కాంగ్రెస్ పేదలు, కమలం ధనికులు
ABN , First Publish Date - 2023-04-28T02:56:56+05:30 IST
వర్గవిశ్లేషణపై సమగ్ర దృష్టి పెట్టాలని నా మార్క్సిస్టు మిత్రులకు నచ్చ చెప్పేందుకు ఒక వ్యాసం రాయాలని అభిలషిస్తున్నాను!
వర్గవిశ్లేషణపై సమగ్ర దృష్టి పెట్టాలని నా మార్క్సిస్టు మిత్రులకు నచ్చ చెప్పేందుకు ఒక వ్యాసం రాయాలని అభిలషిస్తున్నాను! నా వామపక్ష మిత్రులు, మాజీ లెఫ్టిస్టు స్నేహితులతో నేను తరచు ఇలా పిచ్చా పాటీ చేస్తుంటాను. అయితే దీని వెనుక ఒక లోతైన సత్యమున్నది. రాజకీయ విశ్లేషకుల వైఖరులు చిత్ర విచిత్రంగా ఉండడం కద్దు. ఒకప్పుడు మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రభావంతో ప్రతీ చోట, ప్రతీ వ్యవహారంలోనూ వారు వర్గ పోరాటాన్ని చూస్తుండేవారు. ఇప్పుడో? కులం. కులమే సర్వ నిర్ణాయకం మరి. ఒక అపరాధ భావనను ఈ మాటలు కప్పిపుచ్చుతున్నాయి కూడా. పైన ప్రస్తావించిన విధంగా మేధో విశ్లేషణలు దిగజారిపోవడంలో నేనూ, నా లాంటి రాజకీయ విశ్లేషకులు కూడా కారకులే. ఏమిటి మా పాపం? కులం, ఓటింగ్ తీరుతెన్నులపై సేకరించిన సమాచారం, దాని విశ్లేషణలను ప్రప్రథమంగా టెలివిజన్‌లో నివేదించడమే.
కర్ణాటక శాసనసభ ఎన్నికలు అలనాటి నా పిచ్చాపాటీలను గుర్తుకుతెస్తున్నాయి. నేను రాయాలని అభిలషించిన, రాయని వ్యాసంలో చెప్పదలచిన విషయాలను చెప్పేందుకు ఇప్పుడు నాకొక అవకాశం లభించింది. ఏమిటి నేను చెప్పదలిచింది? వర్గం ముఖ్యం. చాలా ముఖ్యం. దాని ప్రభావాన్ని గుర్తించడానికి లేదా అంగీకరించేందుకు మనం చూపుతున్న సుముఖత కంటే అది చాలా కీలకమైనది. కన్నడ భాషలో ప్రత్యామ్నాయ, ప్రజల మీడియాను సృష్టించేందుకు నిబద్ధులైన ‘ఈ దిన’ (Eedina) అనే మీడియా క్రియాశీలుర బృందంతో నేను ఇటీవల సమావేశమయ్యాను. వారితో జరిపిన చర్చలలో ఎన్నికల వ్యవహారాలలో వర్గం ప్రాధాన్యమేమిటో నాకు స్పష్టంగా తెలిసివచ్చింది. ‘ఈ దిన’ సభ్యులు కర్ణాటక వ్యాప్తంగా ఎన్నికల పూర్వ సర్వే నొకదాన్ని నిర్వహించారు. నేనూ స్వయంగా అనేక ఎన్నికల సర్వేలు నిర్వహించిన వాడినే కనుక ఇదేమీ నాకు పెద్దగా ఉత్సాహం కలిగించలేదు. అయితే ‘ఈ దిన’ సర్వేలో నన్ను అమితంగా ఆకట్టుకున్న విషయమేమిటంటే దాని ప్రజా స్వభావం. పెద్ద మొత్తాలను చెల్లించి తెచ్చుకున్న వృత్తి నిపుణులతో కాకుండా తాము స్వయంగా శిక్షణ ఇచ్చిన 1000 మంది పౌర పాత్రికేయులతో ‘ఈ దిన’ ఈ సర్వేను నిర్వహించింది. ఈ స్వచ్ఛంద సేవకులు రాష్ట్రవ్యాప్తంగా 204 నియోజకవర్గాలకు వెళ్లి (మొత్తం నియోజకవర్గాలు 224) 41,169 మంది ఓటర్లతో ముఖాముఖీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. ఈ ఎంపిక కర్ణాటక జనసంఖ్యా సంబంధి చిత్రాన్ని చక్కగా ప్రతిబింబించిందని చెప్పి తీరాలి. సహేతుకమైన కారణాలతోనే నేను ‘ఈ దిన’ సర్వే ఫలితాలను విశ్వసిస్తున్నాను.
తొట్ట తొలుత చెప్పవలసిన విషయమేమిటంటే కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయమని ‘ఈ దిన’ సర్వే స్పష్టం చేసింది. 224 సీట్లు గల కర్ణాటక శాసనసభలో 132 నుంచి 140 స్థానాల దాకా కాంగ్రెస్‌కు దక్కుతాయని ‘ఈ దిన’ పేర్కొంది. నిజంగా ఇన్ని స్థానాలను గెలుచుకోవడం జరిగితే గత మూడు దశాబ్దాలలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇన్ని అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ఇదే మొదటి సారి అవుతుంది. పాలక భారతీయ జనతా పార్టీ సంఖ్యా బలం 57 నుంచి 65 స్థానాలకు పరిమితమవుతుంది. ఇక ‘కింగ్ మేకర్’ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ 19 నుంచి 25 స్థానాలను మాత్రమే గెలుచుకోగలుగుతుంది. సాధించుకోగల ఓట్లలో 10 శాతం తేడా ఆధారంగా ‘ఈ దిన’ ఈ అంచనాకు వచ్చింది. కాంగ్రెస్‌కు 43 శాతం (2018లో కంటే ఐదు శాతం అధికం), బీజేపీకి 33 శాతం (గతంలో కంటే మూడు శాతం తగ్గుదల), జేడీ(ఎస్)కు 16 శాతం (రెండు శాతం తగ్గుదల) ఓట్లు రావచ్చని అంచనా.
ఈ అంచనాలను విశ్వసించకపోవడానికి కారణాలేమీ నాకు కన్పించడం లేదు. ‘ఈ దిన’ సర్వేలో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం ఓటర్ల ఆర్థిక నేపథ్యం గురించిన ప్రశ్నలు. ఓటింగ్ తీరుతెన్నులు, వర్గ నేపథ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకునేందుకు ఈ ప్రశ్నలు విశేషంగా తోడ్పడుతాయి. దురదృష్టవశాత్తు పోల్ సర్వే నిర్వాహకులు అనేక మంది అసలు ఓటర్ల వర్గ నేపథ్యాన్ని కనీసం నమోదు చేయడాన్నే నిలిపివేశారు (సిఎస్‌డిఎస్–లోక్‌నీతి బృందమే ఇందుకొక మినహాయింపు). ఓటింగ్ తీరుతెన్నులను ఓటర్ల ఆర్థిక వర్గ నేపథ్యం ప్రభావితం చేస్తుందా అన్న ప్రశ్న వేసేందుకు ‘ఈ దిన’ సర్వే దోహదం చేసింది. అవును అనేదే ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వివిధ వృత్తి నేపథ్యాలు ఉన్న వారి ఓటింగ్ తీరుతెన్నులలో ఒక స్పష్టమైన సరళి కన్పిస్తుంది వృత్తిగత వివరాలతో పాటు కుటుంబ ఆస్తుల (వాహనాలు, ఫ్రిజ్, స్మార్ట్ ఫోన్లు మొదలైనవి)ను కూడా కలుపుకుని ఉన్నత తరగతి నుంచి నిరుపేద స్థాయి దాకా వర్గ నేపథ్యంపై ఒక అంచనాకు వచ్చాను. ఆర్థిక అంతస్తులో కింది స్థాయికి వెళ్లే కొద్దీ కాంగ్రెస్ పట్ల మొగ్గు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు పూర్తిగా విరుద్ధమైనది బీజేపీ పరిస్థితి. ఓటరు ఎంత స్థితిమంతుడైతే అంతగా బీజేపీ వైపు మొగ్గుతున్న వైనం కనిపించింది. జనతాదళ్ (ఎస్) విషయంలో కూడా ఇదే తీరు వెల్లడయింది. ఉన్నత వర్గం వారు రాష్ట్ర జనాభాలో నాలుగు శాతం మంది కాగా వారిలో 29 శాతం మంది కాంగ్రెస్ వైపు, 41 శాతం మంది బీజేపీ వైపు, 20 శాతం మంది జేడీ(ఎస్) వైపు మొగ్గారు. రాష్ట్ర జనాభాలో 10 శాతంగా ఉన్న మధ్య తరగతి వారు కాంగ్రెస్ వైపు 37 శాతం, బీజేపీ వైపు 38 శాతం, జేడీ(ఎస్) వైపు 18 శాతం మొగ్గు చూపారు. కింది స్థాయి నాలుగు శాతం మధ్య తరగతి ఓటర్లు రాష్ట్ర జనాభాలో 26 శాతం దాకా ఉన్నారు. వీరిలో 39 శాతం కాంగ్రెస్ వైపు, 36 శాతం బీజేపీ వైపు, 18 శాతం జనతాదళ్(ఎస్) వైపు మొగ్గారు. పేదలు రాష్ట్ర జనాభాలో 37 శాతంగా ఉండగా వారిలో 46 శాతం కాంగ్రెస్‌కు, 32 శాతం బీజేపీకి, 15 శాతం జేడీ(ఎస్)కు అనుకూలంగా ఉన్నారు. 23 శాతంగా ఉన్న నిరుపేదల్లో 48 శాతం మంది కాంగ్రెస్ వైపు, 28 శాతం మంది బీజేపీ వైపు, 15 శాతం మంది జేడీ(ఎస్) వైపు మొగ్గు చూపారు.
కాంగ్రెస్, బీజేపీ ఓట్ల బలాన్ని లైన్‌గ్రాఫ్‌లో చూడండి. వర్గం ప్రాతిపదిక ఓటింగ్‌కు ఇది పరిపూర్ణ ఉదాహరణగా నిలుస్తుంది. ఉన్నత వర్గాలలో కాంగ్రెస్‌పై బీజేపీకి 13 పాయింట్ల ఆధిక్యత ఉన్నది. మధ్య తరగతికి వచ్చేటప్పటికి అది ఒక పాయింట్‌కు తగ్గిపోయింది. కింది స్థాయి మధ్యతరగతిలో కాంగ్రెస్‌కు మూడు పాయింట్ల ఆధిక్యత ఉన్నది. పేదలలో 14 పాయింట్లు, నిరుపేదలలో 20 పాయింట్ల ఆధిక్యత కాంగ్రెస్‌కు లభించింది. కాంగ్రెస్ వైపు నిర్ణయాత్మక మొగ్గుకు ఆయా వర్గాల సాపేక్ష పరిమాణమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. పై స్థాయి మూడు వర్గాల వారు రాష్ట్ర జనాభాలో 40 శాతంగా ఉన్నారు ఈ వర్గాల మద్దతు బీజేపీకే ఉన్నందున ఆ పార్టీ కాంగ్రెస్‌ను అధిగమించవచ్చు లేదా సమానస్థాయిలో ఉండవచ్చు. ఇక పేదలు, నిరుపేదలు రాష్ట్ర జనాభాలో 60 శాతంగా ఉన్నందున వారి ఓట్లలో అత్యధికం కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఎంతైనా ఉంది.
మరి కులం పాత్ర ఏమిటి? అవును, ఓటింగ్ తీరుతెన్నులపై కులం ప్రభావం అమితంగా ఉన్నది. నిజానికి ఓటర్లు చాలావరకు కులం ప్రభావంతోనే ఎవరికి ఓటు వేయాలనే విషయమై ముందుగా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఈ దృష్ట్యా అగ్రకులాలలో 58 శాతం మంది మద్దతును బీజేపీ పొందుతుండగా, కాంగ్రెస్ వైపు 28 శాతం మందే మొగ్గు చూపుతున్నారు. లింగాయతులలో 53 శాతం మంది బీజేపీ వైపే ఉన్నారు. వొక్కళిగలలో 38 శాతం మంది జనతాదళ్ (ఎస్)కు ప్రాధాన్యమిస్తున్నారు. కింది స్థాయి కులాలలో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, కురుబలలో 50శాతానికి పైగా, ముస్లింలలో 70 శాతానికి పైగా కాంగ్రెస్ వైపే ఉన్నారు.
కులాధారిత ఓటు బ్యాంకుల వాదనను అంగీకరించే ముందు మూడు వాస్తవాలను మీరు పరిగణనలోకి తీసుకోవాలి. అవి: ఒకటి– ఒక రాజకీయ పార్టీకి కుల పరమైన మద్దతు తరచు విశ్వసిస్తున్నట్టుగా అధిక స్థాయిలో లేదు; రెండు– ఓటర్లు తొలుత కుల ప్రభావంతో ఒక రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపవచ్చు. అయితే ఆ తరువాత లేదా తదుపరి ఎన్నికలలో తమ మనస్సును మార్చుకునేందుకు అవకాశమున్నది. ఇలా ఎందుకు జరిగిందన్న దాన్ని పూర్వానుకూలత వివరించదు. ఉదాహరణకు ప్రతీ కులంలోనూ ఈసారి కాంగ్రెస్ మద్దతుదారుల సంఖ్య పెరిగింది. ఈ పెరుగుదలకు కుల పరమైన కారణాలను చెప్పలేము; మూడు– ప్రతీ కులంలోనూ వర్గం ప్రభావం పనిచేస్తుంది. ప్రతీ కులంలోని పేదలు, సంపన్నులు తమ తమ ఆర్థిక వర్గం ప్రభావంతో ఓటు వేయడం పరిపాటిగా ఉన్నది.
కర్ణాటక శాసనసభ ఎన్నికలను, మీరు విన్న లేదా చదివిన మరే అంశం కంటే ధనిక–పేద అంతరాలే అధికంగా ప్రభావితం చేయనున్నాయని స్పష్టంగా చెప్పవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్ల కోటాను రద్దు చేయడం, ఎస్సీ రిజర్వేషన్ల విభజన, బీజేపీ పై లింగాయతుల ఆగ్రహం మొదలైన విషయాలపై మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నప్పటికీ అవేవీ ఓటింగ్ తీరుతెన్నులను అంతగా ప్రభావితం చేయలేవు. మరి పేదలు, నిరుపేదలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు హామీలు (ప్రతీ గృహిణికి గౌరవ భత్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పది కిలోల ఉచిత బియ్యం, విద్యావంతులైన యువతకు నిరుద్యోగ భృతి) ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ హామీలు ఓటింగ్ తీరుతెన్నులను ప్రభావితం చేయనుండడమూ విస్మయం కలిగించే విషయం కాదు. రాజకీయవేత్తలు, రాజకీయ విశ్లేషకులు మత విభేదాలు, కులపరమైన చీలికలపై దృష్టి పెడుతున్నారు. అయితే భారతీయ ఓటర్లలో వర్గపరమైన విభజన ఒకటి మౌనంగా చోటుచేసుకుంటోంది. వర్గ ప్రభావిత ఓటర్లు ప్రభవిస్తున్నారు. వర్గ విభజనలను మరింత క్రియాశీలం చేసే రాజకీయ శక్తులే భావి భారత రాజకీయాలను నిర్దేశించగలుగుతాయి.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)