నాతో నేను
ABN , First Publish Date - 2023-08-28T00:35:00+05:30 IST
జలపాతాల నీడల్లో దేన్నో వెతుక్కుంటూ వాళ్లు వాళ్ల మధ్య రాళ్లలో ఘనీభవించిన పురాజలపాతాల్లో మరిదేన్నో వెతుక్కుంటున్న...
జలపాతాల నీడల్లో దేన్నో వెతుక్కుంటూ వాళ్లు
వాళ్ల మధ్య రాళ్లలో
ఘనీభవించిన పురాజలపాతాల్లో
మరిదేన్నో వెతుక్కుంటున్న
నిన్ను వెతుక్కుంటూ నేను
మబ్బుల్ని వెలిగించే ఆ మెరుపుల్లో
నాకోసం ఉంటావనే అనుకున్నాను
లోయలో గాలి ఈలతో కలిసి నీకోసం నేను పాడేపాట
నీకు వినిపిస్తుందనే అనుకున్నాను
నేనెంత పలవరించినా నువ్వు ఇక రావని తెలుసుకున్నాను
కానైతే
ఇదొక తలకిందుల లోకమనీ, ఇక్కడేం బాగోలేదనీ, దీన్నంతా మార్చేయాలనీ
నువ్వు అన్న మాట మాత్రం నాలో ఇంకా తారట్లాడుతూనే ఉంది
వెతుక్కుంటావెందుకో
ఆకాశాన్ని ఊపేసే మబ్బుల సందోహంలోనో
సముద్ర గర్భంలోకి ఉరకలెత్తే సుడిగుండాల్లోనో
నాకోసం వెతుక్కుంటావెందుకో
రాజ్యం అల్లిన వ్యూహంలోకి
అమాయకంగానో లేక వ్యూహాత్మకంగానో
వెళ్లిపోయి, ఇక
బయటకు రాలేకనో, రావద్దనుకునో
అందులోనే ఉండిపోయిన నీ పలవరింపులు
నన్ను కదిలిస్తాయని అనుకుంటున్నావెందుకో
నేను ఎక్కడెక్కడో లేను
నువ్వు వదిలి వెళ్లిన ఈ ఎర్రమన్నులోనే ఉన్నాను
పచ్చని తంగేడుపువ్వుల సాక్షిగా
ఆ మట్టికి నువ్వూనేను కలిసి చేసిన బాసలోనే ఉన్నాను
ఉంటాను ఇక్కడే
వ్యూహాలూ పలవరింపులూ విదిల్చుకుని
నువ్వు వచ్చేదాకా
ఉంటాను ఇక్కడే
కొడిదెల మమత