బైడెన్‌ వాచాలత

ABN , First Publish Date - 2023-06-23T02:37:26+05:30 IST

అసందర్భంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అలవాటేనని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను నియంత అంటూ తూలనాడటం అందులో భాగమేనని కొందరు...

బైడెన్‌ వాచాలత

అసందర్భంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అలవాటేనని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను నియంత అంటూ తూలనాడటం అందులో భాగమేనని కొందరు నమ్ముతున్నారు. అమెరికా చైనా సంబంధాలు వేగంగా మెరుగుపడుతున్నాయని, అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో చైనా అధ్యక్షుడితో భేటీ కావడం చరిత్రాత్మకమైనదనీ ముచ్చటపడిపోతున్నవారిని బైడెన్‌ వ్యాఖ్యలు నివ్వెరపరిచాయి. బ్లింకెన్‌ యావత్‌ కష్టాన్ని బైడెన్‌ ఈ ఒక్కమాటతో వృధాచేశారని వారి బాధ. ఉభయదేశాల సంబంధాలు మెరుగుపడే స్థితి ఎప్పటికీ ఉండదని, మరింత దిగజారి పరస్పరం కాలుదువ్వకపోతే చాలని సరిపెట్టుకున్నవారు సైతం బైడెన్‌ వ్యాఖ్యలు విని నొచ్చుకుంటున్నారు. చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకొనే విషయంలో ప్రభుత్వపరంగా ఒకపక్క ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, మళ్ళీ ఎన్నికల్లో నెగ్గి దేశాధ్యక్షుడు కావాలని ఆశిస్తున్న బైడెన్‌కు ఒక రాజకీయ నాయకుడిగా కొన్ని లెక్కలు ఉంటాయి.

చైనా ఘాటుగా స్పందించడం సరేసరి, బైడెన్‌ వ్యాఖ్యలమీద రష్యా సహా అనేక చైనా అనుకూల దేశాలు తీవ్రంగానే స్పందించాయి. అమెరికా ఎంత బాధ్యతారాహిత్యమైనదో, బైడెన్‌ ఎంతటి నోటి దురుసుమనిషో గుర్తుచేస్తూ కొందరు నాయకులు విమర్శలు చేశారు. ఆంటోని బ్లింకెన్‌ చైనా పర్యటన అద్భుతాలేమీ చేయలేకపోవచ్చు కానీ, మిగతా ప్రపంచానికి కొన్ని ఆశలు కలిగించింది. పరస్పరం అనుమానాలు, అపనమ్మకాలు, ఈర్ష్యాద్వేషాలున్న రెండుదేశాల మధ్య దాదాపు ఐదేళ్ళ తరువాత ఈ ఉన్నతస్థాయి భేటీ జరగడం, కేవలం విదేశాంగమంత్రులు మాత్రమే ముచ్చటించుకుంటారని అనుకుంటున్న తరుణంలో చైనా అధ్యక్షుడు స్వయంగా బ్లింకెన్‌తో భేటీ కావడం విశేషమైన పరిణామమే. అందుకే, సంబంధాలు తిరిగి సాధారణస్థితికి తేవాలని రెండుదేశాలూ సంకల్పం చెప్పుకోవడమే గొప్ప వార్త అయింది.

మొన్న ఫిబ్రవరిలో ఆంటోని బ్లింకెన్‌ చైనా పర్యటనకు సిద్ధపడుతున్న తరుణంలో నిఘా బెలూన్‌ ఆ పర్యటనను దెబ్బతీసింది. అది వాతావరణ అధ్యయనంలో భాగంగా ప్రపంచ సంచారం చేస్తున్న గాలిబుడగ మాత్రమేనని చైనా వాదించినప్పటికీ, తమ సైనిక రహస్యాలు తెలుసుకుంటోందన్న పేరిట అమెరికా యుద్ధవిమానాలతో చుట్టుముట్టి అధునాతన క్షిపణితో పేల్చివేసింది. జరిగిన దానిని ప్రత్యక్షప్రసారం చేసి అమెరికా పాలకులు కాలర్‌ ఎగరేశారు. నిజం ఏమిటన్నది ఎప్పటికీ తేలదు కానీ, నిఘా బెలూన్‌ పేరిట అనాదిగా అవసరార్థం గిట్టనిదేశాల మధ్య సాగే రాద్ధాంతాల్లో ఇదీ ఒకటి. ఈ ఘటన తరువాత మరింత కుదేలైన సంబంధాలను ఇటీవలి కాలంలో తిరిగి మరమ్మతు చేసుకొనే ప్రయత్నం జరిగింది. అమెరికా భద్రతా సలహాదారుతో చైనా అగ్రస్థాయి దౌత్యవేత్తలు వియన్నాలో భేటీ కావడం, ఆ తరువాత ఉభయదేశాల వాణిజ్యకార్యదర్శులు చర్చలు చేయడం, సీఐఎ డైరక్టర్‌ చైనా సందర్శించడం వంటివి బ్లింకెన్‌ పర్యటనకు దారి సుగమం చేశాయి.

అప్పుడు చిచ్చురేపిన ఆ బెలూన్‌ వివాదాన్నే ఇప్పుడు బైడెన్‌ తిరిగి ప్రస్తావించి, తాను ఎంతటి ధీరోదాత్తతతో దానిని పేల్చివేశానో గుర్తుచేసి, అందులో భాగంగా జిన్‌పింగ్‌ను నియంతలతో పోల్చారు. చైనా ఒత్తిళ్ళకు బైడెన్‌ లొంగిపోతున్నాడనీ, దానిని లొంగదీయలేకపోతున్నాడనీ, భౌగోళిక విస్తరణను అడ్డుకోలేకపోతున్నాడని రిపబ్లికన్లు దునుమాడుతున్న తరుణంలో, తాను చైనాను ఎంత గట్టిగా ఢీ కొడుతున్నానో చెప్పుకోవడం బైడెన్‌కు అవసరం. పార్టీకి నిధులు సేకరించే ఓ కార్యక్రమంలో, కేవలం స్వపక్ష రాజకీయ ప్రయోజనాలకోసమే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, సంబంధాలు అతుకుపడుతున్న తరుణంలో నియంత వంటి పదప్రయోగాలు సరికాదు. నిఘా బుడగ విషయాన్ని ఇరుదేశాలు పక్కనపెట్టేశాయని, అది ఇప్పుడు ముగిసిపోయిన అధ్యాయమని, రెండుదేశాలు ఇప్పుడు శాంతిసహకారాల గురించే ఆలోచిస్తున్నాయని చైనా నుంచి తిరిగివచ్చిన విదేశాంగమంత్రి గొప్పలకు పోతున్న తరుణంలో దేశాధ్యక్షుడే దానిని గుర్తుచేయడం సముచితంకాదు. త్వరలోనే చైనా అధ్యక్షుడితో భేటీ అవుతానని బ్లింకెన్‌ పర్యటన సందర్భంలో ప్రకటించిన బైడెన్‌, అంతలోనే ఇలా దిగజారి చేసిన వ్యాఖ్యలు మరింత అగాధాన్ని సృష్టిస్తాయని గ్రహించాలి. కేవలం ఒక గాలిబుడగ సయోధ్య యత్నాలను సులభంగా కూల్చగలిగే స్థితిలో రెండు అగ్రరాజ్యాల మధ్య అవిశ్వాసం ఉన్నప్పుడు మాటలు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Updated Date - 2023-06-23T02:37:26+05:30 IST