కాస్త జాగ్రత్త

ABN , First Publish Date - 2023-03-21T00:57:31+05:30 IST

దేశంలో ఇన్‌ఫ్లూయింజా కేసులు ఎక్కువగా నమోదవుతూ, కరోనా కూడా బయటపడుతూండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా కేసులు బయటపడితే...

కాస్త జాగ్రత్త

దేశంలో ఇన్‌ఫ్లూయింజా కేసులు ఎక్కువగా నమోదవుతూ, కరోనా కూడా బయటపడుతూండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా కేసులు బయటపడితే, సోమవారం మరో 900కేసులు రికార్డయ్యాయి. గత పదిరోజులుగా యాక్టివ్‌కేసుల సంఖ్య క్రమేపీ హెచ్చుతూ, దాదాపు ఆరున్నరవేలకు చేరడంతో ఓ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరించిన మార్గదర్శకాలు విడుదలచేసింది. ఇతర అంటువ్యాధుల వేగవంతమైన వ్యాప్తి నేపథ్యంలో, కరోనా సోకే ప్రమాదం కూడా ఉన్నదనీ, బాధితుల్లో బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్ సోకినట్టు పరీక్షల్లో నిర్థారణైతే తప్ప యాంటీ బయోటిక్స్‌ వాడవద్దని చెబుతున్నారు. గతంలో కరోనా వేరియంట్ల పలువిడతల దాడిలో యాంటీబయోటిక్స్‌ వాడకం విపరీతంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాక, హైడ్రోక్లోరోక్విన్‌, ఐవర్‌మెక్టిన్‌, మోల్నుపిరావిర్‌, ఫావిపిరావిర్‌, అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌ ఇత్యాదివి కూడా వద్దని ఈ మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి.

హెచ్చరికలు ఉండాల్సిందే, జాగ్రత్తలు పాటించాల్సిందే. గత పన్నెండురోజుల్లోనే యాక్టివ్‌ కేసుల సంఖ్య మూడురెట్లు హెచ్చినప్పుడు ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నట్టే. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ కన్నేయండి, ఇన్‌ఫ్లూయెంజాతో పాటు కొవిడ్‌ ప్రభావాన్ని కూడా గమనించండి, పరీక్షలు పెద్ద సంఖ్యలో జరపండి, వాక్సినేషన్‌ మీద దృష్టిపెట్టండి అంటూ ఐదురోజుల క్రితమే రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు కూడా రాసింది. కానీ, మరోపక్క హెచ్‌3ఎన్‌౨ వ్యాప్తికూడా అధికంగానే ఉన్నందున రాష్ట్రాలకు ఇది విషమపరీక్షే. కొవిడ్‌ తరహా లక్షణాలే ఉన్న ఈ ఇన్‌ఫ్లుయెంజాతో శ్వాససంబంధిత సమస్యలు వచ్చిపడి ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇన్‌ఫ్లూయెంజా కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య కూడా రెండంకెలు దాటింది. కొత్తగా బయటపడిన ఎక్స్‌బిబి1.16వేరియంట్‌ ప్రస్తుతం కరోనా ఉధృతికి కారణమని ఇన్సాకాగ్‌ నిర్థారించింది. దీని తీవ్రత అంతగా ఉండకపోవచ్చునని చెబుతూనే, ఆ మాట నిర్థారణగా చెప్పడానికి తగినంత డేటా కూడా తనవద్ద లేదని అంటోంది. దేశంలో అధికజనాభాకు ఇప్పటికే పలు వాక్సిన్‌ డోసులు పడటం, సహజసిద్ధమైన రోగనిరోధకత ఉండటం వల్ల జనవరిలోనే దేశంలో బయటపడిన ఈ వేరియంట్‌ హద్దూఆపూలేని రీతిలో ప్రవర్తించకపోవచ్చు. అయితే, ఇమ్యూనిటీ గోడలను ఛేదించగలిగే శక్తి దీనికి ఉన్నందున, దీని ప్రవర్తన ఇంకా పూర్తిగా అంచనాలకు అందనందున మన జాగ్రత్తల్లో మనం ఉండటం తప్పనిసరి. మరీ ముఖ్యంగా ఇతరవైరస్‌లు చుట్టుముడుతున్నప్పుడు, శరీరంమీద ఇది చూపించగలిగే ప్రభావం ఎక్కువగా ఉండవచ్చును. కొన్ని మినహా హెచ్‌3ఎన్‌2, కొత్త కరోనా వేరియంట్‌ తెచ్చిపెట్టే లక్షణాలు దాదాపుగా ఒకటే కావడం మరో గందరగోళం. ఈ కారణంగానే మళ్ళీ మాస్కులు, చేతులు కడుక్కోవడం, దూరాన్ని పాటించడం ఇత్యాది జాగ్రత్తలు అవసరపడ్డాయి. కరోనా విషయంలో గతంలో అనుసరించిన జాగ్రత్తలతో రెండింటినీ దూరం పెట్టవచ్చునని నిపుణుల సలహా.

జలుబు చేస్తే భయపడిపోయే రోజులు గతించిపోయాయి కానీ, వేరియంట్లను ఎప్పటికప్పుడు అనుమానించక తప్పదు. ఎంతోకాలంగా దేశంలోనే ఉంటూ క్రమంగా బలహీనపడిపోయి, జన్యుమార్పులతో మళ్ళీ కొత్తగా విజృంభించే హెచ్‌3ఎన్‌2 విషయంలో సైతం భయం కంటే జాగ్రత్తే ముఖ్యం. దీనికి సంబంధించి సామూహిక రోగనిరోధకశక్తి ఏర్పడకపోవడం కూడా విజృంభణకు కారణమని అంటారు. ఎంత త్వరగా సోకుతుందో, అంత వేగంగా తగ్గిపోతుందనీ, ఆరోగ్యంగా ఉన్నవారిమీద దీనిప్రభావం తక్కువగా ఉంటుందనీ, కాలానుగుణంగా వచ్చిపోయేదే తప్ప కరోనా అంత తీవ్రమైనది కాదని వైద్యులు చెబుతున్నారు. కానీ, ఏ కొత్త వేరియంట్‌ కనిపించినా కరోనా విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం. ఇటీవల చైనా ఇనుపతెరలన్నీ ఎత్తివేసి, అక్కడి పరిస్థితులు అల్లకల్లోలమైపోయిన సందర్భంలో కేంద్రప్రభుత్వం ఆలస్యంగానైనా కొన్ని హెచ్చరికలు చేసింది. కానీ, జాగ్రత్తలు, వాక్సినేషన్‌ తదితర విషయాలు ప్రజలకు పెద్దగా పట్టలేదు. ప్రజలు కరోనా భయం నుంచి బయటపడినందుకు సంతోషించవలసిందే కానీ, కొత్తవేరియంట్‌ ముప్పును అతివేగంగా అంచనావేసి, ప్రజలను దారినపెట్టి, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.

Updated Date - 2023-03-21T00:57:31+05:30 IST