‘మహా’ హెచ్చరిక
ABN , First Publish Date - 2023-04-20T03:06:02+05:30 IST
ఈఏడాది ఎండలు మండిపోతాయని, అత్యధిక వేడి రికార్డులకు ఎక్కుతుందని చాలాముందుగానే హెచ్చరికలు విన్నాం. చల్లగా ఉండాల్సిన ఫిబ్రవరి చివరి పదిరోజుల్లో ఒక్కసారిగా ఎంతో మార్పు వచ్చి,..
ఈఏడాది ఎండలు మండిపోతాయని, అత్యధిక వేడి రికార్డులకు ఎక్కుతుందని చాలాముందుగానే హెచ్చరికలు విన్నాం. చల్లగా ఉండాల్సిన ఫిబ్రవరి చివరి పదిరోజుల్లో ఒక్కసారిగా ఎంతో మార్పు వచ్చి, మార్చినెల ప్రవేశానికి ముందే భానుడు దేశంలోని చాలా రాష్ట్రాలను భయపెట్టాడు. భారత వాతావరణశాఖ నెలన్నరక్రితమే రాబోయే వేసవి అసాధారణంగా ఉండబోతున్నదనీ, ఏవో కొన్ని చల్లని రాష్ట్రాలు మినహాయిస్తే మిగతాదేశమంతా మార్చి–మే మధ్యకాలంలో తీవ్రమైన వడగాలులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండబోతున్నందున రాష్ట్రాలు అమితవేడిమివల్ల వచ్చిపడే అనారోగ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కోవడానికి వీలుగా అవసరపడే సామగ్రి సహా యుద్ధప్రాతిపదికన సకల ఏర్పాట్లు చేసుకోవాలని ఫిబ్రవరి మధ్యలోనే కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది. పసిఫిక్ మహాసముద్రంలో లా నినా స్థానంలో, ఎల్ నినో ఏర్పడే అవకాశాలున్నందున రాబోయే మూడు నెలలు అసాధారణ ఎండలు చవిచూడాల్సి వస్తుందన్న వాదనలూ విన్నాం. ఇంత జరిగాక కూడా, ఏప్రిల్ నడిమధ్యలో మహారాష్ట్రలో లక్షల మందితో బహిరంగసభ నిర్వహించడం, అనేకమంది వడదెబ్బకు కన్నుమూయడం, వందలమంది ఆస్పత్రుల పాలవడం ప్రజాక్షేమం పట్ల మన పాలకులకు ఎంతటి చిత్తశుద్ధి ఉన్నదో తెలియచెప్పే ఘటన.
నావీ ముంబైలో ఒక సామాజిక కార్యకర్తకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాన్ని ప్రదానం చేసే ఈ కార్యక్రమంలో అమిత్ షా సహా కొందరు కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్య, ఉపముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పెద్దలంతా నీడపట్టున, చల్లగాలిలో ఉన్నారు కానీ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేపేరిట తీసుకొచ్చిన పదిలక్షలమంది మిట్టమధ్యాహ్నం మండుటెండలో మలమలామాడిపోయారు. సభా ప్రాంగణంలో ఉంచిన మంచినీరు ఎండకు మరిగిపోవడంతో, ఎండదెబ్బకు జనం అల్లాడిపోతూ, కొందరు కుప్పకూలిపోతున్న స్థితిలో పోలీసులు చల్లని నీళ్ళకోసం చుట్టుపక్కలకు పరుగులుతీయాల్సి వచ్చిందట. సొమ్మసిల్లినవారిని ఆస్పత్రులకు తరలించడానికి కూడా పోలీసులు మోటార్‌సైకిళ్ళను వినియోగించాల్సి వచ్చిందంటే సభ ఏర్పాట్లు ఎంత నాసిగా ఉన్నాయో తెలుస్తోంది. ఈ సంఘటనను దురదృష్టకరం అని ఒక్కముక్కలో ముఖ్యమంత్రి షిండే తేల్చేశారు కానీ, ఈ పాపం ప్రకృతిది కాదు, పాలకులు సృష్టించిన విపత్తు. ఎండవేడిమి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, జాగ్రత్తలు చెప్పాలని ప్రభుత్వ ఆదేశాలు అంటూంటాయి కానీ, ముందుగా హెచ్చరించాల్సింది ఎవరినో ఈ ఘటన చెబుతోంది. మహారాష్ట్ర తరహాలో కాకున్నా, వేసవిముగిసేలోగా దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రమాదాలు చిన్నాపెద్దా జరగవచ్చు. మండువేసవిలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఢిల్లీనుంచి గల్లీవరకూ నేతలు సభలూ సమావేశాలు నిర్వహిస్తారు కనుక ప్రమాదం మరింత ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆవిష్కరణలు, ఆరంభాలతో హడావుడి చేస్తున్న నేతలు మహారాష్ట్ర ఘటనను ఒక హెచ్చరికగా స్వీకరిస్తే తప్ప ప్రజల ప్రాణాలకు భరోసా ఉండదు.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని చాలా రాష్ట్రాలు గరిష్ఠ ఉష్ణోగ్రతలతో గడగడలాడిపోతున్నాయి. అసలైన గడ్డుకాలం ముందున్నది కనుక, పాఠశాలలకు సెలవులివ్వడంతోనే ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు. ఉద్యోగ, ఉపాధి అవసరాలరీత్యా ఎండలో విధిగా పనిచేయాల్సివచ్చే వారి శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకొని నీడ, మంచినీరు, ఎక్కువ విశ్రాంతి సమయం, తక్షణచికిత్స, అవసరమైనపక్షంలో ఆస్పత్రులకు తరలింపు ఇత్యాది విషయాలపై ఆదేశాలు జారీ కావాలి. నిర్మాణరంగంలో పనిచేసేవారిపైనా, ఉపాధి హామీ కూలీలపైనా ప్రత్యేక దృష్టి ఉండాలి. తీవ్ర అనారోగ్యాలు, తాగునీటి సమస్యలు, పశువుల మేతకు కొరత, వడదెబ్బలు, వృద్ధుల మరణాల వంటివి చుట్టుముట్టే కాలం ఇది. అధిక ఉష్ణోగ్రతలు వ్యవసాయం సహా అనేక రంగాలను దెబ్బతీస్తాయి. ఆహార నిల్వలు, నిత్యావసరాల సరఫరా, తాగునీరు, పశుగ్రాసం ఇత్యాది విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, చికిత్సలకు, మందులకు కొరతలేకుండా జాగ్రత్తపడటం, విపత్తును గరిష్ఠస్థాయిలో ఎదుర్కోవడానికి వీలుగా సమస్త వ్యవస్థలను సంసిద్ధం చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. రాబోయే వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే కరోనాపై పోరులా, ఒక జాతీయస్థాయి సంక్షోభం తరహాలో ప్రభుత్వాలు వ్యవహరించాలని నిపుణుల సలహా.