ప్రజాస్వామ్య సునామీ

ABN , First Publish Date - 2023-05-17T01:01:28+05:30 IST

థాయ్‌లాండ్‌ పేరు వినగానే చీకటి వ్యవహారాలు, చీకోటి ప్రవీణ్‌ క్యాసినోలు గుర్తుకు వస్తాయి కానీ, ఆ దేశప్రజలు మొన్న ఆదివారం జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారు...

ప్రజాస్వామ్య సునామీ

థాయ్‌లాండ్‌ పేరు వినగానే చీకటి వ్యవహారాలు, చీకోటి ప్రవీణ్‌ క్యాసినోలు గుర్తుకు వస్తాయి కానీ, ఆ దేశప్రజలు మొన్న ఆదివారం జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారు. హార్వర్డ్‌లో చదువుకున్న యువకుడి సారథ్యంలోని కొత్తపార్టీకి అత్యధికస్థానాలు కట్టబెట్టారు. రెండుదశాబ్దాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి తరువాతి స్థానం ఇచ్చారు. దాదాపు దశాబ్దకాలంగా సైన్యం కనుసన్నల్లో నడుస్తున్న అధికారపార్టీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రాజకీయాల్లో సైన్యం ప్రమేయాన్ని, పెత్తనాన్ని నిరసిస్తూ, ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు విశేషమైనది.

థాయ్‌లాండ్‌లో ౨020లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు జరిగాయి. ప్రధానంగా సైనికపాలనకు, రాజరికానికి వ్యతిరేకంగా యువతరం సాగించిన ఉద్యమం దేశాన్ని కుదిపేసింది. రాజు అధికారాలకు కత్తెరవేయాలని, సైన్యం ఆశీస్సులున్న నామమాత్ర ప్రధాని రాజీనామా చేయాలన్న ఆ ఉద్యమాన్ని నియంత్రించడానికి పాలకులు అత్యయిక స్థితి విధించాల్సి వచ్చింది. 2018లో విదేశాల్లో చదువుకొని తిరిగి వ్యాపారం నిమిత్తం థాయ్‌లాండ్‌కు వచ్చిన పిటా లిమ్జాయోన్రత్‌ ఈ పోరాటంలో చురుకుగా వ్యవహరించారు. ఆయన కీలకపాత్ర పోషించిన ప్రొగ్రెసివ్‌ ఫ్యూచర్‌ ఫార్వర్డ్‌ పార్టీ మరుసటి ఏడాది జరిగిన నామమాత్రపు ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచింది. దీనితో సైన్యం కక్షకట్టి కేసుల్లో ఇరికించి, చివరకు ఆ పార్టీ రద్దయ్యేట్టుగా చేసింది. ఈ పోరాటం ప్రజల దృష్టిలో పిటాను హీరో చేసింది. ఇప్పుడాయన మూవ్‌ఫార్వర్డ్‌ పార్టీ పేరుతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రాగానే ప్రజలు అత్యధికస్థానాలు కట్టబెట్టారు.

రాచరికంపై విమర్శలను ఏమాత్రం సహించని ‘లెస్‌–మెజెస్టే’ వంటి కఠినమైన చట్టాలున్న థాయ్‌లాండ్‌లో ఆ వ్యవస్థ కోరలు కత్తిరించాలన్న ప్రజాపోరాటంలో వందలాదిమంది అరెస్టయ్యారు. రాజు చేతుల్లో అపారమైన సంపద ఉండటం, కొంతమేరకు సైన్యం ఆయన అధీనంలో ఉండటం ప్రజల్లో రాచరికంపై ఆగ్రహానికి కారణం. ముఖ్యంగా కరోనా కాలంలో ప్రజలు కష్టాలు పడుతుంటే, రాచకుటుంబం విలాసాలకు లోటు లేకపోవడం సామాన్యులను ఆగ్రహానికి గురిచేసింది. ఇప్పుడు దిగువసభ ఎన్నికల్లో విస్తృత ప్రజాదరణ సాధించిన పిటా లిమ్జాయోన్రత్‌ రాజు అధికారాలకు కత్తెరవేయాలన్న తన లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు మరోమారు ప్రకటించారు.

రెండుదశాబ్దాలుగా విపక్షపాత్ర పోషిస్తున్న మాజీ ప్రధాని తక్షణ్‌ శినవాత్రకు చెందిన ఫ్యూథాయ్‌ పార్టీ మాత్రం లెస్‌–మెజెస్టీ సంస్కరణల విషయంలో నీళ్లునములుతున్నది. మంచి మెజారిటీతో అధికారంలోకి వస్తుందనుకున్న ఈ పార్టీ, ఎన్నికల ప్రచారంలో సైతం ఈ అంశంపై బలంగా మాట్లాడకపోవడం వల్లనే థాయ్‌ యువత దానికి రెండోస్థానంతో సరిపెట్టింది. ఈ పార్టీతోనూ, మరికొన్ని చిన్నా చితకాపార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, తాను ప్రధాని అయ్యేందుకు మూవ్‌ఫార్వర్డ్‌ అధినేత పిటా ప్రయత్నిస్తున్నారు. కానీ, ప్రజాక్షేత్రంలో ఎంతబలం ఉన్నా, ఎన్ని స్థానాలు గెలుచుకున్నా, సెనేట్‌ ఆమోదంలేనిదే ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు లేవు. ఐదువందలమంది సభ్యులున్న దిగువసభతోపాటు, పూర్తిగా సైన్యం నియమించిన 250మంది సభ్యుల ఎగువసభ కూడా ప్రధాని ఎంపికలో కీలకపాత్ర పోషిస్తుంది. 2017లో రాజ్యాంగాన్ని పూర్తిగా తిరగరాసిన మిలటరీ తన అశీస్సులు లేని ఏ ప్రభుత్వం అక్కడ అధికారం చేపట్టలేని, మనుగడసాధించలేని స్థితిని కల్పించింది. దీనికితోడు, ఇప్పుడు గతంలో మాదిరిగా మూవ్‌ఫార్వర్డ్‌ పార్టీని కూడా పలు కేసులతో చుట్టుముట్టి, కోర్టు ఆదేశాలద్వారా రద్దుచేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాచరికానికి, సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రధానంగా యువతరమే పాల్గొని ఉండవచ్చును కానీ, ఇప్పుడు మూవ్‌ఫార్వర్డ్‌ పార్టీని అన్ని వయసులవారూ ఆదరించారు. అన్ని రంగాల, సమస్త వ్యవస్థల ప్రక్షాళనకు హామీపడుతూ, సామాన్యుల జీవితాన్ని ఉద్ధరించేందుకు హామీ పడ్డ ఓ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోజూస్తే ఈ మారు ప్రజలు ఏమాత్రం సహించరు. రెండుదశాబ్దాలుగా ఎన్నికలు జరిగినప్పుడల్లా మార్పు ఆశిస్తూ వచ్చిన ప్రజలు ఈ మారు కూడా మోసపోతే ప్రజాస్వామ్య సాధనకోసం మరింత ఉద్యమిస్తారు. అత్యయిక పరిస్థితులు కూడా రాచరికాన్ని రక్షించలేని వాతావరణాన్ని చేజేతులా సృష్టించడం పాలకులకు మంచిది కాదు.

Updated Date - 2023-05-17T01:01:28+05:30 IST