Rayalaseema produced writer
ABN , First Publish Date - 2023-05-29T01:47:18+05:30 IST
మరణం ఒక్కటే..! కానీ అన్ని మరణాలూ ఒక్కటి కావు. సృష్టిలో ఎందరు మరణిస్తున్నా, ఒక రచయిత మరణించాడంటే ఉలిక్కిపడతాం...
మరణం ఒక్కటే..!
కానీ అన్ని మరణాలూ ఒక్కటి కావు.
సృష్టిలో ఎందరు మరణిస్తున్నా,
ఒక రచయిత మరణించాడంటే ఉలిక్కిపడతాం.
మనిషి భావావేశాల్ని,
స్వజాతి అభిమానం పరిపాలిస్తుందేమో..!
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
కేతు విశ్వనాథరెడ్డి మరణం,
రచయితల కులానికి దిగ్భ్రమ కలిగించేదే.
మనిషి దేశకాలాల మధ్య పుట్టిపెరుగుతాడు.
దేశకాలాల్ని,
దుమ్మూధూళిలా ఒంటికి పట్టించుకుంటాడు.
దేశకాలాల్ని,
తనదైన అస్తిత్వానికి హత్తుకుంటాడు.
రచయితా అంతే!
రచయిత సృష్టించే సాహిత్యమూ అంతే.
కేతు విశ్వనాథరెడ్డి జీవితమూ, సాహిత్యమూ...
రాయలసీమ స్థలకాలాల
ఇరుఒడ్లను ఒరుసుకుని ప్రవహించినాయి.
అందుకే అతడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య అన్నట్లు
రాయలసీమ ప్రాతినిధ్య రచయితగా మారినవాడు.
అనగనగా ఒక రాచపుండు ఉండేది.
అది తనకు భద్రమైన చోటు వెతుక్కోవాలనుకుంది.
అందుకోసం కరువుగా మారి, రాయలసీమను చేరుకుందంట!
రైతు వీపులు ఎక్కిందంట
మరో భగీరథుడు దిగివచ్చి,
పుండు మీద గంగను ప్రవహింపచేస్తే తప్ప
అది నయం కాదంట!
కానీ; అటువంటి పాలక భగీరథులకు ఈ నేల నోచుకోలేదు.
రాయలసీమ రాచపుండు మీద గంగ ప్రవహించలేదు.
ఇది పొడి నిజమా? నిష్టుర నిజమా?
ఈ స్థలకాలాల నిష్టుర వాతావరణమే
కేతు విశ్వనాథరెడ్డిని తన రచయితగా నిర్మించుకుంది.
అతడు ప్రాదేశిక అస్తిత్వంలో కలం ముంచి రాసిన --
గడ్డి కథేమి? కూలిన బురుజు కథేమి?
వాన కురిస్తే కథేమి? నమ్ముకున్న నేల మాటేమి?
ఈ రచయిత ‘దృష్టి’లో పడి రైతులు కథలుగా మారిపోయినారు.
వారి మాటలు పాత్రల సంభాషణలుగా మారిపోయినాయి.
కరువులు కథలుగా, రైతు గాథలుగా మారిపోయినాయి.
పల్లెటూళ్ల పరిసరాలు ఈ కథల్ని పీచువేర్లలా అల్లుకుని వుంటాయి.
మొత్తం పల్లె సమాజమే ఇతని చేతిలో
బృహత్ కథాసంహితగా మారింది.
కేతు సాహిత్యం రాయలసీమ మట్టిస్నానం అయ్యింది.
కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని గార్లు,
రాయలసీమ వ్యవసాయ కథకులకు దారి చూపిన దీపస్తంభాలు.
ఉత్తరాంధ్రలో కారా మేష్టారు చుట్టూ
ఆరాగా అల్లుకుని వుండేవారు రచయిత మిత్రులు.
బండి, రాసాని, పాలగిరి, సన్నపురెడ్డి... వంటి రచయితలు
కేతు హ్యాలో నుండీ స్ఫూర్తి పొందినవారు.
పల్లె సమాజంలో వస్తున్న పెనుమార్పులను
సామాజిక చలనాలుగా సూత్రబద్ధం చేసి,
కథల్లోకి ఒడిసిపట్టిన ఇంద్రజాలరి ఇతడు.
రాయలసీమ ఇట్ల వుంది,
రాయలసీమ ఎందుకు ఇట్లావుంది..?--
ఇవి రెండూ రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ
సాహిత్యాన్ని నడిపిస్తున్న రెండు సూత్రాలు.
సభా, గుత్తి రామకృష్ణ తర్వాత--
రాయలసీమ ఇట్ల వుంది అనే సూత్రంతో తెలుగు
కథాసాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మూడవ తరం
రచయితల్లో అగ్రగణ్యుడు కేతు విశ్వనాథరెడ్డి.
రాయలసీమ కరువు శోకాన్నీ, మానవ సంబంధాల
వెనుక ఆర్థిక మూలాల్నీ మార్క్సిజం దృష్టితో
అధ్యయనం చేసిన మేధావి ఇతడు.
రాయలసీమ భూమిక నుంచీ కథలు రావలసిన
అవసరాన్ని గుర్తించిన విమర్శకుడు రారా.
రారా ఆరా నుంచీ వచ్చిన కేతు విశ్వనాథరెడ్డి
రాయలసీమ అస్తిత్వ కథకు నమూనాగా మారడంలో
ఆశ్చర్యం ఏముంది?
పీడిత ప్రజలపక్షం వహించాల్సిన కమ్యూనిస్టులు
పీడిత కులాల పక్క నిలబడరా?
పీడిత జెండర్ వైపు నిలబడరా?
పీడిత ప్రాంత పక్షం చేరరా?
ఈ ప్రశ్నలు సౌకర్యంగా తప్పించుకుని,
విశ్వప్రేమికుల జాబితాలో దాక్కున్న
వీర మార్క్సిస్టులకు
కేతు ప్రాంతీయ అస్తిత్వం కనువిప్పు.
నాయనా... అని సంబోధించే కేతు విశ్వనాథరెడ్డి సార్!
గురువా! పెద్దాయనా!
జీవితం అర్థం చేసుకోవడం కోసం సాహిత్యం ఉందని
నమ్మినవాడా...
రంగసాయిపురం పోయినప్పుడల్లా ఊరిమట్టిని ఇంత
జేబులో పోసుకుని వచ్చి, కథను సృష్టించినవాడా...
చిన్నాపెద్దా తేడా లేని కథకుల పానగోష్ఠుల్ని
ఇంటలెక్చువల్ సర్కిల్‌గా వెలిగించినవాడా...
రాయలసీమ మట్టిలో పుట్టి,
ఈ నేల ఉప్పు తిని, ఈ నేల నీళ్లు తాగి,
ఈ నేల భూమిపుత్రులతో మమేకమై
ఆర్తితో అనుకంపనతో ఈ ప్రాంతపు కథలు
రాసినవాడా...
రాయలసీమ రుణం తీర్చుకున్న సాహిత్య చింతనాశీలీ..!
నీకు జోహార్లు... తుది వీడ్కోలు!
జై రాయలసీమ!
(పీ.ఎస్: పెద్దాయనా! రాయలసీమ నిన్ను ఓన్ చేసుకుంటుంది కానీ,
నిజానికి నీ సాహిత్యసృష్టికి బహు ముఖాలూ, బహు పార్శ్వాలూ!)
బండి నారాయణ స్వామి
88865 40990