కందిపూత రంగు
ABN , First Publish Date - 2023-08-14T00:26:13+05:30 IST
పువ్వులా వికసించి సీతాకోకలా ఎగిరిపోయే రంగుల్ని వర్షానికి ముందు విసవిస వీస్తున్న పంటపొలంలో విశ్రాంతి తీసుకుంటున్న మునిమాపు గాలిని...
పువ్వులా వికసించి సీతాకోకలా ఎగిరిపోయే రంగుల్ని
వర్షానికి ముందు విసవిస వీస్తున్న
పంటపొలంలో విశ్రాంతి తీసుకుంటున్న మునిమాపు గాలిని
చెట్టుకింద చిటపట కురిసే
కొన్ని చినుకుల సంతోషాన్ని
పొడవై పొట్టై ఏదో ఒకటి మాట్లాడే నీడల్ని
ఎక్కువ అనుభూతి ఉన్న ఈ పల్లె ఎండలో
పోగుబడిన లేత చిగుర్లలా
పల్లె నిలువెల్లా కాస్తున్న నీరెండలో
చాన్నాళ్ళకు చూస్తున్నాను.
ప్రతీది కందిపూత రంగు
నా ముఖం, నా చేతులు, నా హృదయం
నా కలల పచ్చటి పొలాలపై
పరుచుకునే జీవితం రంగు
మొదటి సాయంసంధ్య ముందు చివరి కాంతిముగ్గు.
ఓ లేగాంతి విశ్రాంతిలో అలసిన తర్వాతి ఊరట
ఓ కాంతి సంగమంలో కోరిక వాతావరణం
అంతా ఒక భావోద్వేగ కదలిక
సన్నిహిత నిగారింపులో
గుత్తులు గుత్తులుగా ఆశలు మేల్కొంటాయి.
ఓ జ్ఞాపకం నీళ్ళపై చెరువు కోడిలా పరిగెడుతుంది.
మైదానం మీదుగా, గాలియుతంగా
పొడవైన కొంగ వీక్షణ
ఓ వింజామర క్షణాన్ని కలగంటుంది
ఇంకా చుట్టూ గడ్డిపూల గుసగుస
అక్కడొక నెమలికన్ను పిట్ట తడిని విదిలిస్తూ
దృశ్యాన్ని పంచుకోడానికి శిథిలాలు కూడా మెరుస్తూ
ప్రతి దృశ్యం ఒక తిరునాళ
రోజులోనే జీవించేటప్పటి అందం.
ఇక్కడ సృజనాత్మక ఏకాంతం ఉంది
ఎవరిదో అపరిచిత స్వరం కవితలు వినిపిస్తుంది
నాట్లువేసే పల్లెపాట గాల్లో తేలుతూ వస్తుంది
గుబురు నుంచి గుబురుకు ఎలుగెత్తిన అదే గోరింక గొంతు
సాయంకాలం జారిపోతున్నపుడు
ఆకాశాన్ని ద్విగుణీకృతం చేసే పక్షుల గుంపు నాకు చిలిపి కోరిక
సీతాకోకలు వలయాలు వలయాలుగా రంగుల ఆశ్చర్యం
అన్ని రూపాలు ప్రాకృతిక సంస్కృతి సంతరించుకున్నాయి
నా సంతోషం వయస్సు వీటితో గడిపిన సమయం కూడా
ఈ సమయంలోనే...
నా విశాల ప్రపంచం చిన్నగూట్లోకి రావాలనుకుంటుంది ఇష్టంగా.
ఒక అమాయకపు ఉదయం
ఒక అందమైన సాయంత్రం మధ్య
రోజు చివరి పక్షిలా ఎగురుతోంది.
శాంతయోగి యోగానంద
91107 70545