Jayanta Mahapatra: జయంత మహాపాత్రతో జ్ఞాపకాలు
ABN , First Publish Date - 2023-09-04T03:03:21+05:30 IST
ఇంగ్లీషులో ఆర్ద్రమైన కవిత్వం రాసి మెప్పించిన జయంత మహాపాత్ర ఇక లేడు. 95 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఒడియాలో ఇంగ్లీషులో రచనలు చేసిన జయంత కటక్‌లో తుదిశ్వాస విడిచాడు. ఆయనతో 1985లో మొదలైన నా పరిచయం ఆ తర్వాత స్నేహంగా కొనసాగింది.
ఇంగ్లీషులో ఆర్ద్రమైన కవిత్వం రాసి మెప్పించిన జయంత మహాపాత్ర ఇక లేడు. 95 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఒడియాలో ఇంగ్లీషులో రచనలు చేసిన జయంత కటక్‌లో తుదిశ్వాస విడిచాడు. ఆయనతో 1985లో మొదలైన నా పరిచయం ఆ తర్వాత స్నేహంగా కొనసాగింది. ముఖ్యంగా మైసూర్‌లోని ‘ధ్వన్యాలోక’ సాహిత్య సంస్థలో మేము నెల రోజులపాటు గడిపిన ఆనాటి సాహిత్యానుభవాన్ని మరచిపోలేను. ప్రొ. సి.డి. నర్సిహ్మయ్యగారు (కామన్‌వెల్త్ లిటరేచర్) నిర్వహించిన ‘ధ్వన్యాలోక’లో నేను, జయంత మహాపాత్ర (ఇండో ఇంగ్లీషు), వినయ చంద్రన్ (మళయాళీ కవి), మహ్మద్ ఇలియాస్ (కేరళ యూనివర్సిటీ)తో పాటు మరో ఇద్దరు ‘ఫెల్లోషిప్’ కింద అక్కడ రచనలు చేశాము. అక్కడ ఆయా సందర్భాల్లో జరిగిన సెమినార్లలో భైరప్ప (కన్నడ నవలా రచయిత). ప్రొ. అనంతమూర్తి తదితరులు వచ్చి పాల్గొనేవారు.
జయంత వృత్తిరీత్యా భౌతిక శాస్త్రం బోధించినా, ప్రవృత్తి రీత్యా కవిగా జీవించినవాడు. సున్నిత మనస్కుడు, మృదుభాషి, ఎంతో స్నేహశీలి- ధ్వన్యాలోకలో గడిపిన నెల రోజుల్లో మా మధ్య భారతీయ భాషల్లో వచ్చిన కవిత్వం గురించి చర్చలు జరిగేవి. సాయంత్రాలు మేమంతా యూనివర్సిటీ పరిసరాల నుంచి బయలుదేరి మైసూరు పట్నంలో సరదాగా కబుర్లు చెబుతూ తిరిగేవాళ్ళం- మైసూర్ యూనివర్సిటీలోని తెలుగు ప్రొఫెసర్ ఆర్వీయస్ సుందరం మాకు తోడుగా వచ్చి కెఫెలో స్నేహాన్ని పంచి ఇచ్చాడు. సుందరంగారు కొంతకాలం ద్రవిడ యూనివర్సిటీలో కూడా బోధించారు.
జయంత మహాపాత్ర స్వయంగా ‘చంద్రభాగ’ అనే ఇంగ్లీషు త్రైమాసిక పత్రికకు సంపాదకత్వం వహించి కటక్ నుంచి ప్రచురించేవాడు. ఒడిస్సాలోని చంద్రభాగ నదికి గుర్తుగా వెలువడిన ఆ పత్రికలో నా కవితల ఇంగ్లీషు అనువాదాలు, మరికొందరు తెలుగు కవులను ప్రచురించాడు.
1988లో సంబల్‌పూర్‌లో జరిగిన ఒక సాహిత్య సదస్సుకు జయంత అధ్యక్షత వహించిన సందర్భం- వర్ణమాల. ఒడిస్సా సిమెంట్స్ సారథ్యంలో ఈ అఖిల భారత కవితా గోష్టిని నిర్వహించారు. రౌర్‌కెల్లా ప్రాజెక్టు పై వున్న ఒక అతిథి గృహంలో సాగిన చర్చా గోష్టిలో ‘కవిత్వంలో మేధస్సు - హృదయానికున్న సంబంధం’పై నేను ఒక పేపర్ చదివాను. ఆ సదస్సులో ఆనాడు శేషేంద్రశర్మగారు, నబనీతాసేన్, ప్రొ. ఎస్.కె. కుమార్, కన్నడ కవి రామాచంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఒడియా మహాకవి మెహర్ స్మృతిలో సంబల్‌పూర్ ఆకాశవాణి ఏర్పాటు చేసినట్టు గుర్తు.
జయంతతో వున్న నా స్నేహానికి గుర్తుగా 1986లో ఆయన ఇంగ్లీష్ కవితకు నేను చేసిన ఈ అనువాదాన్ని సమర్పిస్తున్నాను:
ఉలిక్కి పడిన సూర్యుడు
పచ్చిక బయళ్ళలో
కామతృష్ణతో రగుల్కొనే మంట
స్వరంలో పెనంలా మండే నిరర్థక క్రోధం
ద్వేషంలో మూసుకున్న మెదడు కిటికీలు
లోయల లోతుల్లో నిలుచున్న చెట్లు
విషవాయువులతో మసి బారినపుడు
ఒకనాడు అహంకరించిన గాలి
స్తంభించి పోయిందిపుడు వీచే బలం లేక!
వణికే ఉదయతార విషాదంలో
విస్తరించిన వంచనా నగరపు ఉపరితలం
ప్రాచీన బృహత్ శిలాఖండాలకోసం మొగంవాచిన దేశం
అమ్మాయిలిక్కడ వెచ్చవెచ్చని రక్తస్పర్శ స్వరాలతో
ఆడాళ్ళు పాలిపోయిన వెన్నెల్లో
రాత్రివేటలో దాహాన్ని విరబోసుకుంటున్నవాళ్ళు
జబ్బుపడిన నాలుకపై పొగ రుచి
అప్పుడప్పుడు సోషలిజం వీధికుక్క
శోకిస్తున్నది పడుకున్న కోట్లాది కలలపై
పిల్లలేమో పోరాడుతున్నారు గడచిన వేసవితో!
ఇండియా భారానికి వంగిపోయిన యువ కమ్యూనిస్టుల్లా
కళ్ళపై చల్లారిన నిప్పులపై ఉలిక్కిపడిన సూర్యుడు!
నిఖిలేశ్వర్
- 91778 81201