పోరుజెండా
ABN , First Publish Date - 2023-08-28T00:31:52+05:30 IST
ఈరోజు కాకపోతే రేపు రెక్కలు తొడుక్కున్న ఆకాశం ఎండజ్వరం సోకిన నేలతల్లికి చల్లని వానచెంగుని కప్పాక నిండా నీళ్ళేసుకున్న మట్టిచెట్టు మెతుకుపూల వనమై నవ్వుతుంది...
ఈరోజు కాకపోతే రేపు
రెక్కలు తొడుక్కున్న ఆకాశం
ఎండజ్వరం సోకిన నేలతల్లికి
చల్లని వానచెంగుని కప్పాక
నిండా నీళ్ళేసుకున్న మట్టిచెట్టు
మెతుకుపూల వనమై నవ్వుతుంది
దీపాల దుప్పటి కప్పుకున్న
చిక్కని చీకటి దేహాలన్నీ
ఒళ్ళు విరుస్తూ కళ్ళు తెరిస్తే
మరో కొత్తాకాశం దోసిళ్ళలో నిండి
బతుకుముఖాన్ని తేరిపారా కడిగి
ఆకలిగిన్నెలు నింపే చెమటపేగులను
పనిపాటుల వెంట నడిపిస్తుంది
తడిగాయమై తడిమే అవమానం
వాడినపువ్వై నేలరాలుతుంది
మోడువారిన మొండిదేహం మొత్తం
పక్షిపాటలోని తడితడి వాక్యంలా
పచ్చని కలలను మొలిపించి
చినుకు చిగురు తొడిగే మబ్బులా
పిడచకట్టిన రాతిగొంతుల్లో
గెలుపుగీతాలు పూయిస్తుంది
ఎక్కడ చూసినా ద్రోహపురాళ్ళు తగిలి
పగిలిపోయిన గాజుగుండెలే
కంటికొసల తుఫానులతో
ప్రతీ గుండెపెంకు
ప్రతీకార కాగడాను ఆర్పేసి
ప్రేమరంగునే కురిపిస్తోంది
సముద్రమంత హృదయానికి
ప్రణయదారం కట్టి
మళ్లీ గాలిపటంలా ఎగరేస్తుంది
రక్తపుగుడ్డల గూడును దాటి పుట్టే
ప్రతీ మాంసపు ముద్దా ఆశగా చిగురించి
బతుకుబండికి కట్టిన పోరుజెండాను
గుండెల నిండా రెపరెపలాడిస్తుంది.
మిరప మహేష్
99480 39026