RK kothapaluku : ఏ నేరానికి ఈ శిక్ష?..
ABN , First Publish Date - 2023-09-17T01:38:33+05:30 IST
అల్పబుద్ధులకు అధికారమిస్తే ఏమి జరుగుతుందో యోగి వేమన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు వేమన శతకాన్ని గుర్తుచేస్తున్నాయి...
అల్పబుద్ధులకు అధికారమిస్తే ఏమి జరుగుతుందో యోగి వేమన ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు వేమన శతకాన్ని గుర్తుచేస్తున్నాయి. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి ఉందని శుక్రవారం నాడు సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తలుచుకుంటే కనీస ఆధారాలు లేకపోయినా ఎవరిపైన అయినా కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించవచ్చునని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రుజువు చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించి ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో నిర్బంధించారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి సంతృప్తి కలిగి ఉండవచ్చునుగానీ వ్యవస్థల పతనం మన ముందు ఆవిష్కృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో ప్రజాస్వామ్యం భేషుగ్గా ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు, ఆ తర్వాత రిమాండ్‌కు పంపడంలో జరిగిన జాప్యం అనేక ప్రశ్నలను మన ముందు ఉంచుతోంది. అధికారుల స్థాయిలో అవకతవకలు జరిగితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై కేసు పెట్టి అరెస్ట్ చేయవచ్చునా? ఇందులోని ఔచిత్యాన్ని పరిశీలించాల్సిన అవసరం న్యాయస్థానాలకు లేదా? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఏం జరిగింది? సీఐడీ అధికారులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం!
మంత్రిమండలి ఆమోదం లేకుండా ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఈ సంస్థను ఏర్పాటు చేశారని సీఐడీ చీఫ్ చెబుతున్నారు. ఆయనకు బిజినెస్ రూల్స్ పట్ల కనీస అవగాహన లేదని చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆదేశాలతో ఆ సంస్థ ఏర్పడినప్పటికీ ఆ తర్వాత నెలరోజులకే మంత్రివర్గం ఆమోదం పొందింది. ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి లేని సందర్భాలలో ఈ విధంగా చేయడం తప్పు అని నిబంధనల్లో ఎక్కడా లేదు. నైపుణ్యాభివృద్ధి శాఖను కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిబంధనల ప్రకారం నిధులు కేటాయించింది. ఆ శాఖ ద్వారానే నైపుణ్యాభివృద్ధి సంస్థకు నిధులు విడుదల చేశారు. విడతల వారీగా నిధులు విడుదల చేయాలని అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులదే కానీ ముఖ్యమంత్రిది కాదు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే నిధుల కేటాయింపు, ఆ నిధుల వినియోగంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర లేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వంలో జరిగే మంచీ చెడులకు ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులే బాధ్యత వహిస్తారు.
న్యాయస్థానాలు కూడా ప్రభుత్వ కార్యదర్శులనే బాధ్యులుగా పరిగణిస్తాయి. ఏదైనా కేసులో న్యాయస్థానాలు నోటీసులు జారీ చేసినప్పుడు కార్యదర్శులకే జారీ చేస్తాయి కానీ మంత్రులకు, ముఖ్యమంత్రులకు కాదు. సీఐడీ అధికారులలో ఈ కనీస అవగాహన కూడా కొరవడటం దురదృష్టకరం. న్యాయస్థానం ఆదేశాలు అమలు కానప్పుడు శాఖల కార్యదర్శులనే వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని న్యాయస్థానాలు ఆదేశిస్తాయి కానీ మంత్రినో ముఖ్యమంత్రినో రావాలని ఆదేశించవు. మంత్రి లేదా ముఖ్యమంత్రి చెప్పారు కనుక మేం ఫలానా పని చేశామని అధికారులు చెప్పినా న్యాయస్థానాలు అంగీకరించవు. అదే నిజమైతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులెందుకు? గుమస్తాలు చాలు కదా! వెరసి.. సీఐడీ చీఫ్ సంజయ్ చెబుతున్నట్టుగా చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు కనుక అధికారులు తప్పు చేశారని వాదించడం కుదరదు. ఇంతవరకు చంద్రబాబు పాత్ర ఏదీ లేదని స్పష్టమవుతోంది.
ఇప్పుడు సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడానికి ప్రాతిపదికగా ఎంచుకున్న ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక విషయానికి వద్దాం! నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఏం జరిగింది? తప్పు జరిగిందా? నిధులు దుర్వినియోగమయ్యాయా అని నిర్ధ్ధారించడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దాదాపు ఏడెనిమిది ఆడిట్ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. టెండర్ పిలిచినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను భౌతికంగా పరిశీలించాలన్న నిబంధన ఉండింది. ఆ తర్వాత ఈ నిబంధనను ఎత్తేశారు. అంటే, టెండర్ దక్కించుకున్న శరత్ అసోసియేట్స్ అనే సంస్థ ఆ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు వెళ్లి పరిశీలించకుండానే నివేదిక ఇచ్చేసిందన్న మాట. సీమెన్స్ భాగస్వామి అయిన డిజైన్‌టెక్ అనే సంస్థకు 371 కోట్లు విడుదల చేసిన మాట వాస్తవం. ఆ నిధులు పొందిన డిజైన్‌టెక్ సంస్థ హార్డ్‌వేర్ సరఫరా చేసిందా లేదా అన్నది నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను పరిశీలించకుండా నిర్ధారించడం ఎవరికైనా ఎలా సాధ్యం? కీలకమైన ఈ పరిశీలన జరగకుండానే 371 కోట్ల కుంభకోణం జరిగిందని సీఐడీ అధికారులు ఊరూరా తిరుగుతూ చాటింపు వేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ కూడా చంద్రబాబు 371 కోట్లు తినేశారని చెబుతున్నారు. చెల్లించిన సొమ్ముకు సరిపడా హార్డ్‌వేర్ సరఫరా చేశారా లేదా అన్నది తెలుసుకోకుండా కుంభకోణం జరిగిందని ఎవరైనా ఎలా చెబుతారు? సరుకు సరఫరా చేయకపోయినా, చేసిన సరుకు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోయినా నిధుల దుర్వినియోగం జరిగిందన్న నిర్ధారణకు రావచ్చు. ఇక్కడ ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన సంస్థ ఆ విషయం చెప్పలేదు. సీఐడీ అధికారులు కూడా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు వెళ్లి అక్కడ కంప్యూటర్లు లేవని నిర్ధారించుకోలేదు. అయినా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా చంద్రబాబును జైలుకు పంపారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన శరత్ అసోసియేట్స్ సంస్థ కూడా నిధుల గోల్‌మాల్ జరిగినట్టు తన నివేదికలో పేర్కొనలేదు. ప్రొసీజర్ పాటించడంలో లోపాలు ఉన్నాయని మాత్రమే నివేదికలో పేర్కొన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు నిధులు దొడ్డి దారిన అందాయని అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కానీ ఇటు శరత్ అసోసియేట్స్ కానీ నిర్ధారించలేదు. అయినాసరే... చంద్రబాబుకు కమీషన్లు ముట్టాయని సీఐడీ అధికారులకు అనిపించింది. నాడు ముఖ్యమంత్రి నుంచి ఒత్తిడి వచ్చినందునే అప్పటి అధికారులు అలా చేశారు ఇలా చేశారు అంటున్న సీఐడీ చీఫ్... ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి వల్లే తానిలా చేస్తున్నానని అంగీకరిస్తారా? చంద్రబాబుకే కాదు మరెవరికీ కూడా దొడ్డి దారిన సొమ్ములు అందినట్టు ఆధారాలను ఇంతవరకు సేకరించలేదు. కొంత కాలం క్రితం ఇదే కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేసిన ముగ్గురిని సాక్ష్యాధారాలు లేవని హైకోర్టు విడుదల చేసింది. అయినా ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్టు ఏసీబీ కోర్టు న్యాయాధికారికి ఎలా అనిపించిందో తెలియదు.
ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన శరత్ అసోసియేట్స్ ప్రతినిధులను ఈ ఏడాది ప్రారంభంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఢిల్లీలో విచారించారు. రాజకీయ నాయకులకు నిధులు అందినట్టు మీ ఆడిట్‌లో తేలిందా అని చంద్రబాబును దృష్టిలో ఉంచుకొని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అలా జరిగినట్టు కనీసం ఆధారాలు కూడా లభించలేదని శరత్ అసోసియేట్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయినా మనలో మాట! హార్డ్‌వేర్ సరఫరాలో పోటీ ఎక్కువగా ఉంటుంది కనుక మార్జిన్లు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కమీషన్ల కోసం కక్కుర్తి పడినా ఐదు శాతానికి మించి ఇవ్వరంట! అంటే నైపుణ్యాభివృద్ధి సంస్థలో కుంభకోణం జరిగిందనుకున్నా 15 నుంచి 20 కోట్లకు మించి కమీషన్ల రూపంలో వచ్చే అవకాశం ఉండదు. ముష్టి 15 కోట్ల రూపాయలకోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు కక్కుర్తి పడతారంటే ఎవరైనా నమ్ముతారా? చెల్లించిన సొమ్ముకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు హార్డ్‌వేర్ సరఫరా అయివుండక పోతే అవి నాలుగేళ్లపాటు వేలాది మంది విద్యార్థులకు ఎలా శిక్షణ ఇచ్చేవి? కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసినందున ఆ కేంద్రాలను సీమెన్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేసింది. నిధుల కొరత కారణంగా జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ కేంద్రాలను నిర్వహించలేక చేతులెత్తేసింది. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ఇది వేరే విషయం!
ఇదీ సీఐడీ తీరు...
పాత బిల్లులు చెల్లించడానికి కూడా 10 నుంచి 15 శాతం కమీషన్లు తీసుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు గత ప్రభుత్వంలో 371 కోట్లతో కొనుగోళ్లు జరిగితే కమీషన్లు అందకుండా ఉంటాయా అన్న డౌట్ వచ్చి ఉంటుంది. అయినా సీఐడీ అధికారులకు సొంత బుర్రలు లేవా? ఈడీ విచారణలోగానీ, ఫోరెన్సిక్ ఆడిట్‌లోగానీ చంద్రబాబుకు ముడుపులు అందాయని నిర్ధారణ కాలేదు. చెల్లించిన సొమ్ముకు తగ్గట్టుగా కంప్యూటర్లు సరఫరా చేయలేదని ఘనత వహించిన సీఐడీ అధికారులు కూడా నిర్ధారించలేదు. అయినా చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రాథమిక ఆధారాలు కనిపించాయని ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నట్టు ప్రొసీజర్‌పరంగా లోపాలు జరిగివుంటే అందుకు అధికారులే బాధ్యత వహించాలి.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఒత్తిడి చేసినందునే అధికారులు తప్పు చేశారని సీఐడీ చీఫ్ సంజయ్ అంటున్నారు. అలా అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి ఫలానా వాడిని చంపేయండి అని ఆదేశిస్తే ఇదే సంజయ్ ఆ పని చేస్తారా? కనీస ఆధారాలు లేకపోయినా చంద్రబాబును జైలుకు పంపించిన వారికి ఎవరినైనా చంపించడం కష్టం కాకపోవచ్చు. ఎంపీ రఘురామ కృష్ణరాజును తెల్లవార్లూ చితక్కొట్టిన చరిత్ర ఉన్న సీఐడీ అధికారులకు మనుషులను లేపేయడం కష్టం కాకపోవచ్చు. చంద్రబాబును రిమాండ్‌కు తరలించిన రోజు న్యాయస్థానంలో జరిగిన జాప్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఉదయం 6 గంటలకు ఏసీబీ న్యాయస్థానానికి చంద్రబాబును సీఐడీ అధికారులు తీసుకుపోయారు. ఉదయం 6 నుంచి దశల వారీగా విచారణ చేసిన న్యాయాధికారి రాత్రి 7 గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ముద్దాయి ఎవరైనా కావొచ్చు! ఈ పద్నాలుగు గంటలు వారి పరిస్థితి ఏమిటి? ముద్దాయిలకు ఆహారం సరఫరా చేసే బాధ్యతను ఇటు సీఐడీ అధికారులుగానీ అటు న్యాయస్థానంగానీ తీసుకోలేదు. ఇతరత్రా ప్రకృతి అవసరాలకు వారు ఎక్కడికి వెళ్లాలి? 73 సంవత్సరాల వయసులో చంద్రబాబును ఈ విధంగా బాధించడం న్యాయమా? ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉండి ఉండకపోతే న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా చొరవ తీసుకోవడం అవసరం.
ఇదిలావుంటే చంద్రబాబు తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాపై రాజమండ్రిలో వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏపీలో దిగజారిన పరిస్థితులకు మరో మచ్చుతునక! ‘‘అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైంది. పోరాటమే శరణ్యం’’ అంటూ సిక్కుల ఆరాధ్యుడైన గురు గోవింద్ సింగ్ సూక్తిని సిద్థార్థ లూథ్రా ట్వీట్ చేయడం ఇందుకు కారణం. అందులో వారికి ధర్మాగ్రహం కంటే హింసను ప్రేరేపించడమే కనిపించింది. సిక్కుల చరిత్ర, సంప్రదాయాలు తెలియని అవివేకులు ఇంతకన్నా ఏం చేయగలరు? రేపు గురు గోవింద్ సింగ్‌పై కేసు నమోదు చేసినా చేయగలరీ జగనన్న వీర భక్తులు!
ఏపీలో మాత్రమే జరిగిందా...
ఇప్పుడు సీమెన్స్ ప్రాజెక్టు పూర్వాపరాల్లోకి పోదాం! ప్రస్తుత కేసులో సీమెన్స్ సంస్థ ఒప్పందమే చేసుకోలేదని సీఐడీ అధికారులు చెప్పడం పచ్చి అబద్ధం, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు రాష్ర్టాలు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గుజరాత్‌లో ఒప్పందం కుదుర్చుకున్నారు. డొల్ల కంపెనీల ఏర్పాటు ద్వారా చంద్రబాబు నిధులు కొల్లగొట్టారని సీఐడీ అధికారులు గగ్గోలు పెడుతున్నారు కదా! ఇప్పుడు ఆ విషయానికీ వద్దాం! ఒప్పందం కుదుర్చుకున్న ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ వాటా నిధులను డిజైన్‌టెక్ సంస్థకే విడుదల చేశాయి. డిజైన్‌టెక్ సంస్థ ఆ నిధులను స్కిల్లర్ అనే సంస్థకు విడుదల చేసింది. ఈ స్కిల్లర్ కంపెనీ నుంచి నిధులు అందుకున్న డొల్ల కంపెనీలు జీఎస్టీ కోసం బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించాయి. మొత్తంగా ఆరు రాష్ర్టాలోనూ ఇదే విధంగా జరిగింది. బోగస్ ఇన్వాయిస్‌ల వ్యవహారాన్ని మొదటగా జీఎస్టీ అధికారులు గుర్తించారు. అది కూడా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయంలో! తర్వాత ఈడీ అధికారులు రంగప్రవేశం చేశారు.
ఒప్పందం కుదుర్చుకున్న ఆరు రాష్ర్టాలలో కూడా డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని మాత్రమే జీఎస్టీ, ఈడీ అధికారులు విచారణకు చేపట్టారు. మిగతా రాష్ర్టాలలో ఇదే తంతు జరిగినా పట్టించుకోలేదు. ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సహా మిగతా ఐదు రాష్ర్టాలకు కూడా కంప్యూటర్లు, ఇతర పరికరాలు మాత్రం సరఫరా చేశారు. అయినా డొల్ల కంపెనీలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో తెలియదు. బహుశా పన్ను ఎగవేతకు ఈ పనులు చేసి ఉండవచ్చు. ఈ ఆరు రాష్ర్టాలలో నాలెడ్జ్ పోడియం బీఈఎస్ రీసర్చ్ (ఇది సింగపూర్ కంపెనీ), కాడెన్స్ పార్టనర్స్, ఎస్‌ఎం ప్రొఫెషనల్ సర్వీసెస్ వంటి షెల్ కంపెనీలు తెరమీదకు వచ్చాయి. రాష్ర్టానికి రాష్ర్టానికి మధ్య ఈ కంపెనీలు పేర్లు, చిరునామాలు కూడా మార్చుకున్నాయి. మొత్తం ఆరు రాష్ర్టాలలో ఇదే తంతు జరిగినా మిగతా రాష్ట్రాల విషయంలో కేంద్ర ఏజెన్సీలు ఎందుకు మౌనంగా ఉన్నాయో తెలియదు. ఈ ఒప్పందాల అమలు విషయంలో డొల్ల కంపెనీల స్థాయిలో తప్పులు జరిగి ఉంటే అందుకు చంద్రబాబు ఎలా బాధ్యులవుతారు? రాష్ట్ర విభజనకు ముందే సీమెన్స్–డిజైన్‌టెక్‌తో గుజరాత్ సహా ఇతర రాష్ర్టాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
ఆయా రాష్ర్టాలలో కూడా డొల్ల కంపెనీలు తెరమీదకు వచ్చాయి. కానీ ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులను అరెస్టు చేయలేదే? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? నాసిక్‌లో గంగానది పుట్టిందని, కాదు కాదు కృష్ణా నది అని సెలవిస్తున్న అపర మేధావులు ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పగలరా? న్యాయస్థానాలలో విచారణలో ఉన్న కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించే విషయమై పోలీసు శాఖకు నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన రోజే సంజయ్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పాలన్న ఆరాటం ప్రభుత్వ పెద్దలతోపాటు సంజయ్‌లాంటి అధికారులకు ఉంటే ఉండవచ్చునుగానీ ఆధారాలు ఉండాలి కదా! మొత్తం ఆరు రాష్ర్టాలలో కూడా డొల్ల కంపెనీల ద్వారా నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నది కేంద్ర సంస్థలు ముందుగా తేల్చాలి. పన్ను ఎగవేతకు మాత్రమే అయితే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని జైలుకు పంపడంలో ఔచిత్యం ఏమిటి? ఇది వ్యవస్థల పతనానికి, వాటి డొల్లతనానికి నిదర్శనం కాదా?
ఇదీ చంద్రబాబు నైజం...
తన రాజకీయ జీవితంలో ఇటువంటి దురదృష్టకర పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భయం భయంగా వ్యవహరించేవారు. కక్ష సాధింపు చర్యలకు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రభుత్వం మారితే తనపై కూడా కక్ష సాధింపునకు పాల్పడతారన్నది ఆయన భయం. అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడకపోయినా ఇప్పుడు జైలు జీవితం గడపాల్సి వచ్చినందుకు చంద్రబాబు చింతిస్తున్నారేమో తెలియదు. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఒక ఉదంతం చెప్పుకొందాం. అప్పట్లో సీబీఐ కోర్టులలో న్యాయాధికారుల నియామకం జరగలేదు. ఆరు కోర్టులకుగాను ఒకే కోర్టులో న్యాయాధికారి ఉండేవారు.
ఈ కారణంగా జగన్‌పై ఉన్న కేసులు ముందుకు సాగడం లేదని, మీ ముఖ్యమంత్రికి చెప్పి ప్రధాన న్యాయమూర్తి దృష్టికి న్యాయాధికారుల నియామకం విషయం తీసుకెళ్లాలని అప్పటి సీబీఐ డైరెక్టర్ రాష్ర్టానికి చెందిన ఒక అధికారిని కోరారు. సదరు అధికారి చంద్రబాబు వద్దకు వెళ్లి ఈ విషయం ప్రస్తావించగా, ‘మనకెందుకు! రేపు ప్రభుత్వం మారితే మీ మీద కూడా పగబడతారు’ అని ఆయన బదులిచ్చారట! ఇదీ చంద్రబాబు నైజం. రాజకీయంగా ఆయన బద్ధశత్రువులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరహా ఆలోచనలు చేసివుంటే అతడిని జైలుకే పరిమితం చేసే అవకాశాలు చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నో వచ్చాయి. నాటి అవకాశాలను వినియోగించుకోలేదని చంద్రబాబు ఇప్పుడు కూడా పశ్చాత్తాపం పడుతుండకపోవచ్చు.
ఆయన ఆలోచనా దృక్పథానికి అద్దం పట్టే మరో ఉదంతాన్ని ఇప్పుడు చెప్పుకొందాం! ఏసీబీ కోర్టు తనకు రిమాండ్ విధించిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళుతూ మార్గ మధ్యంలో నోవాటెల్ హోటల్‌ను చూసి ఇలాంటివి వస్తేనే కదా అభివృద్ధి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ హోటల్ యజమాని వైసీపీ ముఖ్యులతో సన్నిహితంగా ఉంటారని పక్కన ఉన్న ఆయన వ్యాఖ్యానించగా, ‘వ్యాపారం చేసుకునే వాళ్లు అన్ని పార్టీల వారితో సత్సంబంధాలు పెట్టుకుంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా అన్నదే ప్రధానంగా చూడాలి’ అని చంద్రబాబు చెప్పడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనం కాదా! రాజశేఖర రెడ్డిని పోటీ పడి మరీ ప్రశంసించే వారు చంద్రబాబులోని ఈ తరహా దృక్పథం గురించి మాటవరసకైనా ప్రస్తావించకపోవడం ఆయన దురదృష్టం. జైలుకు వెళ్లబోతూ కూడా ఆయన ఇలా అభివృద్ధి గురించి ఆలోచించినందుకు హ్యాట్సాఫ్ చెబితే తప్పేముంది? అయితే తమ నాయకుడిని అన్యాయంగా జైలులో నిర్బంధించినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న పోకడలవల్ల మొత్తం రాష్ట్రం ఫ్యాక్షన్ జోన్‌గా మారబోతోంది. పగలూ ప్రతీకారాలే ప్రాధాన్యాలవుతాయి. ఇప్పుడు అరాచకంగా వ్యవహరిస్తున్న వారిని రేపు మేం లోపల వేయకుండా ఉంటామా అని జన సేనాని పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టంలా మారితే అందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అధికారం కోల్పోతే తాను ఆంధ్రప్రదేశ్‌లో ఉండబోవడం లేదు కదా అని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉండవచ్చునుగానీ ప్రస్తుత పాపాలు ఆయన ఎక్కడ ఉన్నా వదలవు. రాష్ట్రం కూడా నాశనమవుతుంది. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మేధావులు, ఆలోచనాపరులు ఎవరైనా మిగిలి ఉంటే వారు ఈ దిశగా ఆలోచన చేయాలి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలను విమర్శించిన కొందరు ప్రముఖులు ఇప్పుడు సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీలో చేరడం శుభ పరిణామం. చంద్రబాబు ఇవాళ కాకపోతే రేపు విడుదలవుతారు. ఆ తర్వాత ఏం జరగబోతోంది అన్నదే ఇప్పటి ప్రశ్న. సినిమా అప్పుడే అయిపోలేదు... లోకేశ్‌ను కూడా లోపలేస్తాం అని కొందరు మంత్రులు నోరు పారేసుకుంటున్నారు. వారికి అంతే తెలుసునని ప్రజలు తెలుసుకున్నారు కనుక చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టుగా భవిష్యత్ పరిణామాలకు వారు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం!
ఆర్కే