హెజిటెంట్‌

ABN , First Publish Date - 2023-10-02T00:54:36+05:30 IST

అన్నివైపులా మూసివేసినా ఆ కిటికీనీ మాత్రం అలాగే తెరచివుంచుతావు! మారే కాలాలు! మారిపోయే మనుషులు! కిటికీ అవతల ప్రపంచానికి నిన్ను నువ్వు అనుసంధాన పరచుకునే ప్రయత్నం!...

హెజిటెంట్‌

1

అన్నివైపులా మూసివేసినా

ఆ కిటికీనీ మాత్రం

అలాగే తెరచివుంచుతావు!

మారే కాలాలు!

మారిపోయే మనుషులు!

కిటికీ అవతల ప్రపంచానికి

నిన్ను నువ్వు

అనుసంధాన పరచుకునే ప్రయత్నం!

2

దేశ కాల మానానికి అతీతమై

మారని సహజ స్వభావం

కదలని తెరలా ఆలోచనలకు

అడ్డుపడుతూ...

3

ఏదీ కోరుకునే తెగింపులేక

ఏదో కోరాలనే ఆత్రాల మధ్య

ఊగిసలాడుతూ నువ్వు!

అయినా

ప్రపంచానికీ నీకూ మధ్యన

మొహమాటపు పరదా

తొలగించే ప్రయత్నమేదీ అప్పటికి

కనిపించదు!

4

తరగిపోయే ఎండపొడని చూస్తూ

చేతలు ఏవీ లేని నిశ్చలత,

పెరిగే నీడ చాటు

స్థిరమైన మౌనము, ఇప్పటి స్థితి!

5

గాలికి ఊగుతున్న గులాబీలు

వాస్తవాన్ని మరిపించే ప్రయత్నంలో

ఏదో చెప్పాలని

అర్థంకాని తత్వాలు కొన్ని

తెలివితక్కువతనంలో

కొట్టుకుపోతాయి!

6

ఇంకా జీవిస్తున్నట్లు ప్రతీకగా...

తెరచిన కిటికీ రెక్క మీదగా

తెలియని దుఃఖాన్ని దాచిపెట్టుకుని

ఓ మేఘం కదిలి వెళ్ళిపోతుంటుంది!

రాళ్ళబండి శశిశ్రీ

74163 99396

Updated Date - 2023-10-02T00:54:36+05:30 IST