మరో దుస్సంప్రదాయం!
ABN , First Publish Date - 2023-05-24T00:49:54+05:30 IST
కొత్త పార్లమెంట్ భవనం ఆదివారం ఆరంభం కాబోతున్న తరుణంలో, ఆ పని జరగాల్సింది రాష్ట్రపతి చేతులమీదుగా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి....
కొత్త పార్లమెంట్ భవనం ఆదివారం ఆరంభం కాబోతున్న తరుణంలో, ఆ పని జరగాల్సింది రాష్ట్రపతి చేతులమీదుగా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కొత్తభవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని ముందుగా ప్రకటించినప్పటికీ, ఏ కారణంగానో స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఆహ్వానపత్రంలో చోటుదక్కింది. గౌరవ స్పీకర్ సమక్షంలో నరేంద్రమోదీయే సర్వమూ నిర్వహించి ఈ అధునాతన భవనాన్ని జాతికి అంకితం చేస్తారని అర్థం. ఎంతోకాలంగా మాటలకు పరిమితమైన ఒక ఆలోచనను మోదీ ఆచరణ సాధ్యం చేసినందున, ఆరంభోత్సవం రాష్ట్రపతి చేతులమీదుగా జరగాలన్న వాదన బీజేపీ నాయకులకు నచ్చకపోవడం సహజం. రాష్ట్రపతిని ఆహ్వానించకుండా ఈ వెలుగుజిలుగుల మార్కులన్నీ మోదీయే కొట్టేస్తున్నారన్న దుగ్ధ విపక్షాలకు ఉండివుండవచ్చును కానీ, వాటి వాదన పూర్తిగా తీసిపారేయవలసినదేమీ కాదు.
వీర్‌సావర్కర్ జయంతినాడు పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించడం ఆదిలోనే అగ్గిరాజేయడానికి తోడ్పడింది. గణతంత్రభారతానికి వన్నెతెచ్చే ఒక సందర్భాన్ని అండమాన్ జైలునుంచి విముక్తి ప్రసాదించమంటూ వలసపాలకులకు అభ్యర్థనలు పెట్టుకున్న ఒక వ్యక్తి జయంతితో ముడిపెట్టడం స్వాతంత్ర్యసమరయోధులను అవమానించడమేనని విపక్షాల వాదన. అనేకమంది జాతినేతలను, దేశం గర్వించదగ్గ తేదీలను కాదని ఆ రోజునే ఎందుకు ఎంచుకున్నారన్న విపక్షాల ప్రశ్న సముచితమైనది. దీనికితోడు రాష్ట్రపతిని దూరం పెట్టడం రాజ్యాంగ విధివిధానాల ఉల్లంఘన చర్చకు దారితీసింది. మాజీ రాష్ట్రపతి కోవింద్‌ను కాదని కొత్తభవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని మోదీయే నిర్వహించడం, ఇప్పుడు ద్రౌపది ముర్ముతో కాక మోదీయే ఆరంభించడం దళితులను, ఆదివాసులను అవమానించడమేనని విపక్షాలు అంటున్నాయి.
గణతంత్ర భారత సర్వోన్నత వ్యవస్థ అయిన పార్లమెంటుకు రాజ్యాంగబద్ధ అధిపతి రాష్ట్రపతే. నిత్యవ్యవహారాల్లో ఆ హోదా నామమాత్రమైనది కావచ్చును కానీ, యావత్ దేశానికి, సకలవ్యవస్థలకు రాష్ట్రపతే అధినేత. రాజ్యాంగ అధినేత చేయాల్సిన పనిని కార్యనిర్వాహక వ్యవస్థ అధిపతి అయిన ప్రధాని ఎలా చేస్తారన్నది విపక్షాల ప్రశ్న. పార్లమెంటు గురించి రాజ్యాగంలోని 79వ అధికరణ ఇచ్చిన నిర్వచనంలో, రాష్ట్రపతి–రెండుసభలు అంటూ పేర్కొన్నది. పార్లమెంటుకు సంబంధించిన ఈ వ్యాఖ్యలో ప్రస్తావనకు నోచుకోని ప్రధాని కొత్తభవనాన్ని ఎలా ఆరంభిస్తారన్నది చక్కని ప్రశ్న. రాజ్యాంగంలోని వివిధ అధికరణలకు లోబడి, రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం, ఏటా సమావేశాలు ప్రారంభించడం, పార్లమెంటు రూపొందించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదం లేనిదే చట్టం కాకపోవడం వంటివి రాజ్యాంగపరంగా రాష్ట్రపతి స్థానాన్ని తెలియచేస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షకుడు కూడా రాష్ట్రపతే. ఎగువ, దిగువసభల్లో ప్రధానమంత్రే సభ్యుడు కాని, రాష్ట్రపతి కాదు అని బీజేపీ నాయకులు వాదిస్తున్నప్పటికీ, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొత్తగా ఆరంభించిన వెబ్‌సైట్ సైతం రాష్ట్రపతి ఏ సభకూ చెందనివారైనా, పార్లమెంటులో అంతర్భాగమనీ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఉన్న అద్భుతమైన మేళవింపునకు ఈ పదవి నిదర్శనమని వ్యాఖ్యానిస్తోంది.
ఘనత పూర్తిగా నరేంద్రమోదీకి దక్కకుండా చేయాలన్న కుట్ర విపక్షాల విమర్శల్లో ఉన్నదేమో కానీ, రాష్ట్రపతికి మాత్రమే దక్కాల్సిన ఈ గౌరవం విషయంలో అవి ఉదహరిస్తున్న అధికరణలు కాదనలేనివి. బీజేపీ నాయకులు ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు ప్రధానంగా గతాన్నే నమ్ముకున్నారు. 1975లో ఇందిరాగాంధీ పార్లమెంటు అనుబంధభవనాన్ని ఆరంభించలేదా, ౧987లో రాజీవ్ గాంధీ పార్లమెంటు లైబ్రరీకి శంకుస్థాపన చేయలేదా అన్నవి మంచిప్రశ్నలే. ఆ మాటకొస్తే మోదీ కూడా 2017లో ఇటువంటిదొకటి చేశారు. ఇంకా చెప్పాలంటే, 2002లో లైబ్రరీ భవనాన్ని ఆరంభించింది అప్పటి రాష్ట్రపతి నారాయణన్. కొత్తగా కట్టినదానిని ఆరంభించడం వేరు, ఉన్నదానికి అతుకులు వేయడం వేరు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్‌వారు వేరే అవసరం కోసం నిర్మించినదానికి ప్రత్యామ్నాయంగా, వజ్రోత్సవ భారతం కోసం ఒక పార్లమెంటు భవనాన్ని కట్టుకున్నప్పుడు దాని ఆరంభోత్సవం ఘనంగానే కాక, ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ హోదాలకు లోబడి జరగాల్సిందే, గౌరవాలు దక్కాల్సిందే.