చేసింది. పౌరహక్కుల ఉద్యమం కూడా సాయుధ పోరాట ప్రచార వేదికలుగా ఉండాలనే అభిప్రాయంతో ఆయా సభలకు దూరంగా వున్న చారుమజుందార్‌ గ్రూపు నక్సల్స్‌ హక్కుల ఉద్యమానికి దూరంగా ఉంటూ ఎట్టకేలకు 1973 డిసెంబర్‌ 23 నాటికి రాష్ట్ర మహాసభలకు హాజరయ్యారు. వీరు అప్పటికే నాగిరెడ్డి గ్రూపు నుంచి బయటికెళ్లిన చండ్ర పుల్లారెడ్డి వర్గంతో కలిసి కార్యదర్శిగా తమకు అనుకూలుడైన పత్తిపాటి వెంకటేశ్వర్లుని ప్రతిపాదించి, అసలు ఉద్యమాన్ని ప్రారంభించిన నాగిరెడ్డి వర్గీయులకు స్థానం లేకుండా చేయాలని ప్రయత్నించారు. శ్రీశ్రీ గౌరవాధ్యక్షులుగా పత్తిపాటి, రామదాసురెడ్డిలలో ఒకరు అధ్యక్షునిగా, మరొకరు కార్యదర్శిగా ఉండాలని వచ్చిన ప్రతిపాదన గాని, రెండు గ్రూపుల్లో ఎవరు ప్రతిపాదించినా దాన్ని రెండో గ్రూపు ఆమోదించాలని, అలా ప్రతిపాదించే అవకాశం తమ ప్రత్యర్ధులకే ఇస్తూ నాగిరెడ్డి చేసిన ప్రతిపాదనని కూడా తిరస్కరించారు. నాగిరెడ్డి దయతో దానం చేస్తే మేం తీసుకోవాలా? అని కొల్లా వెంకయ్య అన్నారు. ఆనాడు నక్సల్‌ గ్రూపుల నాయకుల మధ్య అంతరాలు అంత గట్టిగాను, కుత్సితంగానూ ఉండేవి.

ఈ ప్రయత్నాలకు భిన్నంగా అనంతపురం జిల్లాలో అప్పటికి అనేక సంవత్సరాలుగా పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్న రామదాసురెడ్డిని కార్యదర్శిగా ప్రతిపాదించాయి. కమిటీ ఎన్నిక గందరగోళం అయింది. ఎవరు ఎన్ని రాజీ ప్రతిపాదనలు చేసినా ఆనాటి సభలో పాల్గొన్న కొల్లా వెంకయ్య, మాదల నారాయణస్వామి (ఇద్దరు మాజీ పార్లమెంటు సభ్యులే) మొండిగా తిరస్కరించటంతో సమాన స్థాయిలో ఉన్న ఇరువర్గాల ప్రతినిధులు ఎటువంటి కమిటీని ఎన్నుకోకుండానే ఊరేగింపుగా బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు.

అక్కడ ఒక కమిటీని ఎన్నుకున్నట్లు అసత్య ప్రకటనను శ్రీశ్రీ చేత చేయించటానికి వరవరరావు చేసిన ప్రయత్నం శ్రీశ్రీ సహకరించకపోవటంతో కుదరలేదు. దాంతో సభానంతరం ప్రతినిధులంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతకాలనికి హైదరాబాద్‌లో ఒక చిన్న సమావేశం జరిపి ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం (APCLC) ఏర్పడినట్లు యం.టి. ఖాన్‌, పత్తిపాటి వెంకటేశ్వర్లు ప్రకటించారు. మరికొంతకాలానికి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంస్థని (OPDR) రామదాసురెడ్డి అధ్యక్షులుగా, హైకోర్టు న్యాయవాది సి.వెంకటకృష్ణ కార్యదర్శిగా మరో వర్గం ఏర్పాటు చేసుకుంది. కనుక పౌరహక్కుల సంఘం 1973 డిసెంబర్‌ 23న ఏర్పడింది అనేది వాస్తవం కాదు. దురదృష్టవశాత్తూ ఆనాటి విషయానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ముఖ్యుల్లో వరవరరావు, చెరుకూరి సత్యనారాయణలు తప్ప ఎవరూ సజీవంగా లేరు.

సి. మేఘనాధరెడ్డి

Updated Date - Dec 29 , 2023 | 01:28 AM