దాడి–దాష్టీకం
ABN , First Publish Date - 2023-10-11T03:21:12+05:30 IST
ఇజ్రాయెల్‌మీద పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ చేసిన మెరుపుదాడి, గాజా భూభాగంలో ఇజ్రాయెల్ ప్రతీకారదాడులతో, ఇరువైపులా అనతికాలంలోనే సంభవించిన...
ఇజ్రాయెల్‌మీద పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ చేసిన మెరుపుదాడి, గాజా భూభాగంలో ఇజ్రాయెల్ ప్రతీకారదాడులతో, ఇరువైపులా అనతికాలంలోనే సంభవించిన వందలాది మరణాలు, అపరిమితమైన విధ్వంసం ఆవేదన కలిగిస్తున్నది. ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ పక్షాన వివిధ దేశాలు, రాజ్యేతర శక్తులు రంగప్రవేశం చేస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో జరగబోయే వినాశనం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే భయం కలుగుతోంది.
హమాస్ దౌష్ట్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇజ్రాయెల్‌కు సంపూర్ణ సహకారం ప్రకటిస్తూ ఐదు అగ్రరాజ్యాలు తమ ప్రకటనలో, హమాస్ ఎంత భయానకమైన ఉగ్రవాద సంస్థో, దాని గతం ఎంత దుర్మార్గమైనదో సుదీర్ఘంగా వివరించాయి. అదే ప్రకటనలో పాలస్తీనా ప్రజల ‘న్యాయబద్ధమైన’ ఆకాంక్షల గురించి ఓ నామమాత్ర ప్రస్తావన చేస్తూ, ఈ ఆకాంక్షలకు హమాస్ ప్రతినిధి కాదని, దాని చర్యలు హింసను పెంచడానికి తప్ప పాలస్తీనియన్ల సంక్షేమానికి ఉపకరించవని వ్యాఖ్యానించాయి. అది నిజమే కావచ్చు కానీ, పాలస్తీనియన్ల సంక్షేమం, ఆకాంక్షల విషయంలో ఈ అగ్రరాజ్యాలన్నీ ఏడున్నరదశాబ్దాలుగా ఏం చేశాయి? అవి అనుసరిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ అనుకూల వైఖరే హమాస్ వంటి ఒక మిలిటెంట్ సంస్థ ఇంతగా బలపడటానికి దోహదం చేసింది. హమాస్ స్వయంగా సముద్ర, వాయు, భూతల మార్గాల్లో దాడిచేయడమే కాదు, దానికి తోడుగా, వేలాదిమంది యువకులు ప్రాణత్యాగానికి సిద్ధపడి అడ్డుగోడలు ఛేదించి మరీ ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. నాలుగుతరాలుగా సొంత భూభాగంలో పరాయివారుగా ఉంటూ, ఆంక్షలు, నిర్బంధాల మధ్య కనీసం జీవించేహక్కుకు కూడా నోచుకోని స్థితిలో సామాన్యులు సైతం ఇటువంటి మిలిటెంట్ సంస్థలవైపు ఆకర్షితులు కావడం సహజం. ఇజ్రాయెల్ ఏర్పాటే ఓ వివాదాస్పదమైన ప్రక్రియ. ఈ ఏడున్నరదశాబ్దాల కాలంలో కనీసం అరడజను భద్రతామండలి తీర్మానాలు, ఓస్లో ఒప్పందాలను అది యథేచ్ఛగా బేఖాతరు చేసింది. తీర్మానాలను ప్రవేశపెట్టిన అగ్రరాజ్యాలే ఇజ్రాయేల్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటూ, ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిరంకుశ వైఖరిని సమర్థిస్తుంటే, పాలస్తీనియన్లకు శాంతి ఒప్పందాలమీద మిగతా ప్రపంచంమీద నమ్మకం సడలిపోకుండా ఎలా ఉంటుంది?
సరిగ్గా యాభైయేళ్ళక్రితం ఆరు అరబ్‌దేశాలను ఆరురోజుల్లోనే ఓడించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఎంతో బలమైన నిఘావ్యవస్థ, అత్యంత శక్తిమంతమైన సైన్యం ఉండికూడా హమాస్ దాడిని నిలువరించలేకపోయింది. ఇజ్రాయెల్–అరబ్బుదేశాల మధ్య ఇటీవలికాలంలో మొగ్గతొడికిన మైత్రిని విచ్ఛిన్నం చేయడం ఈ దాడి లక్ష్యం కావచ్చు. చివరకు సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్‌తో సంధికి సిద్ధపడుతున్న దశలో హమాస్ ఈ దాడితో అరబ్‌దేశాలను తీవ్ర సందిగ్ధంలో పడేసింది. ఇజ్రాయెల్ ప్రతీకారం ఎంత బీభత్సంగా ఉంటుందో చెప్పనక్కరలేదు కనుక, ఆ రక్తపాతం మధ్యన ఈ దేశాలు తాము ఎటువైపో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. హమాస్ దాడితో పాలస్తీనా–ఇజ్రాయెల్ మధ్య శాంతియత్నాలకు తీవ్ర విఘాతం కలిగిందన్న వ్యాఖ్యలు అర్థంలేనివి. బెంజమిన్ నెతన్యాహూ తన వరుస పదవీకాలంలో ఎన్నడూ పాలస్తీనీయన్లతో న్యాయబద్ధంగా వ్యవహరించలేదు. పైగా, ఇజ్రాయెల్ చరిత్రలోనే తొలిసారిగా అతిమితవాద పక్షాలన్నింటినీ కూడకట్టి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన గతంలో కంటే దుర్మార్గంగా వ్యవహరించడం ఆరంభించారు. ఉన్మాదులతో నిండిన ఆయన ప్రభుత్వం ఆక్రమితప్రాంతాల్లో పాల్పడే దుశ్చర్యలకు న్యాయస్థానాలు కొద్దోగొప్పో అడ్డుతగులుతున్నందున జడ్జీల నియామక ప్రక్రియనే తన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. లక్షలాదిమంది ఇజ్రాయెల్ ప్రజలు ఆయన న్యాయసంస్కరణలకు వ్యతిరేకంగా రోడ్లమీదకు వస్తున్నారు. వేలాదిమంది రిజర్వుసైనికులు, మాజీ న్యాయమూర్తులు సహా అన్నిరంగాల ప్రముఖులు ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇజ్రాయెలీల రక్షకుడిగా తనను తాను చెప్పుకొనే నెతన్యాహూ హమాస్ దాడితో బలహీనుడిగా తేలిపోతారన్నది ఒక వాదన. కానీ, గతంలో ఎన్నడూ లేనంత విస్తృతమైన, బలమైన దాడికి హమాస్ సిద్ధపడుతున్నదని, ఆయుధాలు కూడగడుతున్నదనీ పదిరోజులక్రితమే అందిన నిఘాసమాచారాన్ని నెతన్యాహూ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారన్న కథనాలు నిజమైన పక్షంలో, ఈ సంక్షోభం ఆయనను మరింత బలోపేతం చేస్తుంది. హమాస్‌ని మాత్రమే కాదు, పాలస్తీనానే తుడిచిపెట్టే దిశగా ఆయన వీరంగం వేయడానికి, మరోపక్క స్వదేశంలో అసమ్మతి ఊసే లేకుండా చేయడానికి ఇది ఉపకరిస్తుంది. హమాస్ మీద ఉన్న కక్షనంతా ఆయన అమాయకులమీద ఎలా చూపిస్తున్నారో కనిపిస్తూనే ఉంది.