కాలగతి
ABN , First Publish Date - 2023-02-27T01:50:42+05:30 IST
ఏదో గాలి సోకినట్టు ఊళ్ళో పాడి ఆవు అడుగు అగుపడత లేదు ఏ పాడు కన్ను పడ్డదో...
ఏదో గాలి సోకినట్టు
ఊళ్ళో
పాడి ఆవు అడుగు అగుపడత లేదు
ఏ పాడు కన్ను పడ్డదో
ఊరు చుట్టూ
ఉప్పు దిప్పి దిష్టి ఎత్తి పొయ్యాలి
చేలెంట సెలకలెంట
పెసరు బొబ్బెర్ల
పచ్చ పచ్చని పసరు మురుకసూసుకుంటూ
పులపుల్లగ తియతీయగ
దోస తీగలు తడిమిన వెతుకులాట
ఇంకా పచ్చి కాయల వాసనే
సద్దచేను మీద పిట్టలు వాలినట్టు
పాల కంకులు ఇరుసుకుని వొలుచుకుంటూ
నములుకుంటూ నడిచిన బడిబాట
జ్ఞాపకాల సద్దిమూటే
పల్లిపంట మీద కోతులు దునికినట్టు
పల్లికాయ గుత్తులు జుత్తుపట్టి పీకితే
ఎక్కడి నుండో అరిచిన కాపు అరుపులకు
లాగు తడిసిన భయం
అయ్యకు తెలువని అదో పెద్ద రహస్యం
పొద్దు తిరుగుడు, పూలబాయి
కందిచేను, ఉలువచేను
అమ్మ
కూలీకి తెంపవోయిన బెండ తోటల జాడలెక్కడా
పున్నమి నాటి పూర్ణచంద్రుడు లాంటి
నిన్నటి నిండు వ్యవసాయ క్షేత్రం
నేడు మాయమవుతున్న నెలవంక
పొదుగు గోసుకుంటే
కడుపు నిండినట్టు
పొట్ట జీరితే
బాతు బంగారమయినట్టు
కష్టం మెతుకు
చెమట బ్రతుకు చేదయిన
భూదందా భూతం
కాలు మీద కాలేసుకుని కూర్చున్నది
కాలువ దొవ్వి పాదుజేసి
నీళ్ళు పారించి పారించి
పొర్లించి పొర్లించి
పిడికెడు పిడికెడు
టమాటా సూర్యగోళాలు పండించే
రైతు రారాజు కాలం మళ్ళీ వస్తుందా.
గజ్జెల రామకృష్ణ
89774 12795