సామాన్యుడికి ఏదీ ఉపశమనం?
ABN , First Publish Date - 2023-07-06T02:52:04+05:30 IST
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వచ్చి ఆరేళ్ళయింది. 2017 జూలై 1న పార్లమెంటు అర్ధరాత్రి సమావేశంలో, విపరీతమైన ప్రచారార్భాటాల మధ్యన ఆరంభించిన ఈ విధానంతో...
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వచ్చి ఆరేళ్ళయింది. 2017 జూలై 1న పార్లమెంటు అర్ధరాత్రి సమావేశంలో, విపరీతమైన ప్రచారార్భాటాల మధ్యన ఆరంభించిన ఈ విధానంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకే దేశం–ఒకే మార్కెట్ లక్ష్యాన్ని సాధించింది. రాష్ట్రానికో పన్ను, రాష్ట్రాల సరిహద్దుల్లో చెల్లింపులు, చెకింగులు, చెక్‌పోస్టులతో ఉత్పత్తుల రాకపోకలకు అంతరాయం, జాప్యం ఏర్పడుతున్న తరుణంలో జీఎస్టీ ఆ ఈతిబాధలను పరిష్కరించింది. రవాణాఖర్చు కలిసిరావడానికీ, ఉత్పత్తిపెరగడానికీ, పోటీ హెచ్చడానికీ జీఎస్టీ ఉపకరించిందని ఆర్థికమంత్రి పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ ఏడాది పన్నెండుశాతం వార్షికవృద్ధి నమోదుచేసుకున్న జీఎస్టీ, నెలవారీవసూళ్ళలోనూ, త్రైమాసిక సగటులోనూ ఎన్నెన్ని రికార్డులు సృష్టిస్తున్నదో గుర్తుచేస్తున్నారు. జీఎస్టీ ప్రవేశంతో ఆయా వస్తుసేవల రేట్లకు హేతుబద్ధత చేకూరిందని అంటున్నారు. కానీ, అప్పటివరకూ మండిపోతున్న ధరలన్నీ దీని ప్రవేశంతోనే దిగివచ్చాయనీ, సామాన్యుడి స్థాయికి కదిలివచ్చాయన్న పాలకుల వ్యాఖ్యలే నమ్మశక్యంగా కనిపించడం లేదు.
పెద్దనోట్ల రద్దు తరువాత తీసుకున్న ఈ నిర్ణయం అసంఘటిత రంగాన్ని మరింత దెబ్బతీసిందన్న వాదన అటుంచితే, క్రమబద్ధమైన సమావేశాలతో ఆదిలో ఎదురైన చాలా సంకటాలను ఈ వ్యవస్థ అధిగమించింది. ఇది వచ్చిన తరువాత నెలకు ఎన్నిలక్షలకోట్లు వస్తున్నదో, కేంద్ర రాష్ట్రప్రభుత్వాల పంపకాల లెక్కలు ఏ విధంగా ఉన్నాయో బాగానే తెలుస్తున్నది. రాష్ట్రాలకు జీఎస్టీ వల్ల వచ్చిపడిన నష్టాన్ని భర్తీచేసే ఔదార్యాన్ని కూడా కేంద్రం సుదీర్ఘకాలం ప్రదర్శించింది. కరోనా అనంతరకాలంలో తిరిగితేరుకున్న ఆర్థికవ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడంతో పన్ను ప్రవాహాలు పెరిగాయి. జూన్‌లో జీఎస్టీ ఆదాయం లక్షా అరవైవేలకోట్లు ఉండటం, ఈ ఏడాది తొలి త్రైమాసిక సగటు లక్షా డెబ్బయ్‌వేలకోట్లు కావడం వంటివి మంచి సూచనలు. పరిహారం ఇచ్చే ప్రక్రియ ముగిసిపోయినందుకు రాష్ట్రాలు ఇక ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నమాట.
ఒకే పన్నువ్యవస్థ ఏర్పడింది కానీ, అది మరింత సవ్యంగా సరళంగా ఉండటానికి చేయాల్సింది చాలా ఉంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరనందుకు పారిశ్రామికవేత్తలు బాధపడుతుంటే, ఈ ఆరేళ్ళలో వందలాది సవరణలు చేసినా, తినేతిండి ఖరీదుగానే ఉంటున్నందుకు సామాన్యుడు ఆవేదన చెందుతున్నాడు. రత్నాలు వజ్రాలకంటే రొట్టెముక్క ఎక్కువ పన్ను ఆకర్షించడాన్ని ప్రశ్నిస్తున్నాడు. ప్యాకింగ్ చేయని ఆహారోత్పత్తి మీద తక్కువ పన్ను ఉన్నా లేకున్నా సర్వమూ ప్యాకింగ్ మయం అయిపోతున్న పాడుకాలంలో పన్నుపోటు ఏ దశలో సాగినా తనకు ఒనగూరేదేమీ లేదని బాధపడుతున్నాడు. ఉప్పునుంచి పప్పుదాకా, పెన్సిల్ నుంచి పాలూపెరుగువరకూ, చివరకు కన్నుమూసిన తరువాత కూడా జీఎస్టీ వెంటాడుతూంటే ఖజానా కళకళలాడుతున్న సంతోషం పాలకులకు మాత్రమే మిగులుతోంది. విద్య, వైద్యం, ఆహారం, నివాసం ఇలా దేనికీ మినహాయింపు లేకుండా, కనీసావసరాలన్న ధ్యాసలేకుండా, అధికరేట్లతో అత్యధికశాతం జనం నుంచి ఆదాయం సమకూర్చుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన వ్యవస్థను ఇప్పటికైనా సరిదిద్దితే అసలైన హేతుబద్ధత చేకూరుతుంది. పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న అభ్యర్థన ఇప్పటికీ పాలకులకు పట్టడం లేదు. ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై ఎవరు ఎంత దోచేస్తున్నది లెక్కలు విప్పుతూ పరస్పరం కలహించుకుంటాయి. రాష్ట్రాల అంగీకారం లేనిదే తామేమీ చేయలేమంటున్న కేంద్రం, సెస్సుల పేరిట తమకు వాటా ఇవ్వడం లేదని ఆగ్రహిస్తున్న రాష్ట్రాలు కూడబలుక్కొని దానిని జీఎస్టీ పరిధిలోకి రాకుండా ఆపుతున్నాయి. సామాన్యుడి ద్విచక్ర వాహనం మీద లేని ప్రేమ విమాన ఇంధనం విషయంలో కనబడుతుంది. ఏటా కార్పొరేట్ పన్నులు తగ్గుతూంటాయి, నిత్యావసరాలు మాత్రం భగ్గుమంటూనే ఉంటాయి. జీఎస్టీ ప్రవేశంతో దేశంలో ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని, వసూళ్ళలో ధనికుల కంటే పేద, మధ్యతరగతి వాటాయే ఎక్కువన్న అంతర్జాతీయ సంస్థల నివేదికలు మన పాలకులకు రుచించడం లేదు. పన్ను పరిధిలో లేని అనేక ఉత్పత్తులు, సేవలతో అప్పటివరకూ వినియోగదారుకు దక్కిన ప్రయోజనాలను జీఎస్టీ దెబ్బతీసిన నేపథ్యంలో, ఎన్ని లక్షలకోట్లు వచ్చాయన్న లెక్కలకంటే, ఈ విధానం పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంత ఉపశమనం ఇచ్చిందన్న విషయంపై పాలకులు దృష్టిపెట్టడం అవసరం.