Ketu Viswanatha Reddy: భాషాబోధనలో నిశ్శబ్ద విప్లవకారుడు

ABN , First Publish Date - 2023-05-28T02:01:53+05:30 IST

ఏడు విద్యావ్యాసంగాలకే అంకితమైన విద్యాత్మక జీవి, సృజనశీలి, విమర్శక శేఖరులు, ఉత్తమ అధ్యాపకులు కేతు విశ్వనాథరెడ్డి. తెలుగు వచనానికి, తెలుగు భాషాబోధనకు సంబంధించిన ఒక మహోద్యమానికి, నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.

Ketu Viswanatha Reddy: భాషాబోధనలో నిశ్శబ్ద విప్లవకారుడు

ఏడు విద్యావ్యాసంగాలకే అంకితమైన విద్యాత్మక జీవి, సృజనశీలి, విమర్శక శేఖరులు, ఉత్తమ అధ్యాపకులు కేతు విశ్వనాథరెడ్డి. తెలుగు వచనానికి, తెలుగు భాషాబోధనకు సంబంధించిన ఒక మహోద్యమానికి, నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. సాహిత్య పరిశోధనలో సామాజిక శాస్త్రాల సహాయం తప్పనిసరి అని ప్రతిపాదించిన విశ్వనాథరెడ్డి సాహిత్య రచనలో వ్యక్తమయ్యే సామాజికాంశాలే ఏ సమాజ శాస్త్ర సహాయం తీసుకోవాలో నిర్ణయిస్తాయని భావించారు.

పదులు దాటిన జీవితంలో, అయిదు పదులు పైగా ఉన్న సుసంపన్నమైన సాహిత్య వ్యక్తిత్వంగల ప్రభావశీలమైన గురువు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి. ఎందరో రచయితల్ని, పరిశోధకుల్ని, సాహిత్య సంస్థలను తన సలహాలతో, సూచనలతో ప్రోత్సహించి నిరంతర సాహిత్య వాతావరణాన్ని ఆవిష్కరించిన, అరుదైన బిరుదైన అధ్యాపకులు కేతు విశ్వనాథరెడ్డి.

జాతీయ భావాలకు, వామపక్ష రాజకీయాలకు నిలయంగా భాసించే కడప జిల్లాలో విద్యార్థిగా ఉన్నప్పటినుండే ఏ.ఐ.ఎస్‌.ఎఫ్‌. కార్యకర్తగా విశ్వనాథరెడ్డి వామపక్ష భావజాలంతో ప్రభావితుడయినాడు. అతివాదుల్లో మితవాదిగా, మితవాదుల్లో అతివాదిగా తన విద్యార్థి జీవితాన్ని ముగించారు. చిత్తూరు జిల్లా రచయితల సంఘస్థాపనలో విశ్వనాథరెడ్డిది ప్రముఖ పాత్ర. 1973లో కడప అరసం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పటి నుండి ఆయన తన దృష్టిని, కృషిని సాహిత్యానికి అంకితం చేశారు. అరసం అధ్యక్ష పదవీబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి నాయకత్వ ప్రతిభను చూపించారు. వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో విశ్వనాథరెడ్డి చేసే విశ్లేషణ, వాద ప్రతివాదాలు, విషయ ప్రతిపాదనలో పాటించే నిగ్రహం, స్పష్టత ఆయనను ప్రతిభావంతునిగా నిలబెట్టాయి. నిష్పక్షపాతంగా ఉంటూనే అభిప్రాయాల దగ్గర తన నిబద్ధతను ప్రకటించటం విశ్వనాథరెడ్డి విశిష్టత. కేతు విశ్వనాథరెడ్డి ఒక చేతిలో కథల కలం, మరొక చేతిలో పరిశోధన భూతద్దం ఉన్నాయని కొండముది శ్రీరామచంద్రమూర్తి చమత్కరించినా అది నిజం. కేతు విశ్వనాథరెడ్డి రచనల్లో వస్తువుకు, శిల్పానికి మధ్య సామరస్యంకోసం చేసే ప్రయత్నం ఉంటుంది. కడప జిల్లా గ్రామనామాలను భూతద్దంలో పరిశోధించారాయన. 3403 ఊర్లపేర్ల అర్థాలను భాషాశాస్త్రం దృష్ట్యా పరిశోధించటం గొప్పవిషయం. ఆయన ఎక్కడ ఉద్యోగించినా మనసు మాత్రం కడప జిల్లా ఊషరక్షేత్రాల మధ్యే తిరుగుతూ ఉంటుందనటానికి ఆయన రాసిన కథలే సాక్ష్యం.

అకడమిక్‌ డైరెక్టర్‌ అయినా, అరసం అధ్యక్షుడయినా, వాదాలూ, తాత్త్విక చింతనలూ ఏవైనా జీవితం పట్ల, సమాజం పట్ల ప్రేమ-నిబద్ధత గల రచయిత ఆయన. నమ్ముకున్న నేల, గడ్డి, పీర్లసావిడి, విశ్వరూపం, చీకటినాడే వెలుగు నెత్తురు, అనధికారం, ఖడ్గాలూ కాటక పిట్టలు వంటి కథలు అందుకు నిదర్శనం. దళితస్త్రీ వాదాలు రాకముందే ఆ సమస్యల్ని చిత్రించే కథలు రాశారు. ఆఖరుకు బాలవాదం (పిల్లల సమస్యలు) కూడా అవసరమంటూ రచనలు చేశారు. కథా రచయితగా చేసిన సేవకంటే కూడా కొడవటిగంటి కుటుంబరావు సమగ్ర సాహిత్య సంకలనం తెలుగుజాతిని విశ్వనాథరెడ్డికి ఋణపడి ఉండేలా చేసింది. మధ్యతరగతి మందహాసాల్ని చెబుతూ పాఠకుల ఆలోచనకు పదునుపెట్టి, మనో లోచనాలను తెరిపించే కొడవటిగంటి రచనలను వెదకి, వెదకి సేకరించి, అప్పటి విశాలాంధ్ర రాజేశ్వరరావు తోడ్పాటుతో పాఠకులకు పదమూడు సంపుటాలుగా అందించిన సాహిత్య భగీరథులు విశ్వనాథరెడ్డి. వాస్తవికతా వాదమంటే కేవలం యాంత్రిక, భౌతికవాదం కాదని, అది భౌతిక, మానసిక శక్తుల ఘర్షణల ఆవిష్కరణమని, మనిషి మరింత సుఖంగా, సంస్కారవంతంగా, నాగరికంగా బతకటానికి చేసే నిరంతర ప్రయత్నమని కేతు విశ్వనాథరెడ్డి నిశ్చితాభిప్రాయం. ఈ చర్చలకంటే కొ.కు. సాహిత్యాన్ని చదవటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని బల్లగుద్ది మరీ చెబుతారు.

తెలుగు వచనానికి, తెలుగు భాషాబోధనకు సంబంధించిన ఒక మహోద్యమానికి, నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టిన ఘనత విశ్వనాథరెడ్డికి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఏ. డిగ్రీ, మౌలికాంశాల కోర్సుకు సంబంధించిన పాఠాల తయారీలో చేకూరి రామారావుకి తోడుగా నిలిచిన వ్యక్తి విశ్వనాథరెడ్డి. సాహిత్య బోధనలోనూ, భాషాబోధనలోను అనుసరించవలసిన శాస్త్రీయ పద్ధతులను ఆ కోర్స్‌ పుస్తకాలలో చెప్పారు. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి.ఏ. కోర్సు పుస్తకాల తయారీలో కూడా విశ్వనాథరెడ్డి భాగస్వామి. ప్రసారసాధనాల కోసం రాయటం అనే అయిదు సంపుటాల పాఠ్యగ్రంథం ఎంతో విలువైనది. ప్రసార సాధనాల్లో ఉపయోగించే భాష గురించి ఇందులో విస్తృతంగా చర్చించారు. సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో సరికొత్త పాఠ్యాంశాలు ప్రవేశపెట్టిన ఘనత, ఖ్యాతి ఆయనదే. సాహిత్య పరిశోధనలో సామాజిక శాస్త్రాల సహాయం తప్పనిసరి అని విశ్వనాథరెడ్డి ‘దృష్టి’ అనే విమర్శ గ్రంథంలో ప్రతిపాదించారు. సాహిత్య రచనలో వ్యక్తమయ్యే సామాజికాంశాలే ఏ సమాజ శాస్త్ర సహాయం తీసుకోవాలో నిర్ణయిస్తాయని ఆయన భావించారు. జానపద సాహిత్యం నుండి భారతకాలానికి, భారతకాలం నుండి ఈనాటి సాహిత్యానికి మధ్య వచ్చిన సామాజిక మార్పును అర్థంచేసుకోవాలంటే సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని చూడకతప్పదని చెప్తారు. ‘తెలుగు సాహిత్యంలో మార్క్సిజం ప్రభావం’ అనే వ్యాసంలో మార్క్సిజమే తెలుగు సాహిత్యాన్ని అంతకుముందున్న భావజాలాలకంటే ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చిందని విశ్లేషించారు. తెలుగు సాహిత్య చరిత్రలో యుగవిభజన గురించి ప్రస్తావిస్తూ లిఖిత సాహిత్యచరిత్రగా మాత్రమే చూడటాన్ని అంగీకరించకుండా క్రీ.పూ. 1000 సం. నుండి క్రీ.పూ. 600 సం. దాకా వ్యావసాయక పూర్వయుగమని, అప్పటినుండి క్రీ.శ. 1800 దాకా వ్యవసాయిక యుగమని ఆ తరువాతది పారిశ్రామిక యుగమని విభజించారు. మళ్లీ అందులో ఉపదశలు, ప్రాంతీయ భేదాలు, ధోరణులు ఉంటాయని వీటన్నింటి అవిచ్ఛిన్నతా చరిత్రయే తెలుగు సాహిత్యంగా నిర్ధారించారు. ‘తెలుగు కథానిక దశాబ్ది ధోరణులు’ అనే వ్యాసంలో గురజాడ నుండి ఉన్న తెలుగు కథా రచయితలందరినీ ఆరుతరాలుగా విశ్వనాథరెడ్డి పరిశీలించారు. కొ.కు. రావిశాస్త్రి, కా.రా. ఒకే భావజాలానికి చెందిన రచయితలు. ఒకే భావజాలానికి సంబంధించిన రచయితలు, విమర్శకులూ ఉన్నప్పుడు ఆ విమర్శ ఎలా ఉంటుందో విశ్వనాథరెడ్డి రాసిన వ్యాసాలే నిదర్శనం. కథా రచయిత తన జీవితావగాహనను పాఠకునికి అందించాలంటే శిల్పమనేది తెలియాలని విశ్వనాథరెడ్డి భావన. కథారూపం అనే వ్యాసంలో తెలుగు కథకుల శిల్ప విన్యాసాన్ని ఆయన విశ్లేషించారు. ఇలా నిరంతరం విద్యావ్యాసంగాలకే అంకితమైన విద్యాత్మక జీవి, సృజనశీలి, విమర్శక శేఖరులు, ఉత్తమ అధ్యాపకులు కేతు విశ్వనాథరెడ్డి. ఎనిమిది పదులు దాటిన వయసులోనూ సాహిత్య జీవనాన్నే కొనసాగించి కనుమూసిన కేతు విశ్వనాథరెడ్డి భావితరాలకు ఆదర్శప్రాయులు.

-ఆచార్య బూదాటి వేంకటేశ్వర్లు

బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం

Updated Date - 2023-05-28T02:01:53+05:30 IST