ప్రాణం ఖరీదు?

ABN , First Publish Date - 2023-03-17T01:52:46+05:30 IST

దాదాపు నాలుగుదశాబ్దాలనాటి భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో, బాధితులకు అదనపు నష్టపరిహారం కోసం కేంద్రప్రభుత్వం చేసిన ప్రయత్నం సుప్రీంకోర్టులో వీగిపోయింది...

ప్రాణం ఖరీదు?

దాదాపు నాలుగుదశాబ్దాలనాటి భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో, బాధితులకు అదనపు నష్టపరిహారం కోసం కేంద్రప్రభుత్వం చేసిన ప్రయత్నం సుప్రీంకోర్టులో వీగిపోయింది. కేంద్రప్రభుత్వం ఈ క్యూరేటివ్‌ పిటిషన్‌ 2010లో దాఖలు చేసిన నేపథ్యంలో, పరిహారం విషయంలో బాధితులకు అన్యాయం జరిగిందన్న విషయం పాతికేళ్ళకు కానీ మీకు గుర్తుకురాలేదా? అని మొన్న జనవరిలో వాదోపవాదాల సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ సందర్భంగానే న్యాయమూర్తులు ప్రభుత్వ వాదనలపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తంచేశారు. ఒకసారి సెటిల్‌మెంట్‌ జరిగిపోయిన తరువాత, దానిని తిరిగి తెరవడం సరికాదని, కేవలం ఒక కేసు విషయంలో తాము చొరవచూపితే, భవిష్యత్తులో సవాలక్ష కేసులు పుట్టుకొస్తాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తీర్పుకూడా అదే కోణంలో వెలువడింది కానీ, భిన్నంగా కనుక ఉండివుంటే, నష్టపరిహారం విషయంలో తమకు అన్యాయం జరిగిందని భావించే ఇతరత్రా కేసుల్లోని బాధితులకు కూడా ఉపశమనంగా ఉండేది.

దుర్ఘటనను నివారించడంలోనే కాదు, చివరకు సముచిత న్యాయం చేకూర్చడంలోనూ మన వ్యవస్థలు విఫలమవుతున్నాయనడానికి ఈ కేసు నిదర్శనం. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనల్లో ఇది ఒకటి. మిథైల్‌ ఐసో సయనేడ్‌ అనే విషరసాయనాన్ని భద్రపరిచే విషయంలో బహుళజాతి సంస్ధ యూనియన్‌ కార్బయిడ్‌ నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందన్నది స్పష్టం. కానీ, నాలుగువేలమరణాలకు, ఐదులక్షలమంది యాతనకు కారణమైన ఈ దుర్ఘటన విషయంలో వరుస ప్రభుత్వాలు కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూవచ్చాయి. కంపెనీ అధినేత దేశం విడిచిపారిపోగలిగాడు. అమెరికాలో కూచొని ఇక్కడి న్యాయస్థానాలకు సవాలు విసరగలిగాడు. ఐదేళ్ళ తరువాత ఓ ఏడువందలకోట్ల పరిహారాన్ని మాత్రమే ప్రభుత్వం రాబట్టగలిగింది. అధికారులు ఒప్పందంమీద సంతకాలు చేశారు, సర్వోన్నత న్యాయస్థానం సరేనన్నది. న్యాయం చేయకపోగా మరింత అన్యాయం చేశారని బాధితుల పక్షాన పోరాడిన సంస్థలూ, సంఘాలది అరణ్యరోదన అయింది.

అప్పట్లో ఇచ్చినది తగినంత నష్టపరిహారం అన్న కోవలోకి రాదు కనుక, అనంతరకాలంలో మరణాలు, దుష్ర్పభావాలు, అనుభవించిన వేదన విషయంలో మరింత అదనపు సమాచారం వచ్చిచేరింది కనుక మరో ఏడున్నరవేలకోట్లు ఇవ్వాలని కేంద్రం అంటున్నది. ఆ డేటాని నమ్మక్కర్లేదనీ, ఇలా పరిహారాలు ఇస్తూపోతుంటే ఈ తరహా కేసులు మరిన్ని న్యాయస్థానాలను చుట్టుముట్టేస్తాయని సంస్థ తరఫు న్యాయవాది హెచ్చరించారు. క్యూరేటివ్‌ పిటిషన్‌ ఈ కేసుకు వర్తించదని, మోసం జరిగిందని కేంద్రం వాదించివుంటే మరోలాగ ఉండేదని న్యాయమూర్తులకు అనిపించింది. ఇచ్చిన మొత్తం సరిపోతుందనీ, పంచగా ఇంకా మిగిలిపోతుందనీ అప్పట్లో కేంద్రం తలూపిన పాపానికి, ఇప్పుడు కన్నుమూసిన, గాయపడినవారిసంఖ్య రెట్టింపు అయిందన్న వాదన నిలవలేకపోయింది. ఇది చాలక, సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు బాధితులకు బీమా సౌకర్యాన్ని వర్తింపచేయకపోవడం, రిజర్వుబ్యాంకులో మూలుగుతున్న యాభైకోట్లను ఇంకా పంచకపోవడం వంటి నిర్లక్ష్యాలు అనేకం కేసు బలహీనపడటానికి తోడైనాయి.

అలనాటి కుంభకోణాలను, నిర్ణయాలను తవ్వితీస్తూ ఇప్పటికీ కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టాలని ప్రయత్నించే మోదీ ప్రభుత్వం ఈ కేసుదాఖలైన నాలుగేళ్ళలోనే అధికారంలోకి వచ్చింది కనుక దానిపై మరింత శ్రద్ధపెట్టివుంటే బాగుండేది. యూనియన్‌ కార్బయిడ్‌ అధినేత వారెన్‌ ఆండర్సన్‌తో రాజీవ్‌ గాంధీ లాలూచీపడ్డారనీ, పారిపోయేందుకు సహకరించారనీ, ఆ తరువాత రహస్యంగా కలిశారనీ అంటూ ఈ దారుణాన్ని రాజకీయంగా బాగా వాడుకున్న బీజేపీ, అనంతరం వాజపేయి ఏలుబడిలో అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించివుంటే బాగుండేది. రాజీవ్‌ మీద తీవ్రవిమర్శలు చేసిన సుష్మాస్వరాజ్‌ ఆ ఊసే వదిలేస్తే, న్యాయమంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీ నిండుసభలోనే సీఈవోగా ఉన్నంత మాత్రాన ఆండర్సన్‌కు అన్నీ తెలుస్తాయా అంటూ సమర్థించుకొచ్చారు. రెండుదశాబ్దాల పాటు ఆండర్సన్‌ అప్పగింత విషయంలో అమెరికా ఏ చొరవా చూపించకపోయినా ఏడేళ్ళు అధికారంలో ఉన్న వాజపేయి ప్రభుత్వం కనీసం నిరసన కూడా వ్యక్తంచేయలేదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం అదనపు నష్టపరిహారాన్ని సాధించే విషయంలోనూ విఫలమైంది. తమ ప్రజల ప్రాణాల విలువను ఇక్కడి పాలకులు, వ్యవస్థలే గుర్తించనప్పుడు బహుళజాతి సంస్థలనూ, ఆండర్సన్‌లనూ ఆడిపోసుకొని ప్రయోజనం లేదు.

Updated Date - 2023-03-17T01:52:46+05:30 IST