నమన్తి విబుధా జనాః
ABN , First Publish Date - 2023-10-16T01:48:49+05:30 IST
పద్దెనిమిదవ శతాబ్దాంతానికి ఆంగ్లేయుల జీవన విధానం ముందుకుతెచ్చి చూపించిన కొత్తదనపు అనుభవంతో దేశీయ పద్ధతులలో జీవనం, విద్యావిధానపు కొనసాగింపు ఒక ప్రశ్నార్థకంగా మారింది...
పద్దెనిమిదవ శతాబ్దాంతానికి ఆంగ్లేయుల జీవన విధానం ముందుకుతెచ్చి చూపించిన కొత్తదనపు అనుభవంతో దేశీయ పద్ధతులలో జీవనం, విద్యావిధానపు కొనసాగింపు ఒక ప్రశ్నార్థకంగా మారింది. శతాబ్దాలుగా పెంచి పోషించుకొంటూ వచ్చిన సాహిత్యం, అందులోని వర్ణనలూ, చెప్పబడుతూ వచ్చిన విలువలు ఆనాటి జీవన విధానానికి, ఆపై రాబోయే ముందు రోజుల జీవన విధానానికి ఏమైనా ప్రయోజనం కలిగించేవేనా- అన్న సందేహం అప్పటి విద్యావంతులలో కలగడం మొదలై, మొత్తంగా ఒక రకమైన స్తబ్ధత తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆరోజలలో నెలకొంది.
పూర్వ సాహిత్యాన్ని, ఆ సాహిత్యానికి సంబంధించిన సంగతులను, అది ప్రతిపాదించిన విలువలను, ఆనాటి నూతన పరిస్థితులలోని సంగతులతో బేరీజు వేసి, అవి అర్థం లేనివి గానో లేక నిష్ప్రయోజనమైనవి గానో నిర్ధారించి, ఆ సాహిత్యాన్ని పూర్తిగా వద్దనుకోవడం, వదిలేసుకోవడం తెలివితక్కువ పని అని తెసినవాడైన ఆంగ్లేయ ప్రభుత్వోద్యోగి సి.పి. బ్రౌను, తెలుగులో పూర్వ సాహిత్యాన్ని వెదికి పట్టుకుని పునరుద్ధరించే బృహత్కార్యక్రమాన్ని మొదలుపెట్టే దాకా (అంటే పందొమ్మిదవ శతాబ్దం తృతీయదశకం దాకా) ఆ స్తబ్ధత కొనసాగింది. ఈ బృహత్తర కార్యక్రమంలో బ్రౌనుకు అనాటి తెలుగు పండితులలో ఆరితేరినవారితో కూడిన ఒక పండిత మండలి తోడ్పడింది. ఆ రోజులలో తన స్వంత ఖర్చుపై దాదాపు ఇరవైమంది పండితులు తన వద్ద అవిశ్రాంతంగా పనిచేస్తుండేవారని బ్రౌను వ్రాసుకున్నాడు. ఆ పండిత మండలిలో ఇద్దరు వ్యక్తుల పేర్లు చాలా ప్రసిద్ధి కెక్కాయి. వారిలో మొదటి వ్యక్తి ములపాక బుచ్చయ్య శాస్త్రి. బ్రౌను ఈయనను తనకు తెలుగులో విద్యాగురువుగా పేర్కొన్నాడు. కడపజిల్లా నందలూరుకు చెందిన పండితుడు ఈ బుచ్చయ్య శాస్త్రి. రామరాజ భూషణుని వసుచరిత్రకు మొదటలో వ్యాఖ్యానం ఈయన చేతనే బ్రౌను వ్రాయించాడు. భారతం, భాగవతం, అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతి కథాకావ్యం పరిష్కరణలో బ్రౌనుకు బుచ్చయ్య శాస్త్రి తోడ్పడ్డాడు. ఇంతటి ప్రతిభావంతుడైన బుచ్చయ్య శాస్త్రి తాను రచించిన ‘సుందరేశ్వర శతకము’లో (ఈ శతకం ముద్రించబడినట్లుగా కనపడదు. దీని ప్రతి చెన్నై, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో వుంది) తన పాండిత్యాన్ని గురించి, కవితా ప్రజ్ఞను గురించి ఎంత వినయంగా వ్రాసుకున్నాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది:
బొమ్మల యిండ్లు గట్టుకొని పొంగెడు పిల్లలజూచి వాస్తు శా
స్త్రమ్ము కొఱంతయిందనగ రాదెట బెద్దలు నట్ల నాదు కా
వ్యమ్ములు విన్న సత్కవులు నాదర మొప్పగ మెచ్చి కొంద్రుగా
నిమ్మహివాని వెల్తిమది నెంచరు నిక్కము సుందరేశ్వరా!
‘‘(ఇసుకలో) బొమ్మ ఇళ్ళు కట్టుకొని పరమానందంలో తేలియాడుతూ ఆడుకునే చిన్నారులను చూసి, తమకు ఉన్న వాస్తు జ్ఞానంతో ఆ ఇళ్ళ నిర్మాణాన్ని పరీక్షించి వాటిల్లో లోపాలను ఎత్తి చూపడం విజ్ఞులైన పెద్దలకు తగినపనేనా? కాదుగదా! అలాగే నా కావ్యాలలోని విషయాలను విన్న సత్కవులైన పెద్దలు, ఈ విద్యలో పిన్నవాడినైన నాపై దయతో, ఆదరంతో, అందులోని మంచి విషయాలను స్వీకరిస్తారు తప్ప, చిన్న చిన్న లోపాలను పట్టించుకోరు. ఇది నిజం’’ అని ఈ పద్యం భావం. సి.పి. బ్రౌను అంతటి వాని చేతనే గౌరవంగా, ఆప్యాయంగా ‘‘బుచ్చన్నా’’ అని పిలిపించుకున్న ములపాక బుచ్చయ్యశాస్త్రి, తెలుగు సాహిత్యంపై తనకు ఉన్న జ్ఞానాన్ని, తన కవితా ప్రతిభను చిన్న పిల్లల ఆటతో పోల్చుకుని, తన పాండిత్యం ఆపాటిది మాత్రమే అని వినమ్రంగా చెప్పుకున్నాడు. ఇంతటి ఉన్నతమైన ఆయన వ్యక్తిత్వాన్ని తెలియపరిచే ఈ పద్యం ఇప్పటిదాకా, సామాన్య పాఠకుల సంగతిని అలా ఉంచితే, ఇప్పటి పండిత వర్గంలో కూడా ఎంతమందికి తెలుసో సందేహమే!
అదలా వుంచి, పైన పేర్కొన్న ఇద్దరిలో రెండవ వ్యక్తి జూలూరి అప్పయ్య శాస్త్రి విషయానికొస్తే, రామరాజభూషణుని ‘వసుచరిత్ర’కు బుచ్చయ్య శాస్త్రి వ్రాసిన వ్యాఖ్య బాగా కఠినంగా (ప్రౌఢంగా) ఉన్నదిగా అనిపించిందట బ్రౌనుకు. ఆ వ్యాఖ్యను తాత్కాలికంగా పక్కనపెట్టి, కొంచెం సరళమైన వ్యాఖ్యానం వ్రాయిస్తే బాగుంటుందనిపించి, ఆ పనిని జూలూరి అప్పయ్యశాస్త్రికి అప్పగించాడు. అలా అప్పగించిన పనిని బ్రౌను అనుకున్న విధంగా పూర్తి చేసి చూపెట్టాడు అప్పయ్యశాస్త్రి.
ఇప్పటి ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామానికి (ఆ గ్రామంలో నాయునిపల్లి ప్రాంతానికి అని బ్రౌను సూచించాడు) చెందినవాడైన అప్పయ్య శాస్త్రి తెలుగులో ప్రాచీన గ్రంథాలకు సరళమైన భాషలో వ్యాఖ్యానాలు వ్రాయడంలో మంచి నేర్పుకలవాడు. మను, వసు చరిత్రల వంటి ప్రాచీన తెలుగు కావ్యాలలోని పద్యాల భావాన్ని సామాన్య పాఠకుడు సైతం అర్థంచేసుకోవడానికి ఉపకరించే టీక, సరళ వ్యాఖ్యానాల రచనకు ఆయన పెట్టిన ఒరవడి ఆ తరువాత తరం టీకాకారులకు వ్యాఖ్యానకర్తలకు మార్గదర్శకమయింది. శ్రీనివాసతారావళి, రామపంచాశత్కందపద్య స్తోత్రం, యదువంశభూషణ శతకం ఈయన వ్రాసిన గ్రంథాలు. ఈ మూడు గ్రంథాలు 1893-94 ప్రాంతంలో ముద్రితమైనట్లుగా 1894 సంవత్సరపు ఫిబ్రవరి నెల ‘ముద్రిత గ్రంథ చింతామణి’లో వచ్చిన అరపేజీ రివ్యూ వలన తెలుస్తుంది. యదువంశభూషణశతకంలోని ఈ క్రింది పద్యంలో, ఆతని దృష్టిలో సాహిత్య సంబంధ విషయాలపై తనకున్న పరిమితమైన జ్ఞానాన్ని గురించి ఇలా చెప్పుకున్నాడు.
తలపగ సాహితీ చతురతా లవలేశము లేదు లక్షణం
బుల తెఱగెట్టిదో తెలియబోలదు పూర్వకవిప్రయోగ వా
గ్విలసనమా యెఱుంగను గవిత్వము జెప్పగబూనినాడ న
న్నెలమి గృతార్థు జేయదగు గృష్ణహరీ యదువంశభూషణా!
కవితా చతురత కొంచెమైనా లేదట; సాహిత్య లక్షణాలను గురించి, పూర్వ కవి ప్రయోగాలను గురించి తెలియనే తెలియదట; అయినా కవిత్వం చెప్పబూనుకున్నాడు కాబట్టి దయతో అందులో తనను ‘కృతార్థుడను చేసే భారం నీదే సుమా!’ అని యదువంశ భూషణుడైన శ్రీకృష్ణునితో మొరపెట్టుకున్నాడు. తన ప్రతిభను గురించి ఇంత తక్కువ చేసి చెప్పుకున్న అప్పయ్య శాస్త్రిని గురించి బ్రౌను ఏమని వ్రాసుకున్నాడో చదివితే, అప్పయ్య శాస్త్రి వినయ శీలత ఎంతటిదో మనకు అర్థమవుతుంది. ‘‘ఇరవై ఏళ్ళకు పైగానే జూలూరి అప్పయ్య పండితుడు తెలుగులో ఆనాటి ఉద్దండ పండితులలో మేటిగా గౌరవించబడుతూ వచ్చాడు. అతనికున్న ఓర్పు, వినయం, విచక్షణతో కూడుకున్న జ్ఞానం ఆయనకు ఆ గౌరవం అడగకనే దక్కేలా చేశాయి’’ అన్నది అప్పయ్య శాస్త్రి గురించి టూకీగా బ్రౌను అభిప్రాయం.
అలా తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకూ ఆనాటికి అత్యున్నత స్థాయి పాండిత్యం కలిగినవారుగా ప్రశంసించబడిన ఇద్దరు పండితులూ తమను గురించి తాము మాత్రం వారి ప్రతిభ లవలేశమే తప్ప విశేషమైనది కాదని చెప్పుకోవడం విశేషం. అదేకాక వారిరువురూ సమకాలికులై సి.పి. బ్రౌనుతో సంబంధం కలవారై ఉండడం మరో విశేషం.
‘‘నమన్తి ఫలితా వృక్షాః, నమన్తి విబుధాజనాః’’ అని సంస్కృత లోకోక్తి. ‘‘పండ్ల బరువుపెరిగే కొలదీ ఆ పండ్లను పండించిన చెట్టు కొమ్మలు నేల వైపుకే వంగినట్లుగా, సమృద్ధమైన జ్ఞానంతో వృద్ధుడైన వ్యక్తి శిరస్సూ, చూపులూ కూడా నేల వైపుకే చూస్తాయి’’ అని ఆ మాటల అర్థం. ఎందుకలా జరుగుతుంది? అనే మాటకు కారణం ఇది అని స్పష్టంగా చెప్పలేం కాని, కాస్త ఆలోచిస్తే, వృద్ధి చెందుతున్న జ్ఞానం వ్యక్తి చేతనలో ఒక అర్థంకాని బరువును నింపుతుందేమో అన్న సందేహం మాత్రం కలుగక మానదు. ఏమైనా, తెలుగు సాహిత్య సముద్ధరణ యజ్ఞంలో సి.పి. బ్రౌనుకు చేదోడువాదోడుగా నిలిచి శ్రమించిన ఈ ఇరువురు పండితుల వినమ్ర వ్యక్తిత్వాలను తెలియజేసే ఈ రెండు పద్యాలు ‘చెన్నై, ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారపు’ వ్రాత ప్రతుల లోనే ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా, ఎవరి చేతనూ తగువిధమైన వివరణలతో ఉటంకింపబడకుండా పడి వుండడం మాత్రం తెలుగు సాహిత్యానికి వారు చేసిన సేవకు సరితూగే గుర్తింపుగా అనిపించదు.
భట్టు వెంకటరావు