విద్వేషానికి విరుగుడు

ABN , First Publish Date - 2023-08-31T04:11:11+05:30 IST

హర్యానాలోని గురుగ్రామ్‌, ‘ను’ తదితర ప్రాంతాల్లో ఇటీవల రేగిన మతఘర్షణలకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టూ బజ్రంగీకి జిల్లాకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది...

విద్వేషానికి విరుగుడు

హర్యానాలోని గురుగ్రామ్‌, ‘ను’ తదితర ప్రాంతాల్లో ఇటీవల రేగిన మతఘర్షణలకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టూ బజ్రంగీకి జిల్లాకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. జూలై 31న విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో బ్రిజ్‌మండల్‌ జలాభిషేక్‌ యాత్ర నిర్వహించడం, తాము వందలాదిమంది అనుచరులతో పాల్గొనబోతున్నట్టుగా గో రక్షకులు మోనూ మానేసర్‌, బిట్టూ బజ్రంగీలు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు ఇవ్వడం, అది మత ఉద్రిక్తతలకు ప్రధానకారణం కావడం తెలిసిందే. ఆ యాత్ర రేపిన ఉద్రిక్తత ఇంకా ఉండగానే, మొన్న శ్రావణ సోమవారం సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ తిరిగి యాత్రకు సంకల్పించినప్పుడు, హర్యానా ప్రభుత్వం అనూహ్యమైన భద్రతా ఏర్పాట్లతో, ముందస్తు అరెస్టులతో ఆ కార్యక్రమాన్ని పరిమితస్థాయిలో ముగించింది.

హర్యానా పాలకులు ఇప్పటిమాదిరిగానే నెలక్రితం కూడా వ్యవహరించివుంటే హింస రేగేదే కాదు. ముస్లింలు అత్యధికంగా ఉన్నచోట విహెచ్‌పి తలపెట్టిన ఈ యాత్ర, మోనూ మానేసర్‌ వంటి గోరక్షకుల ప్రకటనలు, హింసరేగే అవకాశాలపై రాష్ట్ర సిఐడి ఇచ్చిన నివేదికలు ముఖ్యమంత్రి ఖట్టర్‌ దృష్టికి రాలేదని అనుకోలేం. దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోనూ, పరిశ్రమలకు, ఐటీరంగానికి పెట్టింది పేరైన గురుగ్రామ్‌లోనూ హింసరేగితే ఆ ప్రభావం రాష్ట్రానికే పరిమితం కాదు. అయినప్పటికీ, డబుల్‌ ఇంజన్‌ సర్కార్ల ఓటుబ్యాంకు లెక్కముందు ఇవన్నీ దిగదుడుపే. అయితే, ఈ మతవిద్వేషానికి వ్యతిరేకంగా తమకు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ఖాప్‌ పంచాయతీలు, రైతుసంఘాలు తిరగబడతాయని పాలకులు ఊహించలేదు. మొదట్లో మాయలో పడ్డా, అనతికాలంలోనే పెద్దసంఖ్యలో ఖాప్‌ పంచాయతీలు మతవిద్వేషానికి వ్యతిరేకంగా నిలబడటం, సార్వత్రక ఎన్నికల ముందు బీజేపీ రేపిన చిచ్చును అడ్డుకోవాలని తీర్మానించడం విశేషం.

విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌, ఆరెస్సెస్‌ను నిషేధించాలని కూడా కొన్ని ఖాప్‌ పంచాయతీలు తీర్మానించాయి. హింసరేగిననాటినుంచి ఇప్పటివరకూ ఒక్క హర్యానాలోనే కనీసం ఓ ముప్పై చిన్నస్థాయి పంచాయితీలు జరిగి, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానిస్తే, మూడు చోట్ల భారీ సదస్సులు కూడా జరిగాయి. రైతు సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన సమావేశం ఒకటి ఈ మత ఉద్రిక్తతలమీదకు చర్చను మళ్ళించి దానిని సౌభ్రాతృత్వ సదస్సుగా నామకరణం చేసుకుందట. ఎన్నికలు జరగబోతున్న రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఆల్వార్‌లో నాలుగురోజుల క్రితం జరిగిన ఖాప్‌ పంచాయతీ కూడా విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించింది. హర్యానా నుంచి పొరుగున ఉన్న రాజస్థాన్‌ వరకూ విస్తరించిన మేవాట్‌ ప్రాంతంలోకి ఈ ‘ను’ జిల్లా కూడా ఉన్నందున, మేవాటీలంతా ఒక్కటే అన్న నినాదంతో ఇక్కడ చాలా పంచాయితీలు జరిగాయి.


ఈ పంచాయితీలు, రైతు సదస్సులు విద్వేష రాజకీయాలనుంచి హర్యానాను కాపాడుకోవాలని శపథం చేయడంతో సరిపెట్టలేదు. సోమవారం నాటి విహెచ్‌పి యాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని, మళ్ళీ ఉద్రిక్తతలు రేగితే ఊరుకొనేది లేదనీ ప్రకటించి ముందుగానే ట్రాక్టర్‌ ర్యాలీలతో ఒత్తిడి కూడా పెంచాయి. జులై 31 ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే ఖాప్‌ పంచాయితీలు ప్రమాదాన్ని గుర్తించి విద్వేషరాజకీయాలకు వ్యతిరేకంగా వరుసపెట్టి ఇలా సమావేశాలు నిర్వహించడం, ముస్లింల పక్షాన నిలబడటంతో కథ అడ్డం తిరిగిందని రాష్ట్రపాలకులకు అర్థమైంది. ముస్లింలు తమ సోదరులని ప్రకటించడం, వారిపై చెయ్యిపడితే ఊరుకొనేది లేదని చాటిచెప్పడం పాలకులకు హెచ్చరికతోపాటు, ముస్లిం సమాజానికి కూడా కొండంత ధైర్యాన్ని ఇచ్చింది.

రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన సుదీర్ఘ పోరాటంలో అన్ని మతాల రైతులూ ఒక్కటిగా ఉద్యమించి మోదీ ప్రభుత్వం మెడలు వంచారు. పదమూడునెలల ఆ పోరాటం వివిధ మతాలవారిమధ్య అనుబంధాన్ని పెంచింది. చాలా ఖాప్‌ సదస్సుల్లో హిందూ ముస్లిం సిక్‌ ఇసాయి అంటూ నినాదాలు చేయడం అందుకు నిదర్శనం. రాజకీయంగా అత్యంత ప్రభావం చూపగల ఖాప్‌ పంచాయితీలు ఇలా తిరగబడటంతోనే, అవి తెచ్చిన ఒత్తిడివల్లనే ఖట్టర్‌ వ్యవహారధోరణిలో మార్పువచ్చి మరోమారు హింసరేగలేదన్నది వాస్తవం.

Updated Date - 2023-08-31T04:11:11+05:30 IST