వివాదాల వేడుక

ABN , First Publish Date - 2023-05-30T01:49:34+05:30 IST

కొత్తగా ఇల్లు కట్టుకుని, భారత పార్లమెంటు అందులోకి గృహప్రవేశం చేయడం దేశమంతటికీ ముఖ్యమైన ఉత్సవ సందర్భం. భావోద్వేగ అంశాలను ఏవేవో చెబుతున్నప్పటికీ, నూతన భవనం...

వివాదాల వేడుక

కొత్తగా ఇల్లు కట్టుకుని, భారత పార్లమెంటు అందులోకి గృహప్రవేశం చేయడం దేశమంతటికీ ముఖ్యమైన ఉత్సవ సందర్భం. భావోద్వేగ అంశాలను ఏవేవో చెబుతున్నప్పటికీ, నూతన భవనం రూపొందడానికి ప్రధాన కారణం వసతి సమస్యే. పార్లమెంటు సభ్యులకు అందరికీ కార్యాలయ స్థలాలు కల్పించడానికి ప్రస్తుత భవనం సరిపోకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన తరువాత పెరిగే ఉభయసభల సభ్యుల సంఖ్యకు అనుగుణమైన ఏర్పాట్ల కోసం ముందుచూపు, నూతన భవనాన్ని అవసరం చేశాయి. యుపిఎ ప్రభుత్వ కాలంలోనే నూతన భవన సముదాయాన్ని ప్రతిపాదించారు. ఎన్‌డిఎ-2 హయాంలో అది ఆచరణరూపం ధరించి త్వరితగతిన పూర్తి అయింది. పార్లమెంటు భవనంతో పాటు, కీలకమయిన కేంద్రప్రభుత్వ యంత్రాంగం అంతటికోసం కొత్తగా నిర్మిస్తున్న భవనాలను ‘సెంట్రల్ విస్టా’ అని పిలుస్తున్నారు.

భవనం నమూనా మీద, మునుపే ఆవిష్కరించిన మూడు సింహాల ప్రతిమ మీద, సుభాష్ చంద్రబోస్ విగ్రహం మీద ఆయా సందర్భాలలో అభ్యంతరాలు వెలువడ్డాయి, చర్చలు జరిగాయి కానీ, మొత్తంగా నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం వేళ మాత్రం అనేక వివాదాలు ముసురుకున్నాయి. ప్రారంభోత్సవ దినం సావర్కర్ జయంతి రోజు వచ్చేట్టుగా చూడడం, కార్యక్రమాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్వహించకపోవడం, చివరగా వచ్చినా మంచి రసవత్తర చర్చకు ఆస్కారమిచ్చిన ‘సెంగోల్’ ప్రతిష్ఠాపనం, అన్నీ విశేషాలే.

అన్ని కీలక ప్రభుత్వ సందర్భాలలోనూ తానే ప్రముఖంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ భావిస్తారన్న అభిప్రాయం ఉంది. ఆయన ఒక రోజులో ధరించే దుస్తుల సంఖ్య, ఫోటోల విషయంలో చూపించే ప్రత్యేక శ్రద్ధ గురించి విమర్శకులు, సమర్థకులు కూడా మాట్లాడుకుంటారు. ఇంత పెద్ద కార్యక్రమం తానే నడపాలని మోదీ అనుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రతిపక్ష రాష్ట్రాలలో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి నడుమ ఎడం ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికార బిజెపి అభ్యర్థిగానే పదవిలోకి వచ్చారు. ఆమెద్వారా ప్రారంభం జరిగితే పార్టీకి, ప్రభుత్వానికి, రాజ్యాంగానికి అంతటికీ గౌరవంగా ఉండేది. నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం జరిగినప్పటికీ, ఆ వేడుకలో ప్రతిపక్షం కూడా భాగమై ఉంటే బాగుండేది. కొన్ని మిత్ర, తటస్థ పక్షాలు తప్ప ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇటువంటి సందర్భాలలో పట్టువిడుపులకు ఆస్కారం ఉండేట్టుగా, అధికార ప్రతిపక్షాల మధ్య సంధాన కర్తలు ఉంటే బాగుండేది. ప్రధాని స్వయంగా విజ్ఞప్తి చేసి, ప్రతిపక్షాలను ఆహ్వానించి ఉంటే పెద్దరికంగా ఉండేది. అప్పటికీ, ప్రతిపక్షాలు మొండిగా ఉంటే ఆ అప్రదిష్ఠ వారికే దక్కేది.

ఈ వివాదాల కారణంగా కొంత అసంపూర్ణత కలిగినప్పటికీ, మోదీ కేంద్రంగా కార్యక్రమం బాగా జరిగింది. ప్రధాని సందేశం కూడా బాగున్నది. ఇటీవలి చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా ఇది గుర్తుండిపోతుంది. ఇదంతా జరుగుతూ ఉంటే, న్యాయం కావాలని మహిళా మల్లయోధురాళ్లు ఆ పక్కనే రోడ్డు మీద నిరసనలు తెలుపుతున్నారు, పోలీసులు వారిని ఈడ్చుకువెడుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటూ, చట్టం ముందు నిలబడవలసిన వ్యక్తి మాత్రం లోపల వేడుకలో భాగస్వామిగా ఉన్నారు.

ఇక సెంగోల్ ప్రతిష్ఠాపన ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యాలకు సంకేతంగా కనిపిస్తోంది. ఆ ధోరణిలో ఆలోచించేవారికి అది ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కూడా కలిగించి ఉండవచ్చు. ప్రతిపక్షం, రాష్ట్రపతి, రాజ్యాంగం వంటి ప్రస్తావనలు లేకుండా, మత వ్యవహర్తలు దేశ అత్యున్నత చట్టసభలో సంచరించడం ఆధునిక దృష్టి కలిగినవారికి ఏమంత సమంజసంగా కనిపించకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అధికార ప్రదాతలు. వలసవాదం నుంచి భారతప్రభుత్వానికి అధికార మార్పిడిని, యూనియన్ జాక్ జెండా అవనతమై మువ్వన్నెల జెండా ఎగరడం రూపంలో ఇంతకాలం పాటిస్తున్నాము. అధికారాన్ని అభిషేకించడానికి, దత్తం చేయడానికి మనం రాచరికంలో లేము. ప్రపంచంలోని ఇతర దేశాలు మన తీరును ఎట్లా భావిస్తాయో తెలియదు.

‘టెలిగ్రాఫ్’ పత్రిక ఆదివారం నాటి సన్నివేశాల కథనాన్ని ‘క్రీస్తుపూర్వం 2023’ అన్న ప్రధానశీర్షిక ద్వారా అందించింది. నిజానికి మొన్నమొన్నటి దాకా కూడా, మనం అంతగా వెనుకబడి లేము. ఇప్పుడు పనిగట్టుకుని వెనుకకు నడుస్తూ ఉంటే గనుక, ఆ తిరోగమనాన్ని సమీక్షించుకోవాలి.

Updated Date - 2023-05-30T01:49:34+05:30 IST