కొత్త అస్త్రం

ABN , First Publish Date - 2023-09-06T02:10:38+05:30 IST

నరేంద్రమోదీ దగ్గర చాలా అస్త్రాలున్నాయి, మన ఆలోచనకు కూడా అందనివాటిని అతివేగంతో ప్రయోగించడంలో ఆయన దిట్ట అని బీజేపీ నాయకులు, అభిమానులు...

కొత్త అస్త్రం

నరేంద్రమోదీ దగ్గర చాలా అస్త్రాలున్నాయి, మన ఆలోచనకు కూడా అందనివాటిని అతివేగంతో ప్రయోగించడంలో ఆయన దిట్ట అని బీజేపీ నాయకులు, అభిమానులు తెగ మురిసిపోతూంటారు. పదేళ్ళ కాలంలో అనేకం చూశాం కనుక ఔను నిజమేనని ఒప్పుకోకతప్పదు. మొన్నటికి మొన్న, వర్షాకాల సమావేశాలు ముగిసిన మూడువారాల్లోనే, కేవలం ఒక ట్వీట్‌ ద్వారా మళ్ళీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ప్రకటించినప్పుడు కూడా అధికారపక్ష నాయకుల అస్త్రప్రయోగ సామర్థ్యం గట్టిగా తెలిసొచ్చింది. విదేశీ డొల్లకంపెనీల ద్వారా అదానీ సంస్థల్లోకి నల్లధనం తరలిందన్న విషయం ఇలా వెలుగులోకి వచ్చిందో లేదో, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి మొబైల్‌ ఫోన్‌ నుంచి ఈ ట్వీట్‌ వెలువడింది. ప్రత్యేక సమావేశాలంటే ప్రత్యేక సందర్భాల్లో జరిగేవని మాత్రమే ఈ దేశానికి తెలుసు. 1972, 1992, 1997లో దేశస్వాతంత్య్రాన్ని, క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రత్యేకంగా స్మరించుకోవడానికి మాత్రమే సభ సమావేశమైంది. ఆ తరువాత మోదీ హయాంలో జీఎస్టీ కోసం 2017లోనే కూచుంది. ఏడాదికి మూడుసార్లు సాధారణంగా జరిగే సమావేశాలకు కూడా ఎజెండా ముందుగానే నిర్ణయమవుతుంది. చర్చో, రచ్చో అధికార విపక్షాలు సంబంధిత అంశాలపై సిద్ధపడేందుకు ఇది ఉపకరిస్తుంది. ఇప్పుడు, సమయం సందర్భం లేకుండా ప్రజల సొమ్ముతో ఏకంగా ప్రత్యేక సమావేశాలనే ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇలా ఎందుకు జరపాల్సివచ్చిందో, దేశ ప్రయోజనాలరీత్యా ఎందుకు ముఖ్యమైనవో చెప్పడం ప్రభుత్వం కర్తవ్యం. ఐదురోజుల క్రితం హఠాత్తుగా తెరమీదకు వచ్చిన తేదీలు తప్ప, సమావేశం ఎజెండా మాత్రం ఇంకా రహస్యమే. పార్లమెంటు సభ్యులనుంచి, ప్రజలనుంచి ఆఖరునిముషం వరకూ అంతా దాచి, అప్పటికప్పుడు సభలో నిర్ణయాలు ప్రకటించి విపక్షాలమీద, ప్రజలమీద ఈ తరహా సర్జికల్‌ దాడులు చేయడం ప్రజాస్వామ్యదేశంలో సబబేనా?

వార్తలనీ, చర్చలనీ అదానీ నుంచి దారిమళ్ళించేందుకే ఈ హఠాత్‌ సమావేశాలని కాంగ్రెస్‌ అప్పట్లో అంటే, ఓ రాజకీయ విమర్శగా తీసిపారేశాం కానీ, అదే నిజమనిపిస్తోంది. జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, కశ్మీర్‌, ముందస్తు ముచ్చట ఇలా అనేకానేక అంశాల చుట్టూ మీడియా కొన్ని రోజులుగా పరిభ్రమిస్తోంది. ఆ వరుస క్రమంలో, ఆ వేడి కొనసాగించడానికి ఇప్పుడు కొత్తగా ‘భారత్‌’ తెరమీదకు వచ్చింది. బుల్లితెరమీద ఇండియా గొప్పదా భారత్‌ గొప్పదా అన్న అంశంపై వక్తృత్వపు పోటీలు జరుగుతున్నాయి. కక్కలేని మింగలేని స్థితిలో కాంగ్రెస్‌ ఏదో మాట్లాడితే దేశభక్తి ఆయుధంతో బీజేపీ దాడిచేస్తోంది. 27 విపక్షపార్టీలు ‘ఇండియా’ పేరు పెట్టుకున్నప్పుడు, ఎదురుదాడి విషయంలో అధికారపక్షం ఆత్మరక్షణలో పడింది. తమ ఎన్డీయేకు మరింత గొప్ప నిర్వచనం ఇచ్చిన మోదీ, ‘ఇండియా’తో వ్యవహారానికి ఈ ఆత్మరక్షణ మార్గం సరిపోదని అనుకున్నారేమో తెలియదు కానీ, వారం తరువాత ఇండియన్‌ ముజాహిదీన్‌లోనూ, ఈస్ట్‌ఇండియా కంపెనీలోనూ ఇండియా ఉన్నదంటూ ఏకంగా ఎదురుదాడికి దిగారు. ‘ఇండియా’ పేరుతో విపక్షకూటమి ఏర్పడటం, అనుకున్నకంటే వేగంగా అది అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని, సీట్ల సర్దుబాటు వరకూ కదలడం, ప్రజలమీద కూడా ఈ కూటమి ప్రభావం ఉన్నట్టుగా సర్వేలు చెబుతూండటం అధికారపక్షానికి ఇబ్బంది కలిగించే విషయమే. అందువల్లనే ‘ఇండియా’ పేరుమీద మోదీ ప్రభుత్వం కక్షకట్టిందని, దానిని చెరిపేసేందుకు ‘భారత్‌’ను ముందుకు తెచ్చిందని కాంగ్రెస్‌ వాదన. కేవలం ఈ కారణంగానే దేశం పేరును భారత్‌గా ఖరారు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాల్లో సిద్ధపడుతుందా అన్నది అటుంచితే, బీజేపీ, ఆరెస్సెస్‌లకు ఈ పేరు విషయంలో ఉన్న మక్కువ, పట్టుదల కొత్తవిషయమేమీ కాదు.

మొత్తానికి సమావేశాల ఎజెండా ప్రకటించకుండా ప్రభుత్వం ఆడుతున్న నాటకం సత్ఫలితాలను ఇస్తోంది. అదానీ సంస్థల్లోకి విదేశీ డొల్లకంపెనీలనుంచి అక్రమంగా ప్రవేశించిన నల్లధనం, కరోనా చీకటికాలంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి వేదాంత అదనంగా తవ్వుకున్న గనుల కథనం విజయవంతంగా వెనక్కుపోయాయి. రాజకీయానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సమాచారాన్ని దాచి, సస్పెన్స్‌ కొనసాగిస్తూ, ఊహాగానాలకు తావిస్తూ, రోజుకో రచ్చరేపుతూ సాగుతున్న ఈ నాటకం ప్రజలను వంచించడమే, పార్లమెంటును అగౌరవపరచడమే.

Updated Date - 2023-09-06T02:10:38+05:30 IST