పాలనా కేంద్రీకరణ ప్రజాహితమేనా?
ABN , First Publish Date - 2023-05-20T01:57:34+05:30 IST
దురదృష్టాలు ఒంటరిగా రావనేది ఒక లోకోక్తి. ఈ మే 7తో ప్రారంభమైన వారం భారతీయ జనతా పార్టీని కుదిపివేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం మే 11న రెండు తీర్పులు వెలువరించింది. ..
140 కోట్ల మంది భారతీయులను ఒకే పాలనా ఛత్రం కిందకు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది. పాలనాధికారాల కేంద్రీకరణ దిశగా సంభవిస్తున్న పరిణామాలకు సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన రెండు తీర్పులు పెద్ద అవరోధంగా నిలిచాయి. బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థే ఈ ‘కేంద్రీకరణ’ జాడ్యానికి సరైన ఔషధం.
దురదృష్టాలు ఒంటరిగా రావనేది ఒక లోకోక్తి. ఈ మే 7తో ప్రారంభమైన వారం భారతీయ జనతా పార్టీని కుదిపివేసింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం మే 11న రెండు తీర్పులు వెలువరించింది. ఐదుగురు సభ్యుల చొప్పున ఉన్న రెండు రాజ్యాంగ ధర్మాసనాలు ఆ తీర్పులు ఇచ్చాయి. కీలక రాజ్యాంగ నిబంధనలకు ఆ రెండు తీర్పులు అర్థవంతమైన భాష్యాలు చెప్పాయి. నిజానికి ఆ రెండు తీర్పులు ప్రభుత్వాన్ని ముఖం మీద చరచడమే. సరే, మే 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
ప్రతికూలతలు వెల్లువెత్తినప్పడు ‘మౌనం’ను ఆశ్రయించడం బీజేపీకి పరిపాటి. ఇప్పుడూ అదే జరిగింది. తనకు తానే అభయమిచ్చుకునే గౌరవనీయ హోం మంత్రి, వాగాడంబరం ప్రదర్శించే గౌరవనీయ మాజీ న్యాయ శాఖ మంత్రి సుప్రీంకోర్టు తీర్పులకు గానీ, కర్ణాటక తీర్పుకు గానీ ప్రతిస్పందించనే లేదు.
సుప్రీంకోర్టు తీర్పులలో మొదటి దానికి కారణమైన ఢిల్లీ కేసు విషయాన్ని చూద్దాం. 2018లో రాజ్యాంగ అధికరణ 239 ఎఎ (ఢిల్లీ ప్రభుత్వ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించినది)ను వివరిస్తూ శాంతిభద్రతలు, పోలీసు విభాగం, భూముల వ్యవహారాలు మినహా మిగతా అన్ని అంశాలపై కార్యనిర్వాహక అధికారాలు అన్నీ ఢిల్లీ ప్రభుత్వ మంత్రి మండలివేనని, లెఫ్టినెంట్ గవర్నర్ ఆ మంత్రి మండలి ‘సలహా, సహాయం’తో నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే ‘సర్వీసెస్’ విషయంలో సందేహాలు మిగిలిపోయాయి. సివిల్ సర్వెంట్‌లపై అజమాయిషీ ఎవరిది? ఇదే విషయమై మే 11న సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం సివిల్ సర్వెంట్‌లపై ఢిల్లీ మంత్రిమండలికే సంపూర్ణ నియంత్రణాధికారాలు ఉంటాయి.
మే 11నే వెలువరించిన రెండో తీర్పుకు సంబంధించిన కేసు సంక్లిష్టమైనది. ఎందుకంటే అది రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ నిబంధనల (పార్టీ ఫిరాయింపుల వలన సంక్రమించే అనర్హతల గురించిన అంశాలు)కు సంబంధించినది. సర్వోన్నత న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పులలో ఈ నిబంధనలపై సాధికారిక, అసందిగ్ధ వ్యాఖ్యలు చేయలేదు. 24లో పదవ షెడ్యూలును సవరించిన తరువాత ఒక శాసనసభా పక్షంలో ‘చీలిక’ అనే భావనకు ఆస్కారం లేకుండా పోయింది. ఈ క్రింద పేర్కొన్న రెండు షరతులలో ఏ ఒక్కదానికైనా అనుగుణంగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఫిరాయింపుల అపాయం నుంచి మినహాయింపును పదవ షెడ్యూలు అనుమతించింది. అవి: (1) మాతృ రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీతో విలీనమైతే ఆ విలీనాన్ని శాసనసభా పక్షంలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు విధిగా ఆమోదించి తీరాలి; (2) శాసనకర్తలు ఆ విలీనాన్ని ఆమోదించకుండా చట్ట సభలో ప్రత్యేక బృందంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నప్పుడు. ఈ రెండు షరతులలో ఏ ఒక్కటీ వర్తించని పరిస్థితులలో తిరుగుబాటు శాసనసభ్యులు శాసనసభా పక్షానికే చెందుతారు. అప్పుడు వారు విధిగా మాతృ రాజకీయ పార్టీ విప్‌ను పాటించి తీరాలి.
మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో 16 మంది ఎమ్మెల్యేలు శివసేన శాసనసభా పక్షం నుంచి చీలిపోయారు. వారి మాతృ రాజకీయ పార్టీ ఆ రోజున మరో రాజకీయ పార్టీతో విలీనం కాలేదు. (ఆ మాట కొస్తే శివసేన నేటికీ మరో రాజకీయ పార్టీతో విలీనం కాలేదు). పదవ షెడ్యూలు పేర్కొన్న అసాధారణ పరిస్థితులు ఏవీ లేవు. కనుక తిరుగుబాటు ఎమ్మెల్యేలు మాతృ రాజకీయ పార్టీ 2022 జూన్ 21న జారీ చేసిన విప్ ప్రకారం వ్యవహరించాలి.
ఏక్‌నాథ్ షిండే వర్గం ఆ విప్‌ను ధిక్కరించి బీజేపీతో చేతులు కలిపింది. రాష్ట్ర గవర్నర్ ఎటవంటి కారణం లేకుండానే (సుప్రీంకోర్టు ఈ వాస్తవాన్ని గుర్తించింది) ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను శాసనసభ విశ్వాసాన్ని పొందాలని ఆదేశించారు. శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండానే ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. ఇది సరైన సలహాపై తీసుకున్న నిర్ణయం కాదనేది స్పష్టం. రాష్ట్ర గవర్నర్ వెన్వెంటనే షిండేను ముఖ్యమంత్రిగా నియమించారు. షిండే వర్గం, బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. విడిపోయిన 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు శివసేన విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు (ఇలా చాలా శాసనసభలలో జరుగుతున్నదనేది మనకు తెలిసిన విషయమే).
రాజకీయ పార్టీ (ఈ కేసులో శివసేన) నియమించిన వ్యక్తి ‘విప్’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి శాసనసభ విశ్వాసాన్ని పొందాలని గవర్నర్ ఆదేశించేందుకు సరైన కారణం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ పరిస్థితులలో విడిపోయిన 16 మంది ఎమ్మెల్యేల విషయమై స్పీకర్ సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మహారాష్ట్ర గవర్నర్ తన అధికార పరిధిని ఉల్లంఘించారు. స్పీకర్ తన అధికారాలను సరిగా వినియోగించలేదు. ఇరువురూ తమ విధ్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించలేదనేది స్పష్టం.
వివిధ రాష్ట్రాలలో అప్రతిష్ఠాత్మక ‘ఆపరేషన్ కమల’లు; ఉత్తౘ్‌ప్రదేశ్, మధ్య ప్రదేశ్, అస్సోంలలో బుల్‌డోజర్ న్యాయం; బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలకు ఏదో ఒక సాకుతో నిధుల నిరాకరణ లేదా తగ్గింపు; ప్రతిపక్షాల నేతలపై క్రిమినల్ కేసుల నమోదు; రాజ్యాంగబద్ధత సందేహాస్పదమైన (అధికరణ 370 సవరణ, ఎన్నికల బాండ్లు) చట్టాలు; ఉమ్మడి పౌర స్మృతి విషయమై ఏకపక్ష నిర్ణయాలు; జాతీయ పౌర పట్టికను సృష్టిస్తామనే బెదిరింపులు; రాష్ట్ర చట్టాలను తిరస్కరించేందుకు ఉమ్మడి జాబితాను ఉపయోగించుకోవడం (విద్య సంబంధిత చట్టాలే ఇందుకొక ఉదాహరణ); జీఎస్టీ చట్టాల కింద పన్ను విధింపు అధికారాల అపహరణ ఇత్యాది చర్యల, నిర్ణయాల లక్ష్యం ఏమిటో సుస్పష్టమే. సర్వాంతర్యామి, సర్వశక్తిమంతమైన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒకే పాలనా ఛత్రం కిందకు 140కోట్ల మంది భారతీయులను తీసుకురావడమే ఆ లక్ష్యం! ఇదే ‘కేంద్రీకరణ విధానం’ (సెంట్రలిజం). ఈ విధానాన్నే చైనా, రష్యా, తుర్కీయేలు అనుసరిస్తున్నాయి మరి. ఈ కేంద్రీకరణ దిశగా సంభవిస్తున్న పరిణామాలకు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన రెండు తీర్పులు పెద్ద అవరోధంగా నిలిచాయి. కర్ణాటక ఓటర్ల తీర్పు పాలకపక్ష శ్రేణలు గొప్పగా చెప్పుకునే డబుల్ ఇంజిన్‌ను పట్టాలు తప్పించింది. బహుళ పార్టీల రాజకీయ వ్యవస్థే ఈ ‘కేంద్రీకరణ’ జాడ్యానికి సరైన ఔషధం. సుప్రీంకోర్టులో రెండు న్యాయ పోరాటాల్లోను, కర్ణాటకలో ఒక ప్రజాస్వామ్య సమరంలోను విజయం లభించింది. మున్ముందు మరెన్నో న్యాయ, ప్రజాస్వామ్య పోరాటాలలో గెలవవలసి ఉంది.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)