Share News

ఆలీవ్‌ ఆకుల మీద వలస బిందువులు

ABN , First Publish Date - 2023-10-23T01:42:36+05:30 IST

మనిద్దరి కన్నీళ్లను కలిపికుట్టి వంతెన నిర్మించగలమా చెమటచుక్కలతో ఈ నేలను చదును చేయగలమా ఎప్పుడైనా రాకెట్‌ విధ్వంసం నీకైనా నాకైనా రక్తాన్ని చిందించేదే అయినప్పుడు...

ఆలీవ్‌ ఆకుల మీద వలస బిందువులు

మనిద్దరి కన్నీళ్లను కలిపికుట్టి వంతెన నిర్మించగలమా

చెమటచుక్కలతో ఈ నేలను చదును చేయగలమా ఎప్పుడైనా

రాకెట్‌ విధ్వంసం నీకైనా నాకైనా రక్తాన్ని చిందించేదే అయినప్పుడు

మా పసిపిల్లల కండ్లల్లో నిల్చిన విస్ఫోటన దృశ్యాల్ని నువ్వు సులభంగా తుడిచేయగలవా

కూలిన పాఠశాల మధ్యనే తిరుగుతున్న ఆ చిగురంత మెదళ్ళ చిన్ని స్పర్శని మనసుతోనైనా

తాకగలవా

అలలను చూస్తూ నువ్వు హాయిగా గడిపేయొచ్చు

మాకైతే ఆ అలల మీద రెక్కలు విప్పుకొని వచ్చిన రాకెట్‌ గద్దలే గుర్తుకొస్తాయి

నిరాకారుడైన దేవుడికోసం

మనుషులు మాంసం ముద్దలై వెదజల్లబడుతున్నప్పుడు

ఆవలి వైపు పండుగల్లో నువ్వు నిషా మత్తులో తూలుతుంటే

మేము ముక్కలైన ఆడవాళ్ల దేహాల్ని రెండు చేతుల్లో మోస్తున్నాము

తప్పిపోయిన వాళ్ళకోసం వెతుకుతూనే ఉన్నాం

ప్రతి సందర్భం ఒక చరిత్రపేజీని వెనక్కి తిప్పుతుంది

వలసపోయిన వారి ఆనవాళ్లు ఇసుకలో

కనుమరుగవుతున్నాయి

దేశం పేరు చెప్పలేక పెదవులు తడబడతున్నవి

ఎక్కడో ఉండి స్వంత నేల సువాసనని ఆఘ్రాణించడం ఎంత విషాదమో మీకు తెలుసా

శవాల దిబ్బల మధ్య తలవంచుకున్న సూర్యున్ని

ఎప్పుడైనా చూసారా మీరు

తలలేని నేలలో జీవిస్తున్న మనుషులం

తరాలని కాపాడుకోవడానికి ఒంటిమీద

దట్టమైన అడవిని నాటుకున్నాం

ఇప్పటికీ నీడొక చోట మేమొక చోట కదులుతున్నాం

యుద్ధంలో మొదటి పాదం మీదే

ఆయుధాల మొనలతో మా ఆకలి కడుపుల్ని

ఎన్నిసార్లు గాయపర్చలేదు

ఈ మట్టిమీద ఎన్నడూ నీడ లేని వాడా

తప్పిపోయిన మనుషుల్ని దేవులాడుకోవడం అంటే

తుంపర సేద్యమంత సులభం కాదు

నీకు నచ్చిన కంప్యూటర్లలోకి దూరిపోయే వైరస్‌ అంతకన్నా కాదు

మృదువైన ఆలీవ్‌ ఆకుల మీద సేదతీరిన

మంచుబిందువుల్లాంటి మనుషులు

ఇప్పుడు ఏ భవనం శిథిలాల కింద ఎలా నలిగిపోయారో తెలుసునా

మాకు నిత్యం కళ్ళల్లో రక్తంలా ప్రవహించే దృశ్యనదులే కనిపిస్తాయి

మీరు మట్టిని మట్టిలానే చూడకండి

లోపట మా ప్రాణాలని పాతిపెట్టాము

పూర్వీకుల కలల్ని రాబోయే మనుషుల కోసం

విత్తనాలు చేసుకొని దాచిపెట్టుకున్నాం

వేముగంటి మురళి

96765 98465

Updated Date - 2023-10-23T01:42:46+05:30 IST