కూలుతున్న కుట్ర కేసు
ABN , First Publish Date - 2023-08-03T01:17:37+05:30 IST
బీమాకోరేగావ్ కేసులో ఐదేళ్ళుగా జైల్లో ఉంటున్న విద్యావేత్త వెర్నాన్ గొన్సాల్వెస్, సామాజిక కార్యకర్త అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది...
బీమాకోరేగావ్ కేసులో ఐదేళ్ళుగా జైల్లో ఉంటున్న విద్యావేత్త వెర్నాన్ గొన్సాల్వెస్, సామాజిక కార్యకర్త అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అతి తీవ్రమైన నిబంధనలున్న ఊపా కేసులో వీరికి బెయిల్ రావడమే విశేషమైతే, ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు మరింత ముఖ్యమైనవి. ఆరోపణలు తీవ్రమైనవని అంగీకరిస్తూనే, అవి అంత నమ్మదగ్గవిగా లేవన్న అభిప్రాయాన్ని న్యాయస్థానం గట్టిగానే వెలిబుచ్చింది. న్యాయమూర్తుల ప్రత్యక్ష, పరోక్ష వ్యాఖ్యలు కేసు విశ్వసనీయతనే ప్రశ్నించే రీతిలో ఉండటం గమనించదగ్గ పరిణామం.
ఆరోపణల్లో ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా, హేతుబద్ధత కనిపించినా ఈ చట్టంలోని సెక్షన్ 43డి (5) ప్రకారం న్యాయస్థానాలకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు. దీనికితోడు, సుప్రీంకోర్టు స్వయంగా 2019తీర్పులో, బెయిల్ మంజూరుచేసే దశలో న్యాయమూర్తులు సాక్ష్యాధారాల లోతుల్లోకి పోవాల్సిన అవసరం లేదని, కేసు సంభావ్యతను ఉపరితలంలో చూస్తే సరిపోతుందని ప్రకటించిన నేపథ్యంలో, వీరిద్దరికీ బెయిల్ ఇవ్వడాన్ని బట్టి ఈ కేసు బలాబలాల విషయంలో కోర్టుకు ఒక విస్పష్టమైన అభిప్రాయం ఉన్నదని అర్థం. వీరిద్దరికీ వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను బట్టిచూస్తే, వారిని నిరంతరం నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం లేదని న్యాయస్థానం ప్రకటించింది. నిందితులు కుట్రకు పాల్పడ్డారనేందుకు కానీ, మావోయిస్టులతో వారికి సంబంధాలున్నాయనడానికి కానీ ఎన్‌ఐఎ దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు లేవు. నిందితుల వద్ద దొరికిందంటున్న సమాచారం కూడా వారు నేరుగా రాసినది కాదు. వినికిడిమాటలు, మూడోపక్షం ముచ్చట్లతో అతి పేలవంగా, బలహీనంగా అల్లిన కుట్రకథ కనుకనే న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి సందేహించలేదు.
గతంలో వీరిద్దరి బెయిల్ దరఖాస్తులను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం, ముంబై హైకోర్టు తిరస్కరించడంతో, ఏడాది క్రితం సుప్రీంకోర్టు మెట్లెక్కితే జైల్లో ఉన్న ఐదేళ్ళకు వారికి బెయిల్ దక్కింది. పలుమార్లు బెయిల్ తిరస్కారంతో జైలు నిర్బంధంలోనే కన్నుమూసిన స్టాన్‌స్వామి విషయంలో, ఆయన మరణానంతరం ముంబైహైకోర్టు అద్భుతమైన వ్యక్తిగా, నిస్వార్థ సేవకుడిగా వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. మంచినీళ్ళగ్లాసు కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్న ఆయనకు కళ్ళజోడు ఇవ్వడానికీ, ఒక సిప్పర్ మంజూరు చేయడానికి కూడా ఆటంకాలు కల్పించి, సరైన వైద్యం దక్కకుండా చేసి చివరకు నిర్బంధంలోనే కన్నుమూసేట్టు చేశారు. కానీ, అదే ముంబైకోర్టుకు వీరిద్దరికీ బెయిల్ ఇవ్వడానికి మనసురాలేదు, కఠినమైన బెయిల్ నిబంధనలు భయపెట్టాయి. నిందితులు పదహారుమందికీ మావోయిస్టుపార్టీతో సంబంధాలున్నాయని, దానితో చేతులు కలిపి ప్రధానిని హత్యచేసేందుకు వీరంతా కుట్రపన్నారని పలు చిత్రవిచిత్రమైన ఆరోపణలన్నీ గుదిగుచ్చిన ఈ కేసు ఎంత కుట్రపూరితమైనదో అర్థమవుతూనే ఉంది. నిందితుల ఎలక్ట్రానిక్ పరికరాల్లో దొరికాయంటున్న సాక్ష్యాలు, మన పాలకులు రహస్యంగా కొన్నారంటున్న పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పోలీసులు అక్రమంగా ప్రవేశపెట్టినవేనని అమెరికన్ ఫోరెన్సిక్ సంస్థ ఆర్సెనెల్ సంస్థ తేల్చింది.
కేసు అంత తీవ్రమైనదే అయినప్పుడు ఇంకా విచారణదశకు ఎక్కకపోవడంలోనే పాలకుల దురుద్దేశం విస్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో సకాలంలో చార్జిషీటు దాఖలు చేయనందున సుధాభరద్వాజ్, వైద్యసంబంధ కారణలతో వరవరరావు బెయిల్ పొందితే, సరైన అభియోగం లేనందున ఆనంద్ తేల్తుంబ్డే విడుదలైనారు. గత ఏడాది వరవరరావు బెయిల్ విచారణ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణ ఎప్పటిలోగా పూర్తవుతుంది అంటూ ఎన్ఐఎ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్‌ను వరుసపెట్టి ప్రశ్నిస్తే, జాప్యానికి కారణం నిందితులు పిటిషన్లమీద పిటిషన్లు వేస్తూండటమేనని, వారు అడ్డుపడకపోతే ఏడాదిన్నరలోగా ఒక కొలిక్కిరావచ్చునని ఓ మాటగా అనాల్సివచ్చింది. కానీ, కేసు సాగుతున్న వేగాన్ని బట్టి అది మరోపదేళ్ళయినా ముగిసే అవకాశాలు ఏ మాత్రం లేవు. నిందితులను విచారించకుండానే క్షోభకు, శిక్షకు గురిచెయ్యాలన్న ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఇప్పటికైనా ఈ కేసు విషయంలో ఒక సమగ్ర విధానాన్ని తీసుకోవడం, నిందితులందరికీ బెయిల్ మంజూరు చెయ్యడం అవశ్యకం.