తొమ్మిదేళ్లు – తొమ్మిది చారిత్రాత్మక నిర్ణయాలు

ABN , First Publish Date - 2023-06-01T02:02:36+05:30 IST

2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ అప్రతిహతమైన విజయం సాధించి నేటికి తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకుంది....

తొమ్మిదేళ్లు – తొమ్మిది చారిత్రాత్మక నిర్ణయాలు

ఈ తొమ్మిదేళ్లలో సుపరిపాలన,ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంక్షేమాన్ని అందించేందుకు ఒక దృఢమైన విధానంతో కూడిన అనేక ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలను మోదీ తీసుకున్నారు. వాటిలో ప్రధానంగా తొమ్మిది చారిత్రాత్మక నిర్ణయాలు దేశ భవిష్యత్తును రూపొందించాయి.

2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ అప్రతిహతమైన విజయం సాధించి నేటికి తొమ్మిది ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిదేళ్లలో సుపరిపాలన, ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంక్షేమాన్ని అందించేందుకు ఒక దృఢమైన విధానంతో కూడిన అనేక ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలను మోదీ తీసుకున్నారు. ఈ నిర్ణయాలు ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలను, వ్యాపార వర్గాలను లక్ష్యంగా చేసుకున్నవి. ఈ నిర్ణయాలు భారతదేశ రాజకీయ దృశ్యంపై పరివర్తన ప్రభావాన్ని తీసుకువచ్చాయి, దేశ భవిష్యత్తును రూపొందించాయి.

మోదీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ వివరించటానికి ఈ వ్యాసం పరిధి సరిపోదు. కనుక ప్రధానంగా తొమ్మిది చారిత్రక నిర్ణయాల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. వాటిలో ప్రధానమైనది ఆర్టికల్ 370 రద్దు. మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ఏర్పాటు చేసింది. ఈ చర్యతో కశ్మీర్ అభివృద్ధికి బాటలు వేసినట్టయింది. నేడు కాశ్మీర్ ప్రజల జీవితాల్లో సంతోషాలు చూడగలుగుతున్నాం. మోదీ చారిత్రక నిర్ణయాలలో మరొకటి 2019లో పౌరసత్వ సవరణ చట్టం. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలో హింసించబడిన ముస్లిమేతర మైనారిటీలకు భారతీయ పౌరసత్వం మంజూరు చేయడానికి అనుమతించే సవరణ చట్టం ద్వారా గత ఐదేళ్లలో 4,844 మంది విదేశీయులకు భారత పౌరసత్వం మంజూరు చేయడం జరిగింది. అలాగే ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు. 2019లో ప్రవేశపెట్టబడిన, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గతంలో ఉన్న రిజర్వేషన్ విధానాల పరిధిలోకి రాని సమాజంలోని పేదలకు అవకాశాలను అందిస్తుంది. ఈ చొరవ కింద, విద్యాసంస్థలలో నిర్దిష్ట శాతం సీట్లు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వేలాదిమందికి అవకాశాలు వచ్చాయి. అలాగే ‘భారత్‌మాల పరియోజన’ కింద గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ రహదారులకు కొత్త రూపును తీసుకువచ్చారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 49,903 కి.మీ. జాతీయ రహదారులను నిర్మించింది. అంటే మోదీ పాలనలో జాతీయ రహదారులు రోజుకు 17.1కి.మీ. నిర్మాణం జరిగిందన్నమాట. మరో నిర్ణయం ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ సంకటం నుంచి విముక్తి కల్పించటం. ట్రిపుల్ తలాక్ చట్టం(వివాహ హక్కుల పరిరక్షణ) 2019 జూలైలో పార్లమెంటులో ఆమోదం పొందింది. దాంతో తలాక్ పేరుతో తక్షణ విడాకులు తీసుకునే ముస్లిం పురుషులకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ చట్టం ముస్లిం మహిళలకు ఒక వరంలా మారింది. అలాగే ‘ఒకే దేశం ఒకే పన్ను’ నినాదంతో మొదలైన ‘వస్తు సేవల పన్ను’ (జీఎస్‌టీ)తో కేంద్ర, రాష్ట్ర పన్నులు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2020లో బ్యాంకుల విలీనంతో జాతీయ స్థాయిలో ఏడు పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంకులను సృష్టించటం మరో కీలక నిర్ణయం. ఇది గ్లోబల్ బ్యాంక్‌లతో పోల్చదగిన స్థాయిని సాధించడంలో, ప్రపంచ పోటీతత్వాన్ని ఎదుర్కొని నిలవడంలో బ్యాంకులకు సహాయపడుతుంది. అలాగే ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన(పీఎం-జేఏవై)’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దేశంలో 10 కోట్ల పేద కుటుంబాలకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది. పైసా ఖర్చు లేకుండా దేశంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయినా లబ్ధిదారులు ఉచితంగా ఆరోగ్యసేవలను పొందవచ్చు. భారత జనాభాలో 40శాతం మంది ఈ స్కీమ్ కిందకు వస్తున్నారు. పైన ప్రస్తావించిన కీలక నిర్ణయాల్లో తొమ్మిదివ దానిగా మోదీ ప్రభుత్వం ద్వైపాక్షిక సంబంధాలపై పెట్టిన శ్రద్ధను కూడా ఎంచుకోవచ్చు. జూన్ 2014లో భూటాన్‌కు మోదీ మొదటి విదేశీ పర్యటన నుంచి, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్‌లతో, ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత విధంగా మెరుగుపడ్డాయి. కోవిడ్–19 మహమ్మారిపై ప్రపంచం పోరాడుతున్నప్పుడు మానవతా దృక్పథంతో ‘వ్యాక్సిన్ మైత్రి’ ప్రారంభించి అనేక మంది ప్రాణాలను కాపాడగలిగారు. ఈ విధానంతో భారతదేశం స్థితి మరింత పటిష్టపడింది. బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా నేడు భారత్ నిలిచింది. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారతదేశం ఐక్యరాజ్యసమితి, గ్రూప్ ఆఫ్ 20, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) మరియు షాంఘై సహకార సంస్థ వంటి బహుపాక్షిక ఫోరమ్‌లలో కూడా చురుకుగా పాల్గొంది. ఉగ్రవాదం మరియు వాతావరణ మార్పు వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించడంపై ఉద్ఘాటించారు. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, నేపాల్ మరియు భూటాన్ వంటి పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చి, దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్), బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ వంటి ప్రాంతీయ వేదికలలో క్రియాశీల పాత్ర పోషించారు. ఇటీవల, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రధాని మోదీని ‘బాస్’గా అభివర్ణించగా, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తనకు భారత ప్రధాని ‘ఆటోగ్రాఫ్’ కావాలని అన్నారు. ఇలా మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట మరింత పెరుగుతున్నది. రాబోయే కొద్ది సంవత్సరాలలో జర్మనీని అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికీ భారతదేశం సిద్ధంగా ఉంది.

2014 నుంచి పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రధానిగా మోదీ పాలనలోనూ తనదైన ముద్ర వేశారు. అవినీతికి తావులేని, భారతాన్ని ఆవిష్కరించారు దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌, స్కిల్ ఇండియా మిషన్, మేక్ ఇన్ ఇండియా, స్వయం–విశ్వాస భారత్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూనే ఉంది. 21వ శతాబ్దపు భారతదేశం ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేక్ ఇన్ ఇండియా’ కలలతో ముందుకు సాగుతోంది. జన్ ధన్ యోజన ద్వారా ప్రత్యక్ష న‌గ‌దు బ‌దిలీ, కోవిడ్‌–19 ఆర్థిక స‌హాయం, పిఎం కిసాన్‌, ఎంజిఎన్ ఆర్ఇజిఏ, జీవిత‌ బీమా, ఆరోగ్య బీమా క‌వ‌రేజి... ఇలా అన్నీ సాధ్యమయ్యాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఆర్థికంగా భరోసా కల్పిస్తూ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న వ్యాపారులకు గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు రుణం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉజాలా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్మార్ట్ సిటీ, సేతు భారతం యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్, అగ్నిపథ్ పథకం, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, భేటీ బచావో భేటీ పడావో, ఇలా ఎన్నో పథకాలతో మోదీ సుపరిపాలనను అందించారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరిగేలా చేశారు.

- డాక్టర్ కె. లక్ష్మణ్

రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు

Updated Date - 2023-06-01T02:02:36+05:30 IST