మాయాబజార్ ‘ప్రియదర్శిని’కి మూలమిదిగో!
ABN , First Publish Date - 2023-08-14T00:31:17+05:30 IST
తెలుగు సినిమా చరిత్రలో ‘మాయాబజారు’ సినిమాది ఒక విశిష్ఠమైన స్థానం. ఆ సినిమాకు మూల కథ ఎక్కడి నుండి వచ్చిందనే ప్రశ్నకు సమాధానంగా- అది 1925లో (మొదటసారిగా ‘మాయాబజారు’ మూకీ సినిమాగా హిందీలో రూపందాల్చిన సంవత్సరం...
తెలుగు సినిమా చరిత్రలో ‘మాయాబజారు’ సినిమాది ఒక విశిష్ఠమైన స్థానం. ఆ సినిమాకు మూల కథ ఎక్కడి నుండి వచ్చిందనే ప్రశ్నకు సమాధానంగా- అది 1925లో (మొదటసారిగా ‘మాయాబజారు’ మూకీ సినిమాగా హిందీలో రూపందాల్చిన సంవత్సరం) ఒక జానపద కథ నుంచి రూపం దిద్దుకుని, కాలంతో పెరుగుతూ వచ్చి, చివరి రూపంగా మనకు తెలుగులో ‘మాయాబజారు’ అయి, అక్కడితో మరింక పెరిగేందుకు అవకాశమేమీ లేక ఆగిపోయింది అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా. ఈ సందర్భంగా మనకు తెలియాల్సిన ఒక మంచి సంగతి ఏమిటంటే ‘శశిరేఖాపరిణయము’ అనే పేరుతో ఒక పద్యకావ్యం, 19వ శతాబ్దం నాటిది, అన్నివిధాలా ‘మయాబజారు’ సినిమా కథను పోలినది ఒకటి తెలుగు సాహిత్యంలో ఉంది. ఈ కావ్యం రచించిన కవి పేరు రత్నాకరం అప్పప్పకవి.
ఘటోత్కచుడు శశిరేఖను నిద్రిస్తున్నదానిని నిద్రిస్తున్నట్లు గానే మంచంతో సహా తెచ్చి అడవిలో తమ నివాసానికి చేరువనే దించి, తమ్ముడైన అభిమన్యునికి సంగతి చెప్పి, ద్వారకలో తాను నిర్వర్తించవలసిన పనికోసం తిరిగి వెళ్ళిపోతాడు. నిద్ర నుంచి మేల్కొన్న శశిరేఖ ఆశ్చర్యంగా తనలో తాను అనుకున్న సంగతులు పై పద్యం.
‘శశిరేఖాపరిణయము’ చదవడం మొదలుపెట్టిన వాళ్ళకు, అప్పప్పకవి కవిత్వం చాలా సరళమైన మాటలతో, మంచి ధారతో కూడుకున్నదిగా తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. పై పద్యంలో కూడా దాదాపు ప్రతి పాదంలోనూ అందమైన తెలుగు జాతీయాలున్నాయి. ‘ముంగొంగు మూట’, ‘నా నోము ఫలియించె’, ‘నళినగర్భుని వ్రాత ధారుణి యందు వ్యర్థంబు గాదు’ అన్నవి అందరకూ తెలిసినవి, అర్థవంతమైనవీ అయిన ప్రసిద్ధ తెలుగు జాతీయాలకు గ్రాంథిక రూపాలు అనుకోవచ్చు. అయితే, వీటి తరువాత వచ్చే ‘అద్దమున తోచు లిబ్బి చెయ్యబ్బినట్లు’ అనే నానుడి మాత్రం మన మాటలలోంచి జారిపోయి ఎన్నేళ్ళయిందో ఎవరికీ తెలియదు. ‘లిబ్బి’ అనే మాటకు (ధన) రాశి అని అర్థం. ‘‘అద్దంలో కనిపించే ధనం, నిజంగానే చేతికి అందినంత ఆనందంగా...’’ అని ఆ మాటల అర్థం.
‘‘ఎవరు నన్ను ఈ అడవిలోకి తెచ్ఛిపడేశారో గాని, వారు నిజంగా పుణ్యాత్ములే. నారదులవారు ముందుగానే చెప్పారు. వారిమాట నిజంగా కొంగుకే ముడివేసి ఉన్న బంగారం వంటిది. వారికి నమస్కరించుకుంటున్నాను. వారు ముందు గానే చెప్పినట్లుగా అడవిలో, అత్త అయిన సుభద్రతోపాటుగా, అభిమన్యుని చూసే భాగ్యం నాకు దక్కింది. బ్రహ్మదేవుడు నుదుటన వ్రాసిన రాత ఎప్పటికీ తప్పదనే మాట తిరుగులేనిదే. అద్దంలో కనబడుతూన్న ధనరాశి చేతికే చిక్కినట్లుగా, అభిమన్యుని అందమైన రూపాన్ని నేను ఇప్పుడు కనులారా చూస్తాను. నేను చేసుకున్న పుణ్యం ఎంతైనా పొగడదగినదే సుమా!’’ అని శశిరేఖ మనసులో సంబరపడుతూ అనుకున్న మాటలు ఈ పద్యం భావం.
ఇక్కడ ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, అప్పప్పకవి అప్పుడు జనసామాన్యం వాడుకలో ఉండిన సామెతను తీసుకుని పద్యంలో పొందుపరిచిన ఈ ‘‘అద్దమున తోచు లిబ్బి...’’కి దృశ్యరూపం తెలుగు ‘మాయాబజారు’ సినిమాలో హృద్యంగా చిత్రీకరించబడి కనపడుతుంది. శశిరేఖకు అభిమన్యుడు కానుకగా ‘ప్రియదర్శిని’ పేటికను పంపుతాడు. పేరుకు తగినట్లుగా, అందులో చూసిన వారికి ఎవరికి ఏది అమితంగా ఇష్టమో ఆ వస్తువునో లేక వ్యక్తినో ఆ పేటికలోని దర్పణం చూపెడుతుంది. అలా, ఊహించిన విధంగా శశిరేఖకు అభిమన్యుడే అందులో కనబడతాడు. బలరామునికి ప్రియమైన శిష్యుడు దుర్యోధనుడు కనపడతాడు. కృష్ణునికి ప్రత్యర్థులలో అతిముఖ్యుడైన శకుని కనపడతాడు. వీటన్నిటి కంటే ముందు బలరాముని భార్యయైున రేవతికి, పై పద్యంలో చెప్పిన ‘లిబ్బి’ బంగారు పళ్ళేలలో రాశులుగా మణులు, మాణిక్యాలు, బంగారునాణాల రూపంలో కనిపించి, అది చేతికి అందినట్లే ఆమెను మైమరపింపజేస్తుంది. ఈ సీన్‌కు స్ఫూర్తి అప్పప్పకవి ‘శశిరేఖాపరిణయం’ లోని పై పద్యంలో చెప్పిన సామెతలోంచి లభించి ఉంటుందని అనుకోవడంలో అసంభావ్యత ఉండబోదని రెండు కారణాల వలన చెప్పవచ్చు. మొదటి కారణం: వావిళ్ళవారు ప్రచురించిన ‘శశిరేఖాపరిణయం’ కావ్యం మొదటి ముద్రణ 1928లో జరిగింది. పండితులకు ఈ కావ్యం అప్పటికే అందుబాటులో ఉన్న కారణంగా ఇందులోని కథతో పాటుగా తెలుగు నానుడులలో ప్రత్యేకమైనవిగా తోచేవి అన్నీ వారికి పరిచ యమై ఉన్నాయి. ఇక రెండవ కారణం: ఈ నానుడి ఈ కావ్యంలో తప్ప మరొక చోట ప్రయుక్తమై కనపడదు. తెలుగు సామెతల సంకలనాల్లో కూడా ఇది పొందుపరచబడి లేదు. ‘పదబంధ పారిజాతం’ కూర్పులో ‘శశిరేఖా పరిణయం’ కావ్యం సంప్రదించబడినప్పటికీ అందులో ఈ సామెత గ్రహింపబడ లేదు. అలాగే తెలుగు సామెతల కూర్పులోనూ ఈ సామెత అప్పప్పకవి చెప్పిన అర్థంలోనూ, ఆ రూపంలోనూ లేదు. ఈ రెండు పుస్తకాల కూర్పు 1959లో జరిగింది. ‘మాయాబజారు’ సినిమా నిర్మాణం 1956 ప్రాంతంలో జరిగింది. కనుక ఈ పుస్తకాల ప్రస్తావనతో ‘మాయాబజారు’ నాటి సంగతులతో సంబంధమే లేదు. మిగిలిన ఒక్క పుస్తకం 1928 నాటికే ప్రచురించబడి పండితులకు పరిచయమై ఉన్న ‘శశిరేఖాపరిణయం’ పుస్తకమే. కనుక, ఇందులోని సంగతులతో ‘మాయాబజారు’ సినిమాకు సంబంధం లేకుండా జరిగిందని అనుకోలేం. ఏ కారణం చేతనో ఇప్పటిదాకా ఎవరిచేతా ప్రస్తావించబడ లేదు.
‘శశిరేఖాపరిణయము’ లోని ఒక్క ముఖ్యమైన, హాస్య సందర్భంలోని పద్యాన్ని ఉదాహరించి ఈ వ్యాసం ముగి స్తాను. మాయాశశిరేఖ, పెళ్ళికొడుకైన లక్ష్మణకుమారుడు పెళ్ళిపీటల మీద కూర్చుని ఉన్నారు. ఇద్దరి మద్య అడ్డుగా ఉన్న తెరను పురోహితులు అప్పుడే, ఒకరి ముఖం వొకరు చూసుకోవడానికి వీలుగా, కొద్దిగా వంచారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లక్ష్మణకుమారునికి మాయాశశిరేఖ ఈ విధంగా కనిపడిందట:
చూడ లక్ష్మణున కాసుదతి
కుందేలుగా గంతులువైచుచుఁ గానఁబడియె
వెంబడి నతఁ డాత్మ వెఱగంది చూడఁగా
పిండి బొక్కుచు గండుపిల్లియయ్యె
వగచుచుఁ దెరవంచి వాఁడు వీక్షింపఁగాఁ
గొక్కరింపుచు పండుక్రోఁతియయ్యె
నిది చిత్రమని యెంచి పదిలంబుగాఁ జూడ
రోమముల్ పెరిగి భల్లూకమయ్యె
(శశిరేఖాపరిణయము, తృతీయాశ్వాసం, 178 పద్యం)
ఉత్సుకతతో, వంచిన తెరమీద నుంచి చూసిన లక్ష్మణ కుమారునికి పెళ్ళికూతురు మొదట కుందేలులా గంతులు వేస్తూ కనపడిందట. ఇందేంటబ్బా అని కాస్త కంగారుపడి చూసేసరికి పిండి బొక్కుతూ గండు పిల్లిలా కనపడిందట. ఇదేంట్రాబాబూ అని మరికాస్త కంగారు పడుతూ చూడగానే, కొక్కిరిస్తూన్న పండుకోతి ప్రత్యక్షమైందట. ఏమిటీ విచిత్రం అని ఆలోచిస్తూ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూద్దామని చూడగానే, ఒంటినిండా వెంట్రుకలన్నీ దట్టంగా పెరిగున్న భల్లూకం భయపెట్టిందట.
సినిమాలో తీసినదాని కంటె ఈ పద్యంలో అప్పప్పకవి వర్ణించినది రెండాకులు ఎక్కవేనని అర్థమవుతుంది కదా! ఇదే కాదు, ఆ తరువాత సినిమాలో కనుపించే లక్ష్మణ కుమారుని అవస్థలు, అతడిని సమాధానపరచడానికి కౌరవ పెద్దలు పడిన పాట్లు, చివరకు పెళ్ళి మండపం నిండా పాములు పరుగులు పెట్టి అందరినీ భయ భ్రాంతులకు లోనుచేసి, అంతటినీ రసాభాస చేయడం... ఈ మొత్తం, అప్పప్పకవి ‘మాయా బజారు’ సినిమాను వందేళ్ళక్రితమే చూస్తూ పద్యాలుగా వ్రాశాడా అన్న ట్లుగా ఉంటుంది ‘శశిరేఖా పరిణయము’ చదువుతూ ఉంటే!
భట్టు వెంకటరావు
నద్దమునఁ దోఁచు లిబ్బి చెయ్యబ్బినట్లు,
విపినభూముల కేఁగిన విజయసూను
సురుచిరంబైన రూపంబుఁ జూడఁగలిగె
బుడమి నేఁ జేయు సుకృతంబుఁ బొగడవలదె.
(శశిరేఖాపరిణయము, తృతీయాశ్వాసం, 117 సీసము, తేటగీతి)
ఎవ్వరు ననుఁ దెచ్చి రివ్వన భూమికి నెంత పుణ్యాత్ములో యెంచిచూడ
మునినారదుని మాట ముంగొంగు మూటగాఁ దలంచి యాతని కేను దండమిడుదు
నతఁడు చెప్పినమాడ్కి నభిమన్యుఁ గనుఁగొంటి నానోము ఫలియించె నలినగర్భు
వ్రాఁత ధారుణియందు వ్యర్థంబు గా దను పలుకులు దప్పునే దలఁచి చూడ