అదానీ మాయ
ABN , First Publish Date - 2023-10-20T03:37:59+05:30 IST
మరో దేశంలో అయితే ఏకంగా ప్రభుత్వాలే కూలిపోయేవి అంటూ అదానీ బొగ్గుదందా మీద బ్రిటన్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ, ఈ దేశంలోని పత్రికలు...
మరో దేశంలో అయితే ఏకంగా ప్రభుత్వాలే కూలిపోయేవి అంటూ అదానీ బొగ్గుదందా మీద బ్రిటన్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ, ఈ దేశంలోని పత్రికలు, చానెళ్ళు దానిని ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఓ ప్రశ్న వేశారు. యూపీఏ పాలనలో లేనిదానికీ కానిదానికీ కుంభకోణం అంటూ రాద్ధాంతం చేసిన మీడియా నరేంద్రమోదీ ఏలుబడిలో సాగుతున్న అవినీతిమీద నోరుమెదపడం లేదన్న బాధను కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం దాచుకోవడం లేదు. ప్రభుత్వాన్ని కూల్చివేసేంత శక్తి ఈ ఉన్న ఈ కథనం ఇక్కడి మీడియా దృష్టికి ఎందుకు రాలేదన్న రాహుల్ ప్రశ్నను అటుంచితే, దిగుమతి చేసుకుంటున్న బొగ్గు విలువను అధికంగా చూపి, ఇక్కడి వినియోగదారులను దోచుకుంటున్న ఈ వ్యవహారం మీడియా మాత్రమే కాదు, ప్రభుత్వం సైతం విస్మరించకూడని విషయం.
కస్టమ్స్ రికార్డులతో సహా అనేక డాక్యుమెంట్లను లోతుగా పరిశీలించి ఫైనాన్షియల్ టైమ్స్ ఎంతో సాధికారికంగా ఈ కథనాన్ని ప్రచురించింది. తైవాన్, ఇండోనేషియా, దుబాయ్, సింగపూర్‌లలోని కొన్ని డొల్లకంపెనీల ద్వారా ఇండోనేషియానుంచి ఎంతో చౌకగా బొగ్గు కొనుగోలు చేసిన అదానీ గ్రూప్ దాని ధరను అనేక రెట్లు అధికంగా చూపి ఇక్కడి విద్యుత్ సంస్థలను ఎలా మోసగించిందో ఆ కథనం వివరించింది. రెండేళ్ళకాలంలో ముప్పైకిపైగా షిప్‌మెంట్‌లకు సంబంధించి ఇన్వాయిస్‌లలో జరిగిన మోసాలు, తాను నేరుగా కాక మధ్యవర్తి కంపెనీలనుంచి కొన్నట్టుగా సృష్టించిన రికార్డులను ఈ పత్రిక ఉటంకించింది. ఇలా దిగుమతి ధరను హెచ్చించి చూపిన బొగ్గుతో తన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తవుతున్న విద్యుత్ ధరను పెంచి డిస్కమ్‌లను అదానీ గ్రూప్ ముంచుతున్నది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు లోబడి వివిధ రాష్ట్రాల డిస్కమ్‌లు అదానీ విద్యుత్‌ను ఇలా అధికధరకు కొనుగోలు చేయాల్సిరావడంతో భారతదేశ ప్రజలు వేలకోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తున్నదని, మార్కెట్ ధరకంటే ఇది చాలా అధికమని ఫైనాన్షియల్ టైమ్స్ విశ్లేషణ.
గతంలో హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం షెల్ కంపెనీల ద్వారా 20వేల కోట్లు దోచుకున్న అదానీ గ్రూప్, బొగ్గు దిగుమతిలోనూ అదే తరహా మోసంతో మొత్తం ముప్పైరెండువేల కోట్లు దోచుకుందని రాహుల్ లెక్కలు చెబుతున్నారు. నేను మోదీకి సాయపడుతున్నాను, అదానీ గ్రూప్ వ్యవహారాల మీద ఆయన ఎందుకు దర్యాప్తు చేయించడం లేదు? అంటూనే ప్రధాని ఆశీస్సులు, రక్షణ లేకుండా అదానీ ఇన్ని అక్రమాలకు పాల్పడేవారు కాదని రాహుల్ తానే సమాధానం కూడా చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే అదానీ అక్రమాలపై దర్యాప్తుచేయిస్తామన్న హామీని అటుంచితే, సెబీకి కనిపించని డాక్యుమెంట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఎలా దొరికాయన్న రాహుల్ ప్రశ్నలోనే సమాధానం ఉంది.
వివిధ డొల్లకంపెనీల ద్వారా విదేశాలకు తరలించిన నిధులతోనే అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను నిలబెట్టుకుంటూ వస్తున్నదని ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించిన విషయం తెలిసిందే. మొన్న మార్చిలో అంతర్జాతీయ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఓసీసీఆర్‌పి సాగించిన ఇన్వెస్టిగేషన్‌లోనూ ఇదే తేలింది. అరబ్ ఎమిరేట్స్, తైవాన్ నుంచి అదానీ కంపెనీల్లోకి ప్రవహిస్తున్న నిధులు ఏయే డొల్ల కంపెనీలవో, సదరు పెట్టుబడిదారులకు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీతో ఉన్న బంధం ఏమిటో అది బయటపెట్టింది. ఇటువంటివి బయటపడుతున్నప్పుడు బీజేపీ నేతలు దానిని విదేశీకుట్రగా అభివర్ణించడం చూస్తూనే ఉన్నాం. చివరకు, సుప్రీంకోర్టు ఆదేశం మేరకు సెబీ చేపట్టిన దర్యాప్తు కూడా నత్తనడకన సాగుతూండటం ఆశ్చర్యకరం. దర్యాప్తులో తనకు ఎదురవుతున్న ఆటంకాలను సెబీ ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించడం చూస్తున్నప్పుడు సెబీ వంటి ఒక శక్తిమంతమైన సంస్థ నిజంగానే అదానీ గ్రూప్ అక్రమాలను వెలికితీసే విషయంలో పట్టుదలగా ఉన్నదా అన్న అనుమానం కలగకతప్పదు.
దర్యాప్తులో జాప్యం సెబీ మీద విమర్శలు, అనుమానాలకు కారణమవుతున్నది. అది నిజాన్ని నిగ్గుతేల్చేందుకు కాక, సమాచారాన్ని దాచిపెట్టేందుకు, తిమ్మినిబమ్మిని చేసి కోర్టును తప్పుదోవపట్టించేందుకు సిద్ధపడుతున్నదన్న విమర్శలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. సెబీ తన దర్యాప్తును నిజాయితీగా సత్వరంగా ముగించని పక్షంలో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు మరింత ఊతం దక్కుతుంది, ప్రజల్లో అది నమ్మకాన్ని కోల్పోతుంది.