సైన్స్‌తో కవిత్వం పలికించిన కొత్తపల్లి
ABN , First Publish Date - 2023-08-14T00:41:29+05:30 IST
ఆధునిక కవిత్వ విశాల ఆకాశంలో స్వయం ప్రకాశక ప్రతిభా సౌందర్యాలుగా 1974లో వెలుతురు పిట్టల్ని విహరింపజేసిన రాజమహేంద్రవరపు కవి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ. విశిష్ట అభివ్యక్తితో, లోతైన భావుకతతో, సౌందర్యారాధనాదృష్టితో, నూతన భావ పుష్కలత్వంతో....
ఆధునిక కవిత్వ విశాల ఆకాశంలో స్వయం ప్రకాశక ప్రతిభా సౌందర్యాలుగా 1974లో వెలుతురు పిట్టల్ని విహరింపజేసిన రాజమహేంద్రవరపు కవి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ. విశిష్ట అభివ్యక్తితో, లోతైన భావుకతతో, సౌందర్యారాధనాదృష్టితో, నూతన భావ పుష్కలత్వంతో, అచుంబిత పదచిత్రాలతో ఆయన రాసిన వెలుతురు పిట్టల కవితలు సంపూర్ణ సుగుణభరిత వచన కవితలై వచన కవిత్వం రాసేవారికి గురుత్వ మార్గాలు చూపాయి. ‘వెలుతురు పిట్టలు’ కవిత్వ సంపుటిలోని ‘మళ్ళీ పూలు పూయాలి’ అనే కవితలో: ‘‘నేర్చుకున్న పలుకులు/ కొంచెం మార్పుతో/ వప్పజెప్పే చిలుక కన్నా/ తనదైన పాట పాడే/ సర్వస్వతంత్రగళం గల/ కోకిల/ నాకెంతో ఇష్టం/ ఎంగిలి మెతుకులు తిని గోలపెట్టే కాకులంటే నాకు పరమ అసహ్యం,’’ అని తన కవితాశయ గుణాన్ని ప్రవచించారు.
వచన కవితకు కేంద్రీకృత భావనా నిబద్ధంగా పదాలూ వాక్యాలూ నిలబడాలనేది ఆయన తపన. Self editingకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. ‘వెలుతురు పిట్టలు’లో ఆయన సౌందర్యాస్వాదనను కవిత్వాభిమాని గుండెలకు హత్తుకుని తీరవలసినదే. ‘‘మృగాలు సంచరిస్తాయి/ నెత్తుటి డాగులు పడిన అడవి/ జేవురిస్తుంది... రెప్పల మీద చీకటి కురుస్తుంది/ జాగరణ చేసిన ఆకాశం కళ్ళు కెంపెక్కుతాయి.../ చూరులు కన్నీళ్ళు కారుస్తాయి/ కలవరంతో చెరువు/ ఎర్రబడుతుంది.../ కుంకుడు పులుసు పడి ఏడ్చే/ పసిపాప ఎర్ర జీరల నేత్రాల్లో/ తల్లి పిండిన చనుబాలులా/ చిమ్మిన వేకువ/ శాంతపరచిన అడవిపై/ అందమైన పిట్టలు ఎగురుతాయి/...సగం అరగదీసిన ఇండుపకాయలా/ సూర్యుడు పైకొస్తే/ ఆకాశం తేరుకుంటుంది/... పటిక ముక్కల్లాంటి/ మంచుబిందువుల శీతాకాలంలో/ చెరువు తేటబడుతుంది/... అప్పుడే/ ...అడవి, ఆకాశం, చెరువు/ ఒకదాని సౌందర్యం ఒకటి/ ఆస్వాదిస్తాయి,’’ అంటారు ఒక కవితలో.
‘వెలుతురు పిట్టలు’ కవిత్వ సంపుటి బయటకు రాగానే శేషేంద్రశర్మ, ఆరుద్ర, వేగుంట, సినారె వంటి హేమాహేమీ కవులు ఎందరో అందులో ఎన్నిటినో పట్టుకుని సంభ్రమాశ్చర్యానందాలు పొందారు; ఆయనను కేవల కవిత్వాభిమానంతో అక్కునజేర్చుకున్నారు, అభినందించారు. ఊహాశాలీనత గల కళాఖండాలు ఆయన కవితలు. చదివింది ఇంజనీరింగ్. చేసింది విద్యుత్తుశాఖలో ఉన్నతోద్యోగం. తాను ఆజానుబాహుడుగా ఉండి, ‘‘ఆజానుబాహుల్లారా! ఓజోను పొరను రక్షించండి’’ అని భూ మానవ కల్యాణాన్ని వాంఛించిన కవి. సినారె ఆయన్ని పిట్టకవి అని, ఇస్మాయిల్‌ను చెట్టుకవి అని అనేవారు. మల్లంపల్లి శరభయ్య మాస్టారి వంటి కవిత్వ ప్రామాణికుడు శ్రీమన్నారాయణను శ్రీకృష్ణదేవరాయల వంటి ఇమేజిస్టు పొయెట్ అన్నారంటే సామాన్యమా! ఆయన ప్రతి కవితా సంపుటి ఒక ప్రత్యేక గ్రంథం రాయదగిన బహుళార్థక గుణాలున్నదే. 2006లో ‘స్వస్థాన మిత్రుడు’, 2007లో ‘వామనవిశ్వం’ ఆయన తదుపరి కవితా సంపుటులు.
విశాఖపట్నంలో ఆయన ఉద్యోగించిన కాలంలో ‘నిరసన కవులు’ ఏర్పడ్డారు. నిరసన కవిత్వం రాశారు. వారు అత్తలూరి, అబ్బూరి గోపాలకృష్ణ, భైరవయ్య, కొత్తపల్లి. వారు తమను ‘అద్వయంభైకొ’ కవులుగా అనుకున్నారు. నిరసన కవిత్వాన్ని శ్రీశ్రీ చూసి ‘నిరసనాయిలు’ అన్నారు. సామాజిక దౌష్ట్యాలను నిరసించడంలోనూ కొత్తపల్లి పాత్ర వహించారు.
కొత్తపల్లి శ్రీమన్నారాయణ 1995లో రాసిన ‘అక్షరంలో అంతరిక్షం’ కేవలం ఆయన సైన్సు కవితల సమాహారం. తెలుగులో వైజ్ఞానిక గ్రంథాలు వచనంలో రాసినవారున్నారు. శాస్త్రాన్ని శాస్త్రంగా, కనిపెట్టిన సైన్సు వస్తువులను సైన్సువస్తువులుగా రాసినవారూ వున్నారు. కానీ ‘అక్షరంలో అంతరిక్షం’ కవిత్వ సంపుటిలో కొత్తపల్లి అనుభూతిప్రదంగా, నూతన పదచిత్రాలతో, వినూతన అభివ్యక్తితో ఇరవై రెండు సైన్సు కవితలు రాశారు. సైన్సు ప్రయోగశీలమైనది, సత్యదృష్టికలదీనూ. కవిత్వం అనుభూతి ప్రదమూ, రసవంతమూ, అర్థవంతమూ. వీటన్నిటినీ మేళవించడంలో శ్రీమన్నారాయణ గారి నేర్పుకూర్పులున్నాయి.
ఒకచోట ‘‘కన్నీటి సిమెంట్ మిశ్రమాల/ కఠిన పట్టణంలో/ యంత్ర మూత్రం తడిరోడ్డున పడి విరిగిన ఆయిల్ హరివిల్లులు’’ అన్నారు. అదుపు తప్పిన స్పుత్నిక్ శాటిలైట్ ఎక్కడికో వెళ్ళిపోయిందనడానికి, ‘‘మనిషి ప్రమేయం లేని-/ మనిషి ప్రయోజనం మించి-/ ఏ మానవాతీత ఫలితాల్ని ఎంచుకుందోగాని/ చంద్రగ్రహం చుట్టూ శాశ్వత/ చంక్రమణాల్లో/ ఒక సమాధి గతికి వెళ్ళిపోయింది’’ అంటూ ‘స్పుత్నిక్‌పై ఎలిజీ’ కవితలో ఆ శాటిలైట్‌పై మనకు జాలి పుట్టిస్తారు.
విద్యుత్కేంద్రం గురించి ‘భవపరిమళం’ కవితలో, ‘‘అర్ధరాత్రి అంధకార చక్రం మధ్య/ దీపాల దీవిలా/ శాంతంగా/ అమోఘభద్రంగా/ అది విద్యుత్కేంద్రం!.../ తన ప్రాణ ధమనులన్నీ/ ధరణీతలమంతా పరచే/ నిత్యాధునిక కవిహృదయం’’ అంటారు. ఈ అత్యాధునిక కవి ఉపమానాలు అనుపమానంగా ఉంటాయి.
సమసమాజ నిర్మాణానికి విజ్ఞాన శాస్త్రం చేస్తూన్న దోహదం అంతా ఇంతా కాదు. పదార్థ జ్ఞానం పొందడం సర్వులకూ సాధ్యమయినదేనని అంటూ, ‘‘సమానం ఇక జ్ఞాన నైవేద్యం’’ అని ముగింపు బిగింపు ఇచ్చే కవిత ‘సకల జనాంకితం’. అందులో, ‘‘ఏమంటోంది సైన్సు యుగం?/ ఏ దేశం? ఏ భాష? ఏ వర్ణం?/ ఏదైతేనేమిటి?/ దూరదర్శనం దూరశ్రవణం/ విమానయానం నవీనవైద్యం/ ఎవరికైనా ఒక్కటే/ ఎక్కడైనా ఒక్కటే!’’ అంటూ, ‘‘ఏ మతం? ఏ దైవం? ఏ విశ్వాసం?/ ప్రశ్నవిరోధి ఏమంటే ఏమిటి?/ పార్థసారథి లేకున్నా/ రోదసినౌకలో చంద్రయాత్ర/ ఎవరికైనా ఒక్కటే’’ అంటూ, విజ్ఞాన మార్గ సమత్వ దృష్టిని నిర్ద్వంద్వంగా కవితలో నిక్షేపిస్తారు; ఆత్మను ప్రతిబింబిస్తారు.
కవిత్వం జడ పదార్థాల్ని చైతన్య పదార్థాలుగా చూడగలదు, చేయగలదు, పలికించగలదు. ‘రోబో’ కవితలో- ‘‘ఆలోచిస్తున్నాను కనుక/ నేనున్నాను అనడం/ నేడు సరిపోదు నేస్తం.../ అనుభూతి, సృజనేచ్ఛానుభూతి/ కలుగుతోంది కనుక/ నేను జీవిస్తున్నట్టే- అనాలి నేడు’’ అంటారు. ఎందుకంటే- ‘రోబో’ యంత్రం అనుభూతి లేకుండా ఆలోచిస్తోంది, అవలోకిస్తోంది వింటోంది- మరి దానికీ మనకీ ఉన్న తేడా గమనించాలి అనే భావన వ్యక్తీకరిస్తారు.
‘రాగి నరాల విరాగి’ అయిన ‘ఏకాకి’ రోబో ‘‘మూక విశ్వ సంకేతాలకు/ ముడులు విడి స్పందించాలని-/ నవ్వులూ కన్నీళ్ళూ కలబోసి/ ప్రాణోత్సవంలో గళం విప్పాలని/ దానికి లోలోపల మౌనరసోజ్వాల’’ వుంటుందనే కవి భావన మానవ జీవనావరణ మాధుర్యాన్ని తలబోసే!
ఆర్కియాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు... ఏ అంశంపై ఎవరు కొత్తపల్లితో చర్చించినా చివరకు ఆయన ఆ చర్చను కవిత్వంలో పర్యవసింపజేసే కవిత్వ ప్రేమికుడు. ఒక సందర్భాన రాజమండ్రిలో సైన్సు-కవిత్వం అనే అంశంపై ఓ రాత్రి జీరో అవర్ వచ్చేదాకా కొత్తపల్లి - ఆచార్య జయదీర్ తిరుమలరావు సుదీర్ఘ చర్చ చేశారు. అప్పుడు తిరుమలరావుగారు, ‘‘సైన్సు ఆవిష్కరణలు జరగడాన్ని ఆహ్వానిస్తాం. నియంతల విషయంలో ప్రజావ్యతిరేక, వినాశకర వ్యాపార అంశాలూ వుండడం వల్ల సైన్సును షరతులు లేకుండా ఆ మత్తులోపడి ప్రేమించడం మంచిది కాదు’’ అనే అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అనుభూతి కవులలో ఒకరుగా పరిగణింపబడినా కొత్తపల్లి ఆలోచనా ధోరణి ఒక ప్రత్యేకత కలిగినదే. ఆ ప్రత్యేకతల్ని స్నేహితునిగా బాగా అధ్యయనం చేసిన కవి సతీష్ చందర్ కొత్తపల్లిపై, ఆయన కవిత్వంపై విశ్లేషణాపూర్వక పుస్తకం వ్రాస్తానని ఉవ్విళ్ళూరిస్తున్నారు, కొన్నేళ్ళుగా. ఆ ఆకాంక్ష ఫలప్రదం కావాలి అని ఆశిద్దాం.
అవిస్మరణీయ కవిత ‘అన్వేషణ’లో- ఎరుక పరిధి పెరిగిన నవీన మానవుడు త్రివిక్రముడైపోయాడు: ‘‘ఇన్నాళ్ళకి ఇన్ని వేలయేళ్ళకి/ నా కన్నుల ముందర/ బంతిలా వసుంధర/ టీవీ కంప్యూటర్ రోబో రాకెట్లు/ నా పనిముట్లు!/ చూడు వ్యాపించే నా రూపం/ ధరణిపై ఒక పాదం/ చంద్రునిపై ఒక పాదం/ చూడు నేడు సూర్యబింబం/ నా మెడలో నవ కౌస్తుభం,’’ అంటాడు ఎంతో ఎదిగిన మానవుని ప్రతినిధిగా ఈ కవి. ‘‘అటుపై ఎటు చూసినా చుక్కల చీకటి/ ఇదిగో... ఇదిగో... ఎవరక్కడ!/ ఎవరక్కడ!... ఓహో... ఎవరక్కడ!/ అంతమేలేని శీతల మహాంధకారంలో/ అక్షయాగ్ని కీలల మధ్య/ ఎక్కడైనా వున్నారా? ప్రాణులెవరైనా వున్నారా,’’ అంటూ పరమకుతూహలాన్ని ప్రకటిస్తాడు. ‘‘పిల్లా పాపల నవ్వులు పొంగే సుందర బంధు గ్రహమేదైనా ఉందా! లేదా/ ఒంటరిదేనా భూమి’’ అంటారు. మానవులున్న భూమికి మానవులున్న మరో గ్రహం లభించకపోవడంతో భూమి ఒంటరిదై పోయిందనే భావం ఒకసారి భూజనుల్నీ తల్లి గురించి తల్లడిల్లజేస్తుంది. అన్వేషణా మూల భావ తీవ్రతలో, ‘‘నల్ల బిలాల నోళ్ళలో పడిపోయే/ రసగుల్లా తారల వెంట/ ప్రాణిగ్రహాలేమైనా అంతరించాయా!/ ఎక్కడా ఎవ్వరూ లేరా!/ ఏమిటిదంతా? ఆరని చితులేనా నా తారలు/... శ్మశాన విశ్వం మాటున విశాల సత్యం/ ఏదైనా వుందా లేదా!/ గద్గద జగద్గళం సవరించే మంగళ మృదుహస్తం/ ఏదైనా ఉందా లేదా’’ అంటారు కవి- ప్రపంచ మానవ అన్వేషణా ప్రతినిధిగా. ఉందా లేదా అనే పదాలను ఆవృత్తం చేస్తూ ‘‘ఉందా’’ అనే పదంతో మంగళప్రద ఆకాంక్షతో ముగిస్తారు.
కొన్నేళ్ళ క్రితం మరణించిన కొత్తపల్లి ఎన్ని ఏళ్ళయినా అసలు సిసలైన కవిత్వంతో అక్షరాలా కవిత్వ కీర్తిశేషులుగా అమృతుడయే వుంటారు. అందుకు అనంత అంతరిక్షాన్ని అక్షరంలో దర్శింపజేసిన ఈ సైన్సు కవిత్వమూ దోహదం చేస్తుంది. ఉత్తమ కవితావేత్తలు కొత్తపల్లి కొత్త చూపుగల కవిత్వ గ్రంథాలపై రాయాలి. ఇతర భాషలలోకి అన్నీ అనువాదం కావలసినవి కావు. ఇదిగో ఇటువంటి విశ్వజనీన భావ విలసితమైనవి అనువాదాలైతే తెలుగువాడి కైత వెలుగులు నలుదిక్కులా కాంతిపుంజాలవుతాయి.
సన్నిధానం నరసింహశర్మ
92920 55531