ఈజిప్ట్‌తో సాన్నిహిత్యం
ABN , First Publish Date - 2023-06-27T02:07:05+05:30 IST
అమెరికా పర్యటనలో ఉన్నన్ని వెలుగుజిలుగులు లేకపోవచ్చుగానీ, ప్రధాని నరేంద్రమోదీ ఈజిప్ట్ పర్యటన ఎంతో ఉన్నతంగా, ప్రభావవంతంగా జరిగింది. పాతికేళ్ళ తరువాత తమదేశంలో కాలూనిన భారత ప్రధానిని...
అమెరికా పర్యటనలో ఉన్నన్ని వెలుగుజిలుగులు లేకపోవచ్చుగానీ, ప్రధాని నరేంద్రమోదీ ఈజిప్ట్ పర్యటన ఎంతో ఉన్నతంగా, ప్రభావవంతంగా జరిగింది. పాతికేళ్ళ తరువాత తమదేశంలో కాలూనిన భారత ప్రధానిని ఆ దేశం చక్కగా ఆదరించింది, గౌరవించింది. తొలిసారిగా తమ దేశంలో పర్యటిస్తున్న మోదీని సైనికదళాల గౌరవవందనంతో ఆ దేశ ప్రధాని సాదరంగా స్వాగతించారు. అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సిసితో అంతర్జాతీయ పరిణామాలనుంచి విభిన్నరంగాల్లో ఉభయదేశాల పరస్పర సహకారం వరకూ మోదీ చర్చలు జరిపిన నేపథ్యంలో పలు ఒప్పందాలు, అవగాహనలు కుదిరాయి. రెండుదేశాలూ తమ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి హెచ్చించినందున రక్షణ, వాణిజ్యం, శాస్త్రసాంకేతికరంగాల్లో సహకారం మరింత విస్తరిస్తుంది.
జనవరిలో మన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు రావడంతో ఉభయదేశాల సాన్నిహిత్యం జోరందుకుంది. ఆయన ఆహ్వానం మేరకు ఈజిప్టులో పర్యటించిన మోదీ పాలకులతోనే కాక, పెట్టుబడిదారులతోనూ, వివిధరంగాలకు చెందిన నిపుణులతోనూ చర్చలు జరిపారు. ఇటీవల మన దేశంలో పర్యటించిన పెద్ద ముఫ్తీ నుంచి మీ పాలన అద్భుతం అంటూ ప్రశంసలు స్వీకరించారు. ఈజిప్ట్, పాలస్తీనాల్లో ఉంటూ మొదటి ప్రపంచయుద్ధంలో పోరాడి కన్నుమూసిన భారతీయ సైనికుల కోసం కామన్‌వెల్త్ నిర్మించిన స్మారకం వద్ద నివాళులు అర్పించడం, ఏడువింతల్లో ఒకటైన గాజా పిరమిడ్లను సందర్శించడం వంటివి అటుంచితే, ఈజిప్ట్ తన అత్యున్నత పౌరపురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ నైల్’ మోదీకి ప్రదానం చేయడం విశేషమైన ఘట్టం.
గుజరాత్‌కు చెందిన దావూదీ బోహ్రాలు పునరుద్ధరించిన 11వ శతాబ్దం నాటి అల్ హకీం మసీదును సందర్శించడం స్వరాష్ట్రంలో తన పార్టీ పునాదుల పటిష్ఠానికి ఉపకరిస్తుంది. బోహ్రాలు దేశభక్తులనీ, శాంతికాముకులనీ పలుమార్లు ప్రశంసించడమే కాక, ఇటీవల ముంబైలో బోహ్రాల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక అకాడమీని ఆరంభిస్తూ తాను ప్రధానిగా కాక ఓ కుటుంబసభ్యుడిగా ఈ కార్యక్రమానికి హాజరైనానని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచీ బోహ్రాలతో తన అనుబంధం కొనసాగిస్తున్న మోదీని, ఆయన ఏ దేశంలో కాలూనినా, అక్కడ ఎంత స్వల్పసంఖ్యలో ఉన్నా బోహ్రాలు ఘనంగా స్వాగతిస్తుంటారు. మైనారిటీల అణిచివేతకు సంబంధించి తమపై అంతర్జాతీయ స్థాయిలో వచ్చే విమర్శలు ఎదుర్కోవడానికి ఈ దృశ్యాలు ఉపకరిస్తాయని బీజేపీ నాయకుల నమ్మకం.
ప్రచ్ఛన్నయుద్ధకాలంలో ఏదో ఒక సూపర్ పవర్ పక్షాన నిలబడనిదే మనుగడ ఉండదని చాలాదేశాలు భయపడుతున్న దశలో, అలీనోద్యమ సృష్టికర్తలుగా భారత్, ఈజిప్టు వందకు పైగా దేశాలకు ఎవరి పంచనా చేరాల్సిన అవసరం లేదంటూ దిశానిర్దేశం చేశాయి, ధైర్యాన్ని అందించాయి. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, కష్టాలు ఎదురైనా ఈ రెండు దేశాలు ఎటూ మొగ్గకుండా తమ సార్వభౌమత్వాన్ని, స్వతంత్రతను నిలబెట్టుకున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన మూడురోజుల్లోనే భారతదేశం ఈజిప్టుతో తన దౌత్యసంబంధాలను నెలకొల్పుకోవడం ఉభయదేశాల సాన్నిహిత్యానికి నిదర్శనం. నెహ్రూ–నాసర్ కాలంలో పడిన ఈ బలమైన పునాది కొనసాగింపుగా, అనంతర దశాబ్దాల్లో ఉభయదేశాలు పలు అంతర్జాతీయ వేదికలపైన పరస్పరం సహకరించుకున్నాయి, కష్టకాలంలో సాయపడ్డాయి. అరబ్ ఇజ్రాయెలీ యుద్ధాల్లో నైతిక మద్దతు ఇవ్వడమే కాక, అనంతర పునర్నిర్మాణంలో ఈజిప్టుకు భారత్ తగిన సాయం అందించింది. ఆ తరువాత ఉభయదేశాల మధ్య వాణిజ్యం సహా పలురంగాల్లో సహకారానికి అనేక ఒప్పందాలు కుదిరాయి. 2008లో హోస్నీ ముబారక్ భారత పర్యటన అనంతరం ఉభయదేశాల సంబంధాలు గణనీయమైన స్థాయికి పెరుగుతాయని అంతా ఆశించారు. కానీ, 2011 అరబ్ తిరుగుబాట్లలో ఆయన పదవికోల్పోవడమే కాక, ఈజిప్టు తీవ్ర రాజకీయ అనిశ్చితికి గురైంది. ఇటీవలి కాలంలో ఆ దేశంతో మన వాణిజ్యం హెచ్చుతోంది.
అరబ్, ఆఫ్రికా వ్యహారాల్లో ఈజిప్టు పాత్ర కీలకమైనది. ఆఫ్రికా, ఐరోపా మార్కెట్లకు ఇది రహదారి. పన్నెండుశాతం ప్రపంచవాణిజ్యం సాగుతున్న సూయిజ్ కాలువ తన అధీనంలో ఉన్న ఈ దేశంతో స్నేహం మన వాణిజ్యానికి అవసరం. గ్లోబల్ మార్కెట్లను అందుకోవడానికి తోడ్పడే ఈజిప్టు మోదీ పర్యటన అనంతరం మనకు మరింత చేరువవుతుందని ఆశిద్దాం.