చినుకు చిక్కులు

ABN , First Publish Date - 2023-06-21T02:30:19+05:30 IST

రుతుపవనాల విస్తరణతో త్వరలోనే వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణశాఖ మరోమారు హామీ ఇచ్చింది. ఇప్పటికే భారీగా వర్షాలు దంచికొట్టాల్సిన తరుణంలో జూన్‌ మూడోవారం దాటిపోతున్నా చాలా రాష్ట్రాలు...

చినుకు చిక్కులు

రుతుపవనాల విస్తరణతో త్వరలోనే వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణశాఖ మరోమారు హామీ ఇచ్చింది. ఇప్పటికే భారీగా వర్షాలు దంచికొట్టాల్సిన తరుణంలో జూన్‌ మూడోవారం దాటిపోతున్నా చాలా రాష్ట్రాలు చినుకుకోసం అల్లాడిపోతున్న తరుణంలో ఐఎండి చల్లనిమాట చెబుతోంది. ముఖ్యంగా తీవ్రమైన వడగాడ్పులతో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాలకు, ఇప్పటికే లోటు ఎదుర్కొంటున్న కొన్ని దక్షిణాది రాష్ట్రాలకు రెండుమూడు రోజుల్లోనే వర్షాలు విస్తరిస్తాయన్న వార్త ఊరట కలిగించేదే.

బిపర్‌జోయ్‌ పేరుకు తగ్గట్టుగానే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పెద్ద విపత్తే సృష్టించింది. దానిబారిన పడిన గుజరాత్‌లో భయపడి నంతస్థాయిలో కాకున్నా భారీగానే నష్టాన్ని మిగల్చింది. దాని కదలికలను, ఉధృతిని ఐఎండి కనీసం నాలుగురోజుల ముందుగానే అంచనావేయగలగడం, కేంద్రంలో అధికారపార్టీ ముఖ్యుల స్వరాష్ట్రం కావడం వల్ల కూడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సమష్టికృషితో మానవనష్టాన్ని ఆ రాష్ట్రం బాగానే నియంత్రించగలిగింది. వందలాది చెట్లకు కత్తెరవేయడం నుంచి కనీసం లక్షమందిని సహాయక శిబిరాలకు తరలించడం వరకూ, భద్రతాదళాలు, సహాయక బృందాలు భారీసంఖ్యలో మోహరించడం వంటి చర్యలు విపత్తును సమర్థంగా ఎదుర్కోవడానికి దోహదపడ్డాయి. వేలాది విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో వందలాది గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం వంటి కొన్ని కష్టాలను మినహాయిస్తే, గుజరాత్‌ తీరప్రాంత జిల్లాలను అతలాకుతలం చేసి, రాజస్థాన్‌ను వరదలతోనూ ముంచెత్తిన బిపర్‌జోయ్‌ గండం నుంచి గట్టెక్కినందుకు సంతోషించాల్సిందే. అంతరిక్షంలో వాతావరణ ఉపగ్రహాల సంఖ్య బాగా పెరిగిన కారణంగా తుపాను రాకడను 60గంటల ముందే పసిగట్టే స్థాయికి మన సమర్థత హెచ్చిందనీ, అందువల్ల, బంగాళాఖాతం నుంచో, అరేబియా సముద్రం నుంచో తుపాను బాధ ఉన్నప్పుడు కనీసం ప్రాణనష్టాన్ని పరిమితం చేయగలుగుతున్నామని నిపుణులు అంటున్నారు. అయితే, అరేబియా సముద్రం తీవ్రస్థాయి తుపానులకు కేంద్రం కావడం, గత నాలుగు దశాబ్దాలతో పోల్చితే భూతాపం పెరుగుదల కారణంగా ఈ సముద్రజలాల ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీల వరకూ హెచ్చి వరుస తుఫానులకు జన్మస్థానం అవుతూండటం ఒక ప్రమాదకరమైన పరిణామం. భవిష్యత్తులో సైతం బిపర్‌జోయ్‌ తరహా తుపానులను సమర్థంగా ఎదుర్కోవాలంటే, ఒక శాశ్వత విధానం, సువ్యవస్థిత యంత్రాగం అవసరం. తీరప్రాంతాల పరిరక్షణకు ఉద్దేశించిన నియమనిబంధనలను వమ్ముచేయడం మాని, వాటిని సమర్థవంతంగా అమలుచేయడం ముఖ్యం.

రుతుపవనాలమీద బిపర్‌జోయ్‌ ప్రభావం ఉండబోదని వాతావరణశాస్త్రవేత్తలు ముందుగా అన్నప్పటికీ, ఇప్పుడు దానిదెబ్బతోనే రుతుపవనాలు వెనకపట్టుపట్టాయని చాలామంది అంగీకరిస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో అధికవర్షపాతం నమోదైన కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే, ఇప్పుడు వడగాడ్పులతో మరణాలు నమోదవుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ పాటు జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు తీవ్ర వర్షలోటును ఎదుర్కొంటున్నాయి. రుతుపవనగాలుల ప్రయాణాన్ని ఈ తుపాను ప్రభావితం చేయడంతో వర్షం కురవకపోవడంతో పాటు తీవ్రమైన వేడిమిని అనుభవించాల్సి వస్తున్నది. రుతుపవనాలకు అవసరమైన తేమను ఈ తుపాను హరించడంతో ఒకదానితో ఒకటి ముడిపడిన అన్ని బాధలూ చుట్టుముట్టాయి. మేఘాలు లేని ఆకాశం అత్యధిక రేడియేషన్‌కు కారణమైంది. నైరుతి రుతుపవనాల ప్రవేశం ఒక వారం ఆలస్యం కావడం నుంచి వాటి విస్తరణ, విస్తృతివరకూ చాలా అంశాలను ప్రభావితం చేసిన బిపర్‌జోయ్‌ క్షీణించడంతో దేశం ఇకపై కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. వానచినుకుకోసం ఎదురుచూస్తున్న జనాలకు ఉపశమనం దక్కవచ్చు. ఫిబ్రవరి చివరి పదిరోజుల నుంచే ఈ మారు భానుడు జనాన్ని భయపెట్టాడు. వాతావరణశాఖ వడగాలుల హెచ్చరికలు, కేంద్రప్రభుత్వం హితవులు ఫిబ్రవరిలోనే జరిగిపోయాయి. పసిఫిక్‌ మహాసముద్రం ఎల్‌నినోతో భయపెట్టింది. వేసవిని సమర్థంగా ఎదుర్కోవడానికి పాలకులు ఏమి ప్రయత్నాలు చేశారో తెలియదు కానీ, సరిగ్గా నాలుగు చినుకులు కురిసే బిపర్‌జోయ్‌ ముంచుకొచ్చి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కురవబోయే వర్షాలు కొంతమేరకైనా జరిగిన నష్టాన్ని భర్తీచేస్తాయని ఆశిద్దాం.

Updated Date - 2023-06-21T02:30:19+05:30 IST