అరకొర ‘వందన’మే
ABN , First Publish Date - 2023-09-23T00:27:25+05:30 IST
మహిళా బిల్లును పార్లమెంటు ఆమోదించింది. సంతోషమే కానీ, సంపూర్ణ సంతోషమా అన్నది సందేహం. సుమారు మూడు దశాబ్దాలుగా చట్టసభలలో స్త్రీలకు రిజర్వేషన్ల గురించి...
మహిళా బిల్లును పార్లమెంటు ఆమోదించింది. సంతోషమే కానీ, సంపూర్ణ సంతోషమా అన్నది సందేహం. సుమారు మూడు దశాబ్దాలుగా చట్టసభలలో స్త్రీలకు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాము, ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. కానీ, రిజర్వేషన్లు అన్ని చట్టసభలలోనూ ఉంటాయా? అని ప్రశ్నించుకుంటే అసంతృప్తే మిగులుతుంది. రాజ్యసభలో, శాసనమండళ్లలో రిజర్వేషన్లు ఉండవు. పోనీ, అందరు స్త్రీలకూ చట్టసభలలో అవకాశం లభిస్తుందా? అంటే, కొందరు స్త్రీలకయితే ఎన్నో అవకాశాలు అన్న సమాధానం వస్తుంది. అయితేనేమి, ఈ నిర్ణయాన్ని పార్లమెంటు దాటించడానికి గతంలోని ప్రభుత్వాలకు లేని ధైర్యం నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఉండడం వల్ల, ఇప్పుడీ చరిత్రాత్మక ఘట్టం సాధ్యమైంది. పదేళ్ల నుంచీ మోదీ ప్రభుత్వానికి ఇంత బలమూ ఇంత కంటె ఎక్కువ బలమూ ఉన్నాయి కదా, మరి ఇన్నేళ్ల నుంచి ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నకు సమాధానం ఏమీ దొరకదు. పోనీ, ఇప్పుడయినా వెంటనే ఎందుకు అమలుచేయరు, అయిదేళ్ల తరువాత అమలు అయ్యేదానికి ఈ ప్రత్యేక సమావేశాల హంగామా ఎందుకు అని అడిగితే, సూటిగా జవాబు చెప్పవలసిన అగత్యం ఏలినవారికి ఎందుకు ఉంటుంది?
ఇంతకాలంగా మహిళా రిజర్వేషన్ల అంశానికి పీటముడి పడి అటకెక్కడం అకారణమో, అలసత్వమో కారణం కాదు. ఈ ప్రతిపాదనపై తీవ్రమయిన అభ్యంతరాలున్న రాజకీయ పక్షాలు, బిల్లును అడ్డుకుంటూ వచ్చాయి. వారిని కాదని ముందుకు వెళ్లడానికి ప్రధాన పక్షాలకు రాజకీయమైన సంకోచాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలు, సంకోచాలు ఇప్పుడు తొలగిపోయాయా? లేదు. అవి అట్లాగే ఉండగా, వాటిని ఖాతరు చేయకుండా కేంద్రప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లింది. ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన చొరవ కాదు. మరి గతంలో ఈ బిల్లును నిరోధించగలిగిన రాజకీయ పక్షాలు ఇప్పుడు ఎందుకు బలహీనపడ్డాయి? ఎందుకు వారి గొంతు బలంగా వినిపించలేదు? ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీయే, బిల్లును సూత్రప్రాయంగా ఆమోదిస్తూనే, అభ్యంతరాలను కూడా ఎందుకు సున్నితంగా చెప్పవలసి వచ్చింది?
మహిళలకు కల్పించే 33 శాతం రిజర్వేషన్‌లో సైతం సామాజిక వర్గాల వారీగా ఉపరిజర్వేషన్ లేకపోతే, అగ్రవర్ణ స్త్రీలకే ఆ స్థానాలు సంక్రమిస్తాయన్నది ఇంతకాలం ఉన్న అభ్యంతరం. సామాజిక న్యాయ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు ఈ వాదాన్ని బలంగా ముందుకు తెచ్చాయి. ఇప్పుడు చట్టసభలలో షెడ్యూల్డు తెగలకు, కులాలకు తప్ప మరే సామాజిక వర్గానికి రిజర్వేషన్లు లేవు. జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన ఆర్థిక సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు లేవు. ఇప్పటికీ రాజకీయ పదవులలో అగ్రకులాలవారే అధిక సంఖ్యాకులుగా ఉండడానికి ఈ పరిస్థితే కారణం. స్త్రీల విషయంలో పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. అగ్రకులాల స్త్రీలకు లభించినన్ని అభివృద్ధి అవకాశాలు, వారికి సమాజంలో ఉన్న పలుకుబడి, చొరవ ఇతర కులాల వారికి ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఆమోదించిన బిల్లులో షెడ్యూల్డు కులాల, తెగల మహిళలకు ఉపరిజర్వేషన్ ఉంటుంది తప్ప, మరెవ్వరికీ ఉండదు. ఈ ప్రశ్నే ఇంతకాలం బిల్లు పురోగతిని నిలువరించింది. ఈ ప్రశ్ననే ఇప్పుడు బిజెపి ప్రభుత్వం దాటవేసింది కూడా. బిసిల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలు దారుణంగా బలహీనపడడమో, తమ స్వరానికి విశ్వసనీయతను కోల్పోవడమే ఇందుకు కారణమేమో అనిపిస్తుంది.
మా పార్టీ బిసి కులాల నుంచి ప్రధానమంత్రినే ఇచ్చింది, మా కేబినెట్‌లో ఇంత మంది బిసి మంత్రులు ఉన్నారు వంటి వాదనలతో అధికారపక్షం బిసి వాదనలను పక్కకు నెట్టేసింది. ఈ కోలాహలంలో, చట్టసభలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం అన్న నినాదానికి ఆస్కారమే లేకపోయింది. బిసి రిజర్వేషన్ వాదనకు గట్టి సమర్థన కాగలిగిన బిసి జనగణన విషయమై బిజెపి మౌనవ్రతంలో ఉన్నది. బిసి ప్రధాని ఉంటే, అధికసంఖ్యలో బిసి మంత్రులు ఉంటే, బిసిలకు రావలసిన అవకాశాలను సులువుగా నిరోధించవచ్చునన్న మాట!
ఇక ఈ ప్రభుత్వంలో మైనారిటీల రిజర్వేషన్ ఎవరు పట్టించుకుంటారు? మైనారిటీలకు ఒక్క లోక్‌సభ అభ్యర్థిత్వం కూడా ఇవ్వకుండా నెగ్గుకు రాగలిగిన మెజారిటేరియన్ రాజకీయ వాతావరణంలో, ఇక మైనారిటీ మహిళకు రిజర్వేషన్ ఎక్కడ? దీన్నంతా గమనిస్తుంటే, అగ్రవర్ణాల వారికి అప్పనంగా పెద్దసంఖ్యలో కట్టబెట్టడమే లక్ష్యం అనిపిస్తుంది!
ఒక పక్క నిరసనలను నీరుగార్చి, మరో వైపు ఈ బిల్లు ఘనతను ప్రచారం చేసుకునే కార్యక్రమంలోకి ప్రభుత్వం దిగింది. సినీతారలు, ప్రముఖులు అందరూ వరుసకట్టి ప్రధానిని, బిల్లును కీర్తిస్తున్నారు. సామాజిక న్యాయంలోను, జెండర్ న్యాయంలోను కూడా మహిళాబిల్లు అర్థాకలినే తీర్చిందని చెప్పితీరాలి. బిల్లు అసంపూర్ణమని గుర్తించిన పక్షాలు, బిసి జనగణన మీద, బిసిలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించడం మీద, అందులో మహిళలకు రిజర్వేషన్ వర్తింపజేయడం మీద దృష్టి పెట్టి పనిచేయాలి.