ఆలస్యం... విషం!
ABN , First Publish Date - 2023-09-21T01:38:55+05:30 IST
కొత్తభవనంలో, తొలి సమావేశంలో ఒక చరిత్రాత్మకమైన ముందడుగు అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో చక్కగా అభివర్ణించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ముక్తకంఠంతో...
కొత్తభవనంలో, తొలి సమావేశంలో ఒక చరిత్రాత్మకమైన ముందడుగు అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో చక్కగా అభివర్ణించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ముక్తకంఠంతో లోక్‌సభ ఆమోదం పొందింది. ‘దేశ్ కీ వికాస్ యాత్ర’ అంటూ నరేంద్రమోదీ తన ఏలుబడిలో మహిళలకోసం జనధన్ యోజన నుంచి ఆవాస్ యోజన వరకూ ఎన్నెన్ని పథకాలు అమలుచేసిందీ చెప్పుకొచ్చారు. కొనసాగుతున్న ఆ యాత్రలో మహిళా రిజర్వేషన్ బిల్లును అంతర్భాగంగా, ఒక చారిత్రకమైన మేలిమలుపుగా అభివర్ణించారు. మూడుదశాబ్దాలక్రితం సంకీర్ణ ప్రభుత్వయుగంలో సభలో ప్రవేశించి కాలం కలిసిరాక కరిగిపోయిన ఈ బిల్లు విషయంలో, అధికారపక్షనాయకులు కీర్తిని తమ ఖాతాలో వేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను వమ్ముచేసేందుకు విపక్షసభ్యులు సాధ్యమైనంత ప్రయత్నించారు. ఇది మా బిల్లు అని కాంగ్రెస్ మరోమారు గతాన్ని గుర్తుచేసింది. పదేళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికలముందే ఈ విషయం ఎందుకు గుర్తుకువచ్చిందని విపక్షాల విమర్శలు అటుంచితే, ‘నారీశక్తి వందన అధియాన్’ పేరిట మహిళా రిజర్వేషన్ల విషయంలో మరోమారు ముందడుగుపడినందుకు సంతోషించవలసిందే, స్వాగతించాల్సిందే.
అధికారపక్షానికి అధిక సంఖ్యాబలం ఉన్నది కనుక, సంకీర్ణయుగాలనాటి అభ్యంతరాలు, అడ్డంకులకు ఇప్పుడు తావులేదు కనుక, కొన్ని పార్టీలు కినుక వహించినా, అన్ని పార్టీలు అనుకూలంగానే ఉన్నందున ప్రభుత్వం తాను అనుకున్నది చేయగలుగుతోంది. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా, పార్టీలోనూ, వెలుపలా ఎదుర్కొన్న వ్యతిరేకతలవల్ల చేయలేనిపని బీజేపీ నెరవేర్చగలుగుతోంది. ఓబీసీల వాటాలు కోటాల మాటేమిటని అడిగినవారికి తమ ఎంపీలూ ఎమ్మెల్యేల్లో వారు ఎంతమంది ఉన్నారో అధికారపక్షనేతలు లెక్క చెబుతున్నారు. భగవంతుడు తనను ప్రత్యేకంగా ఎంపికచేశాడని నిండుసభలో నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల వంటివి సార్వత్రక ఎన్నికల ముంగిట మరింతగా, మరిన్ని ప్రచారంలోకి రావచ్చు. ఈ ‘నారీశక్తి’ అస్త్రం భారతీయ జనతాపార్టీకి రాజకీయంగా లబ్ధిచేకూరుస్తుందా అన్న సందేహం ఎవరికైనా ఉండవచ్చునేమో గానీ, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యమందిరంతో పాటు తమ అమ్ములపొదిలో మరో ఆయుధం సమకూరబోతున్నదని అధికారపక్షం మాత్రం నమ్ముతోంది.
నరేంద్రమోదీ ఈ రిజర్వేషన్ అమలుచేయరంటూ నితీశ్‌కుమార్ వంటివారు అపశకునాలు పలుకుతున్నారు. సరికొత్త జనాభా లెక్కలతోనూ, దాని ఆధారంగా జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతోనూ దీనిని ముడిపెట్టడం వల్ల అనేకులకు ఈ అనుమానాలు ఉండటం సహజం. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను కరోనా కారణంగా వాయిదా వేసినప్పటికీ, ఆ తరువాత రెండేళ్ళకాలం ప్రభుత్వం ఎందుకు ఊరుకున్నదో తెలియదు. ఎన్నికల సంవత్సరం కనుక వచ్చే ఏడాది అది జరగడం అసంభవం. 2026వరకూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియమీద పరిమితి ఎలాగూ ఉన్నది. కనుక, ఈ రెండింటితో జతకలిసిన మహిళారిజర్వేషన్ అమలు 2029 సార్వత్రక ఎన్నికల్లో అమలు అయిన పక్షంలో ఎంతో సంతోషించాలి. పైగా, డీలిమిటేషన్ ప్రక్రియ అత్యంత వివాదాస్పదమైనది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు జనాభానియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించినందున ఈ నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంటులో తమ స్థానాలు తగ్గిపోవచ్చునని అవి అనుమానపడుతున్నాయి. అదే జరిగితే, న్యాయపోరాటాల్లో ఇరుక్కొని ఈ ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయి. ఇలా, భవిష్యత్తులో సంభవించబోయే రెండు పరిణామాలతో ముడిపెట్టడం ద్వారా, ఇటు సీట్లు కోల్పోతామన్న భయం మగ ఎంపీలకు లేకుండా, అటు చట్టసభల్లో తమకు చోటుదక్కినందుకు మహిళలు సంతోషించేట్టుగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. జనగణనతోనూ, నియోజకవర్గాల పునర్విభజనతోనూ ముడిపెట్టకుండా తక్షణమే ఈ రిజర్వేషన్ అమలులోకి తెచ్చేందుకు ఎటువంటి అడ్డంకులూ లేవని వాదించినా ఫలితం లేకపోవడంతో, కులగణన గురించి మరోమారు బల్లగుద్ది కాంగ్రెస్ నాయకులు సంతృప్తిపడాల్సివచ్చింది. రాబోయే సార్వత్రక ఎన్నికల ప్రచారంలో ఈ చట్టం గురించి అధికారపక్షనాయకులు గొప్పలకు పోయినప్పుడల్లా, దీని అమలు విషయంలో అధికారపక్షానికి చిత్తశుద్ధిలేదని విపక్షనాయకులు వాదించవచ్చు. కనీసం 2029 ఎన్నికల నాటికైనా, అంతలోగా రాజకీయ కుట్రలకు, దుర్బుద్ధులకు బలికాకుండా మహిళా రిజర్వేషన్ ఆచరణలోకి వస్తే అంతకంటే సంతోషించాల్సిందేమీ లేదు.