RK Kothapaluku: అంతఃపుర రహస్యం

ABN , First Publish Date - 2023-04-30T02:17:56+05:30 IST

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసుకోవడానికి ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయింది.

RK Kothapaluku: అంతఃపుర రహస్యం

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసుకోవడానికి ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయింది. న్యాయస్థానం అనుమతిస్తే అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ అధికారులు ఒకటికి రెండు పర్యాయాలు హైకోర్టుకు నివేదించారు. దీంతో న్యాయస్థానంలో జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. అయితే అది వాస్తవం కాదు. వివేకా కేసు మొదటి నుంచి అనేక మలుపులు తిరుగుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను మరపిస్తోంది. ఈ కారణంగా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. అవినాశ్‌ రెడ్డికి తాత్కాలిక ముందస్తు బెయిల్‌ ఇవ్వడంతోపాటు సీబీఐకి ఆంక్షలు విధించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో అవినాశ్‌ పిటిషన్‌ను విచారించి తుది నిర్ణయం ప్రకటించాలని హైకోర్టును ఆదేశించింది. ఇది గమనించని నెటిజన్లు హైకోర్టు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందన్న వ్యాఖ్యలు మొదలుపెట్టారు. నిజానికి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నిబంధనల ప్రకారమే విచారణ జరిగింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐకి ఆటంకాలు తొలగిపోయాయి. అయినా సీబీఐ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఏవో అదృశ్య శక్తులు అడ్డుకుంటున్నాయన్న అభిప్రాయం సహజంగానే ఏర్పడింది. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఇదే కేసులో నిందితుడుగా ఉన్న సునీల్‌ యాదవ్‌ గతంలో పెట్టుకున్న పిటిషన్‌ హైకోర్టులో విచారణలో ఉండగానే సీబీఐ అధికారులు అతడిని అరెస్టు చేశారు. సునీల్‌ యాదవ్‌ విషయంలో లేని అడ్డు అవినాశ్‌ రెడ్డి విషయంలో ఎందుకు?, ఎలా వచ్చిందో సీబీఐ అధికారులే చెప్పాలి.

మరోవైపు అవినాశ్‌ రెడ్డిని రక్షించడం కోసం విజయ్‌ కుమార్‌ వంటి లాబీయిస్టులను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రంగంలోకి దించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. న్యాయమూర్తులతో పరిచయం ఉన్నంత మాత్రాన వారిని ఎవరూ ప్రభావితం చేయలేరని సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. న్యాయ పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత కేసులోని మెరిట్స్‌ ఆధారంగానే న్యాయమూర్తులు వ్యవహరిస్తారని ఈ సందర్భంగా మరోమారు రుజువైంది. అయినా దింపుడు కళ్లం ఆశతో ఢిల్లీలో పరిచయాలు ఉన్న ఒక అధికారిని ఈ నెల 24కు ముందు ఢిల్లీకి పంపారు. ఆయన రెండు రోజులు ఢిల్లీలో మకాం చేసినా ఫలితం లేకపోయింది. అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా అడ్డుకొనే అన్ని దారులూ ఒక్కొక్కటిగా మూసుకుపోతుండటంతో జగన్‌ అండ్‌ కో సొంత విచారణ చేయడం మొదలెట్టింది. సొంత మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలను వండి వార్చారు. వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేశారు. న్యాయం కోసం అలుపెరుగకుండా పోరాడుతున్న ఆయన కుమార్తె డాక్టర్‌ సునీత దంపతులను హంతకులుగా చిత్రీకరించడానికి సైతం వెనుకాడలేదు. ఆస్తుల కోసం వివేకాను ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి చంపించారని ప్రచారం చేశారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, వివేకానంద రెడ్డికి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అల్లుడు మాత్రమే కాదు.. సొంత బావమరిది కూడా! రాజశేఖర రెడ్డి అక్కనే వివేకా వివాహం చేసుకున్నారు.

జగన్‌ నైజం ఇదే కదా...

అవినాశ్‌ రెడ్డిని ఎలాగైనా రక్షించాలని అనుకుంటున్న జగన్‌రెడ్డి, ఆ క్రమంలో చేయని ప్రయత్నం లేదు. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయలేకపోయినప్పటికీ అవినాశ్‌ జైలుకు వెళ్లకుండా సీబీఐని అదృశ్య శక్తి ద్వారా ప్రభావితం చేస్తున్నారు. జగన్‌రెడ్డి స్థానంలో మరెవరు ఉన్నా వివేకా కేసులో సొంత కుటుంబ సభ్యులను కాదని వరుసకు సోదరుడైన అవినాశ్‌ రెడ్డి కోసం ఇంతలా వకాల్తా పుచ్చుకోరు. వివేకాది ఆస్తుల కోసం జరిగిన హత్య అని నమ్మించడానికై జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఆయన సొంత చెల్లి షర్మిల మీడియాతో మాట్లాడుతూ, వివేకా జీవించి ఉన్నప్పుడే ఆస్తులన్నీ డాక్టర్‌ సునీత పేరు మీద రాశారని, ఆస్తుల కోసమైతే సునీతను చంపాలిగానీ వివేకాను ఎందుకు చంపుతారని ప్రశ్నించారు. తమ ప్రచారాన్ని సొంత చెల్లి షర్మిలే ఖండించడంతో జగన్‌ వర్గం ఆత్మరక్షణలో పడిపోయింది. ఇంతకూ తన సొంత కుటుంబీకులను కూడా కాదనుకోవడానికి, వారినే నిందితులుగా చిత్రించడానికి జగన్‌ ఈ స్థాయిలో ప్రయత్నాలు చేయడానికి కారణాలు ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. కేవలం అవినాశ్‌ రెడ్డిని కాపాడుకోవడానికే అయితే జగన్‌రెడ్డి ఈ స్థాయిలో ప్రయత్నించరు. ఎవరు ఎటు పోయినా తాను బాగుంటే చాలునని అనుకునే రకం జగన్‌రెడ్డి. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణిస్తే, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సహకారంతో సోనియాగాంధీనే తన తండ్రిని చంపించారని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన ఘనుడు ఈ జగన్మోహన్‌ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ముఖేశ్‌ అంబానీకి ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలకడమే కాకుండా ఆయన ప్రతినిధి పరిమళ్‌ నట్వానీని రాజ్యసభ సభ్యుడిగా చేసి రుణం తీర్చుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య కేసును కూడా రాజకీయంగా వాడుకొని లాభపడ్డారు. అసలు నిందితులు బయటపడాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్‌ చేసిన జగన్‌, అధికారంలోకి రాగానే మాట మార్చారు. దీన్నిబట్టి జగన్‌రెడ్డికి సెంటిమెంట్‌ అనేదే ఉండదని అర్థం చేసుకోవాలి.

హత్యలు, ఆత్మహత్యలైనా తనకు ఉపయోగపడతాయో లేదో అనే కోణంలోనే ఆయన చూస్తారు కాబోలు! కన్న తల్లి, సొంత సోదరి దూరమైనా లెక్కచేయని జగన్‌, తన తాత రాజారెడ్డి సోదరుడి మనవడైన అవినాశ్‌ రెడ్డి కోసం ఇంతలా ఆరాటపడటం ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ సందర్భంగా మరో విషయం చెప్పుకోవాలి. తెలంగాణలో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లబ్ధి పొందిన వారందరూ ముఖం చాటేశారు. కన్న బిడ్డ కష్టాలను దగ్గరి నుంచి చూస్తున్న విజయలక్ష్మి, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని పిలిపించుకొని షర్మిలకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరారు. జగన్మోహన్‌ రెడ్డి అనుమతి లేకుండా తాను ఏమీ చేయలేనని ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ప్రభాకర్‌ రెడ్డి జగన్‌కు చెప్పారు. ఒక్క పైసా కూడా సాయం చేయవద్దని జగన్‌ ఆదేశించారు. అవే మాటలు ప్రభాకర రెడ్డి విజయలక్ష్మి వద్దకు వచ్చి చెప్పగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సొంత చెల్లెలి విషయంలోనే కనికరం లేకుండా కఠినంగా వ్యవహరించిన జగన్మోహన్‌ రెడ్డికి చిన్నాన్న వివేకా హత్య కేసు నుంచి అవినాశ్‌ను రక్షించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషించే క్రమంలో దిగ్ర్భాంతి కలిగించే కఠోర నిజాలు బయటికొచ్చాయి.

వారికి ముందే తెలుసా...

వివేకానంద రెడ్డి హత్య విషయం జగన్మోహన్‌ రెడ్డి దంపతులకు ముందుగానే తెలుసని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు లభిస్తున్నాయి. వివేకా హత్య 2019 మార్చి 15 అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో జరిగింది. అదేరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసమై నలుగురు ముఖ్యులను జగన్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని తన నివాసానికి పిలిపించుకున్నారు. ఇది ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఆ నలుగురితో జగన్మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఇంతలోనే మేడ మీద నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఇంట్లోకి వెళ్లిన జగన్‌రెడ్డి పది నిమిషాల తర్వాత తిరిగి సమావేశ ప్రదేశానికి వచ్చారు. చిన్నాన్న గుండెపోటుతో చనిపోయారని ఆ నలుగురికీ చెప్పి సమావేశాన్ని కొనసాగించారు. అంటే, వివేకా హత్య గురించి ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్‌ రెడ్డి దంపతులకు తెలుసునని స్పష్టమవుతోంది. హత్య తర్వాత అవినాశ్‌ రెడ్డి ఫోన్‌ నుంచి జగన్‌ దంపతుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు వెళ్లాయని సీబీఐ విచారణలో కూడా వెల్లడైన విషయం విదితమే.

చిన్నాన్నను ఏమి చేశారో తెలిసి కూడా జగన్మోహన్‌ రెడ్డి చలించకుండా ఎన్నికల ప్రణాళిక గురించి చర్చించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కరడుగట్టిన మనస్తత్వం ఉన్నవారు మాత్రమే అలా ప్రవర్తించగలరు. ఒకవేళ వివేకాది సహజ మరణమే అయినప్పటికీ చనిపోయిన చిన్నాన్న భౌతికకాయానికి నివాళులర్పించడానికి జగన్‌ స్థానంలో ఎవరున్నా ఉన్నపళంగా బయలుదేరి వెళతారు. జగన్‌ దంపతులు అలా చేయకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. జగన్‌తో ఆ రోజు సమావేశమైన ఆ నలుగురూ ఇప్పటికీ ఆయనతోనే ఉన్నారు. ఆ నలుగురూ మరెవరో కాదు! ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్‌ పర్సనల్‌ సెక్రటరీ కృష్ణమోహన్‌ రెడ్డి, దివంగత సోమయాజులు కుమారుడు కృష్ణ (అధికారంలోకి వచ్చాక ఆయనను ఆర్థిక శాఖ స్పెషల్‌ సెక్రటరీగా నియమించారు), రిటైర్డ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం. సీబీఐ అధికారులు ఈ నలుగురినీ విచారిస్తే అసలేం జరిగిందో బయటికొస్తుంది. వివేకా హత్య వెనుక విస్తృత స్థాయి కుట్ర ఉందని సీబీఐ మొదటి నుంచీ చెబుతోంది. ఇప్పుడు అది నిజమేనని నమ్మక తప్పని పరిస్థితి.

ఈ ప్రశ్నలకు బదులేదీ?

విస్తృత స్థాయి కుట్ర కోణాన్ని బయటకు తీసుకురావాల్సిందిగా సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌ రెడ్డి దంపతులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. వివేకా మరణం గురించి తమకు 4.30 గంటల ప్రాంతంలో సమాచారం ఇచ్చింది ఎవరు? వివేకా మృతి చెందిన విషయం తెలిసి కూడా హుటాహుటిన పులివెందుల వెళ్లకపోవడానికి కారణం ఏమిటి? వివేకాది సహజ మరణమే అయితే రక్తపు మరకలు కడిగించాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకొచ్చింది? బంధువులు చేరుకొనేలోపే వివేకా శరీరంపై ఉన్న గాయాలకు కుట్లు వేయించి, శవాన్ని శుభ్రంగా తుడిచి ఫ్రీజర్‌లో పెట్టించాల్సిన అవసరం ఏమిటి? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. జగన్మోహన్‌ రెడ్డి అనుమతి లేకుండానే రక్తపు మడుగు కడిగేసి శవానికి కుట్లు వేయగలరా? తెల్లవారుజామున లోటస్‌ పాండ్‌లో జరిగిన సమావేశంలో... వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పిన జగన్‌రెడ్డి తిరిగి పులివెందులకు వెళ్లి వివేకాను ఎలా చంపారో పూసగుచ్చినట్టు ఎలా వివరించగలిగారు? ఒకవైపు తనను చంపుతున్నప్పటికీ వివేకానంద రెడ్డి లేఖ ఎలా రాయగలిగారని ఆ రోజు జగన్‌ ప్రశ్నించగా, ఆ లేఖను నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ఎందుకు దాచారని అవినాశ్‌ రెడ్డి ఇప్పుడు ప్రశ్నించడం ఏమిటి? ఈ మొత్తం వ్యవహారంలో జగన్‌రెడ్డి దంపతుల పాత్ర ఏమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాల్సిన బాధ్యత ఇప్పుడు సీబీఐ పైనే ఉంది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఆ నలుగురితో జరిగిన సమావేశం గురించి సీబీఐ డైరెక్టర్‌కు డాక్టర్‌ సునీత ఫిర్యాదు చేశారా? చేసి ఉంటే సీబీఐ అధికారులు ఏం చేయబోతున్నారు? వంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు లభించాల్సి ఉంది. ఆ రోజు జగన్‌తో సమావేశమైన ఆ నలుగురినీ సీబీఐ ప్రశ్నించాల్సిన అవసరముంది. సీబీఐ విచారణలో ఆ నలుగురూ నిజం అంగీకరిస్తే జగన్మోహన్‌ రెడ్డి దంపతుల మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది!

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే...

వాస్తవానికి చిన్నాన్న వివేకాతో జగన్‌కు చాలా కాలం నుంచి సత్సంబంధాలు లేవు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప ఎంపీగా వివేకానంద రెడ్డి ఉండేవారు. రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న జగన్‌ కడప ఎంపీ స్థానానికి పోటీ చేయాలనుకున్నారు. అయితే, అప్పటికే ఆ స్థానం నుంచి వివేకా ఎంపీగా ఉన్నందున ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకున్నారు. రాజీనామా చేయడానికి వివేకానంద రెడ్డి నిరాకరించడంతో జగన్మోహన్‌ రెడ్డి ఆయన మీద చేయి చేసుకున్నారు. ఆ విషయాన్ని వివేకా పలువురి వద్ద చెప్పుకొని బాధపడ్డారు కూడా. ఆ తర్వాత వివేకానంద రెడ్డి నేరుగా లోక్‌సభ స్పీకర్‌ను కలసి రాజీనామా లేఖను అందజేశారు. ఆ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వెంటనే వివేకాను పిలిపించి రాజీనామాను వెనక్కు తీసుకోవలసిందిగా ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ఢిల్లీ పిలిపించుకొని ‘మీ కుమారుడిని అదుపులో పెట్టుకోండి’ అని ఆదేశించారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత జగన్‌ సొంత పార్టీ పెట్టుకోవడం, వివేకా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం తెలిసిందే. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వివేకానంద రెడ్డి వైసీపీలో చేరే ప్రయత్నం చేశారు. అప్పట్లో జైల్లో ఉన్న జగన్‌ను కలవడానికి ప్రయత్నించినా వివేకాను కలుసుకోవడానికి కూడా జగన్‌ అంగీకరించలేదు. దీంతో చంచల్‌గూడ జైలు బయట కొంతసేపు వేచిచూసిన వివేకా వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ దశలోనే అమెరికాలో నివసిస్తున్న డాక్టర్‌ సునీత దంపతులు స్వరాష్ర్టానికి తిరిగి వచ్చారు. కుటుంబంలో తాను ఒంటరిగా మిగిలిపోవడంతో చక్కటి జీవితాన్ని కూడా వదులుకొని కూతురు, అల్లుడు తనకోసం వచ్చేశారని ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో వివేకా చెప్పుకొన్నారు. కుమార్తె, అల్లుడికి ఆస్తులపై మమకారం లేదని కూడా వివరించారు. ఇప్పుడు అదే సునీత దంపతులపై ఆస్తుల కోసం హత్యకు కుట్ర చేశారని నిందలు వేస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌లో జరిగిన విషయాలను వివేకా హత్య జరిగిన రోజు సంఘటనలను, సమావేశాలను క్రోడీకరించి నిశితంగా పరిశీలిస్తే వివేకా హత్యకు కారణమేమిటో స్పష్టమవుతుంది.

కుటుంబం పరువు పాయె...

ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుటుంబం పరువు బజారున పడింది. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నంతవరకు భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి రాజకీయాల వైపు రాలేకపోయారు. వైఎస్‌ కుటుంబం తలెత్తుకుని బతికింది. కుటుంబ పెద్ద మరణించడంతో ఆ కుటుంబం పరువే కాదు– కుటుంబ సభ్యులు కూడా బజారున పడ్డారు. తండ్రిని కోల్పోయిన డాక్టర్‌ సునీత న్యాయం కోసం ఎక్కే గడప దిగే గడపగా తిరుగుతున్నారు. తెలంగాణలో రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న రాజశేఖర రెడ్డి గారాల పట్టి షర్మిల జైలుకు కూడా వెళ్లి వచ్చారు. కూతురి కోసం విజయలక్ష్మి కూడా తెలంగాణలో ధర్నాలు, దీక్షలు చేయాల్సిన పరిస్థితి. రాజశేఖర రెడ్డి లేనందువల్ల లాభపడింది జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే! అప్పటివరకు మరుగునపడి ఉన్న అవినాశ్‌ రెడ్డి ఎంపీ అయ్యారు. వివేకానంద రెడ్డి సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. పులివెందులలో భాస్కర రెడ్డి కుటుంబ ఆధిపత్యం పెరిగిపోయింది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే అంతఃపురం కుట్రలు తేటతెల్లమవుతున్నాయి. వివేకా హత్యకు కుట్ర పన్నింది ఎవరో, వారిని ప్రోత్సహించింది ఎవరో పాలూ– నీళ్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా న్యాయస్థానాన్ని సాకుగా చూపించి నిందితులను అరెస్టు చేయడంలో తాత్సారం చేస్తూ వచ్చిన సీబీఐ, ఇక ఎంత మాత్రం తప్పించుకోలేదు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున జగన్‌తో సమావేశమైన ఆ నలుగురినీ ఇవాళ కాకపోయినా రేపైనా సీబీఐ విచారించక తప్పదు. సదరు విచారణలో వారు నిజం చెబితే జగన్‌రెడ్డి దంపతులకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటివరకూ మన దేశంలో అవినీతి కేసులలో మాత్రమే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు జైలుశిక్షలు అనుభవించారు.

ఇప్పుడు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అవినీతి ఆరోపణలతోపాటు క్రిమినల్‌ ఆరోపణలను కూడా ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్‌ రెడ్డి ఇప్పటికే అయినవాళ్లందరినీ దూరం చేసుకున్నారు. పార్టీలో కూడా విజయసాయి రెడ్డి వంటి నమ్మిన బంటునూ దూరం చేసుకున్నారు. ఒకరకంగా ఆయన ఇప్పుడు ఒంటరి. రాజశేఖర రెడ్డితో సంబంధం ఉన్నవారే కాకుండా, ఆయన పట్ల గౌరవంతో జగన్‌రెడ్డికి దగ్గరైన వారందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. అయినా అవినాశ్‌ రెడ్డిపై మమకారాన్ని జగన్‌రెడ్డి వదులుకోలేక పోతున్నారు. వివేకా హత్య కేసు ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. ఒత్తిడి కారణంగా కానీ, మరే ఇతర కారణంవల్ల కానీ సీబీఐ అప్పుడప్పుడూ డ్యాన్స్‌ చేస్తోంది. అవినాశ్‌ రెడ్డికి తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ సునీత వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు సీబీఐ తరఫున అఫిడవిట్‌ కూడా దాఖలు కాలేదు. అఫిడవిట్‌ వేయకుండా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాత్రం విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులో దాఖలు చేయని అఫిడవిట్‌ను హైకోర్టులో మాత్రం సీబీఐ దాఖలు చేసింది. ఇదంతా జగన్నాటకాన్ని తలపిస్తోంది. కేసు మెరిట్స్‌ను బట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ నిక్కచ్చిగా వ్యవహరించింది. తాత్కాలిక ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. అవినాశ్‌ విషయంలో సీబీఐ తన పని తాను చేసుకోవచ్చునని హైకోర్టు సింగిల్‌ జడ్జి కూడా స్పష్టంచేయడంతో అవినాశ్‌ తరఫు లాయర్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఈ కేసు గురించి ప్రస్తావించినా లాభం లేకపోయింది. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈ కేసు విషయమై తమను ఇబ్బంది పెట్టవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ వ్యాఖ్యానించారు కూడా! అవినాశ్‌ రెడ్డిని రక్షించుకోవడానికై జగన్‌ అండ్‌ కోకు న్యాయ వ్యవస్థలోని అన్ని దారులూ మూసుకుపోయాయి. ఇప్పుడు బంతి సీబీఐ కోర్టులో ఉంది.

ఈ నేపథ్యంలో అవినాశ్‌ రెడ్డి అరెస్టు కాకుండా ఇప్పటివరకూ కాపాడుతూ వచ్చిన అదృశ్య శక్తులు ఇకపై కూడా కాపాడతాయా? లేదా? అన్నది వేచి చూడాలి. జగన్‌రెడ్డి కోసం ఆ అదృశ్య శక్తులు అప్రతిష్ఠపాలు కావడానికి సిద్ధపడతాయా? అలా సిద్ధపడితే దాని ప్రభావం తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీపై పడకుండా ఉంటుందా? అవినాశ్‌ రెడ్డిని రక్షించే క్రమంలో జగన్మోహన్‌ రెడ్డి కూడా ఊబిలో కూరుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసు వల్ల వైసీపీ ఇప్పటికే సరిపడా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కేసులో మొదటిసారిగా జగన్‌రెడ్డి సతీమణి భారతీ రెడ్డిపై అనేక చూపుడువేళ్లు గురిపెట్టి ఉన్నాయి. ఆమె పాత్రపై జనం అనుమానంగా చూస్తున్నారు. భార్యా విధేయుడిగా జగన్మోహన్‌ రెడ్డిపై ముద్రపడుతోంది. ఏది ఏమైనా వివేకా హత్య కేసులో నిందితులు అందరికీ శిక్ష పడటంలో జాప్యం జరిగితే జరగవచ్చును గానీ శాశ్వతంగా తప్పించుకోలేరు. సీబీఐ అధికారులు ఈ కేసును పకడ్బందీగా బిగించి పెట్టారు. క్లియరెన్స్‌ వచ్చిన మరుక్షణం జైలుకు వెళ్లాల్సిన వారు వెళ్లక తప్పదు. ఈ కేసు జగన్‌ దంపతుల మెడకు కూడా చుట్టుకుంటుందా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అయితే ఈ వ్యవహారం అనేక ప్రశ్నలను కూడా రేకెత్తిస్తోంది. డాక్టర్‌ సునీతలాగా ఎంతమంది ఇన్నేసి వ్యయప్రయాసలకు ఓర్చి న్యాయం కోసం పోరాడగలరు? ఒక మాజీ ఎంపీ, మాజీ మంత్రి, దివంగత ముఖ్యమంత్రి సొంత సోదరుడి హత్య కేసు దర్యాప్తునకే ఇన్నేళ్లు పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? న్యాయం కోసం పోరాడుతున్న వాళ్లు జైళ్లలో మగ్గుతుండగా, జైళ్లలో ఉండాల్సిన వాళ్లు పదవుల్లో ఉండటం ఏమిటి? వెసులుబాటు పేరిట నేరస్థులకు న్యాయ వ్యవస్థలో ఇన్ని ద్వారాలు తెరిచి ఉంచడం ఏమిటి? దేశంలో న్యాయం బతికే ఉందని, ఉంటుందని సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించడానికై న్యాయ శాస్త్ర కోవిదులు ఇప్పటికైనా ఈ లొసుగులపై దృష్టిపెడితే మంచిది!

ఆర్కే

MD-Qr-code.jpg

యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - 2023-04-30T02:19:28+05:30 IST