హీన యానం

ABN , First Publish Date - 2023-09-18T00:20:00+05:30 IST

ఒక అంధ యుగపు నడి రాత్రి చీకటింటిలో తిరిగీ తిరిగీ గుడ్డి దయ్యం ముందుగా తన ఇంటి వాన్నే తింటూ కూర్చున్నది. మనుషులు లేని ఎడారిలో ఒంటెలనే బంధిస్తున్నారు...

హీన యానం

ఒక అంధ యుగపు నడి రాత్రి చీకటింటిలో తిరిగీ తిరిగీ

గుడ్డి దయ్యం ముందుగా తన ఇంటి వాన్నే తింటూ కూర్చున్నది.

మనుషులు లేని ఎడారిలో ఒంటెలనే బంధిస్తున్నారు.

కుందేళ్ళు భీతిల్లి పారిపోతున్నాయి.

వెన్నెలలో పాడి పాడి అలసి నిదురించే నీ తలాపున

ఏ ముసలిపులో పొంచి ఉంటుంది.

బహిరంగ శిక్షాస్మృతులు తలలను చిలక్కొయ్యలకు వేలాడదీస్తున్నాయి.

ఐచ్ఛిక బానిసల గుంపు ఒకటి నడివీధుల గుండా అరుపులతో వెళుతున్నది.

తెల్లముసలి ఎలుగుబంటు ఒకటే రాజసంగా నడిచిపోతున్నది రాచవీధుల్లో.

గురుకుల ఆశ్రమంలో ఉదయించే సూర్యుని రంగు కూడా మారుతున్నది.

కొండ లోయల్లోంచి భీతావహంగా స్త్రీల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

విషాన్ని తాగిన శివుడు చంద్రునిమీద పాదం మోపి శివసత్తుల ఆట ఆడుతున్నాడు.

జామురాత్రిలేచి తొలి కోడి కూసింది. తెల్లవారడానికి ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది.

ఇప్పుడు లంఘించే సింహానికి ఎదురుగా పరుగెత్తి

జింకలు ఏటవాలుగా తమ కొమ్ములు విసిరితే చాలు.

పీడకలలు వచ్చినంత మాత్రాన కలలే రాకుండా ఉంటాయా?

చీకటి రోజులు చిరకాలం తెలవారకుండా ఉంటాయా?

తైదల అంజయ్య

Updated Date - 2023-09-18T00:20:00+05:30 IST